Inter Admissions: ప్రభుత్వ కళాశాలలే మిన్న.. అడ్మిషన్ ప్రక్రియ ఇలా..
మే 21న ఆయన శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్నిరకాల కోర్సులు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు నచ్చిన కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి ఆర్థికంగా అవస్థల పాలు కావొద్దన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మే 9వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
2023– 24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 9,553 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరంతా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందనున్నారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 ప్రైవేట్ కళాశాలలు, 7 మోడల్, 6 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్, 6 ట్రైబల్, 2 మైనార్టీ, 6 మహాత్మ జ్యోతిబాపూలే, 4 సోషల్ వెల్ఫేర్ కలిపి మొత్తం 60 కళాశాలలు ఉన్నాయని తెలిపారు. వీటితో ఈనెల 31వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
అడ్మిషన్ ప్రక్రియ ఇలా..
జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక ఎస్‌ఎస్‌సీ మెమో ఆధారంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం ఉంటుందన్నారు. ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ మెమో అందజేసిన తర్వాతనే అడ్మిషన్ నిర్ధారిస్తామన్నారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా అర్హతలున్న వారికి 5 శాతం, ఎక్స్ సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ వారికి 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10, బాలికలకు 33.3 శాతం సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. అయితే పదో తరగతిలో పొందిన గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని సూచించారు.