TSPSC Group I: అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?.. Group I పరీక్ష రదు?
అభ్యర్థుల సంఖ్య అలా ఎలా పెరిగిందని, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంతకాల్లో భారీగా మార్పు ఉన్నా ఇన్విజిలేటర్ ఎందుకు అభ్యంతరం తెలుపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకసారి ప్రశ్నపత్నం లీకై మరలా పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి తీర్పు రిజర్వు చేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
తప్పిదాలు పట్టించుకోలేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాది
జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని, ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి ఆగస్టు 3న విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు.
‘బయోమెట్రిక్ తీసుకోని కారణంగా పలు తప్పిదాలకు చోటిచ్చినట్లు అయ్యింది. హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. ఓఎంఆర్ షీట్‌ను మ్యానిప్యులేట్ చేసేందుకు ఇది అవకాశం ఇస్తుందని పిటిషనర్లు వినతిపత్రం ఇచ్చినా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్నారు. పైగా అత్యంత కీలక పోస్టులు భర్తీ చేసే గ్రూప్–1 విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కీలకమైన గ్రూప్–1 పరీక్షలో వేలిముద్రలు తీసుకోని టీఎస్‌పీఎస్సీ..గ్రూప్–4 పరీక్షకు మాత్రం వేలిముద్రలు తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా ఆదేశించాలి..’అని కోరారు.
పకడ్బందీగా ప్రిలిమ్స్: ఏజీ
టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ‘గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణకు కమిషన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేసింది. బయోమెట్రిక్ తీసుకోలేదన్న ఆరోపణ సరికాదు. ఆధార్, పాన్, ఎన్నికల కార్డు లాంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో హాల్ టికెట్లను సరిపోల్చి చూశారు.
ఆ తర్వాతే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు ఇన్విజిలేటర్లు అనుమతించారు. ప్రిలిమ్స్‌ను కమిషన్ సమర్థవంతంగా నిర్వహించింది. ఓ అమ్మాయి సంతకంపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరం సరికాదు. పెళ్లి అయిన తర్వాత పెళ్లికి ముందు ఉన్న ఇంటి పేరు మారడంతో సంతకంలో తేడా వచ్చింది.
ఈ ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదు..’అని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. వీరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని, టీఎస్‌పీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు, మెయిన్స్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.