Skip to main content

Telangana: హైస్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత... సాగని ‘సబ్జెక్ట్‌’ చదువు!

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్ల టీచర్లు పదోన్నతులపై వెళ్లారు.
Shortage of school assistants in high schools

 మరికొందరు వివిధ సబ్జెక్టుల ఎస్‌ఏలు బదిలీలపై వెళ్లారు. దీంతో జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత ఏర్పడింది. జిల్లాలో 143 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూళ్లున్నాయి. అందులో వివిధ సబ్జెక్టులతోపాటు బయాలాజికల్‌ సైన్స్‌, సోషల్‌, మేథమెటిక్స్‌ టీచర్లు ఎక్కువ మంది పదోన్నతులు, బదిలీలపై వెళ్లారు.

ఆయా సబ్జెక్టుల టీచర్లు తక్కువగా ఉన్నారు. చాలా చోట్ల సబ్జెక్టుల బోధన లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 7నుంచి పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. కాగా.. టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

చదవండి: Collector Muzammil Khan: స్కూళ్లలో ‘లంచ్‌, లర్న్‌’ కార్యక్రమం అమలు

డీఈఓ ఎండీ అబ్దుల్‌హై మండలాల్లో ఏయే హైస్కూళ్లలో ఏయే సబ్జెక్టుల టీచర్ల కొరత ఉందో మండల విద్యాశాఖాధికారుల ద్వారా ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. అక్కడ టీచర్లను వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసేందుకు కొన్ని రోజులుగా కసరత్తు చేశారు.

జిల్లాలో 360 మంది బదిలీలు

165 మంది వరకు ఉపాధ్యాయులు రిలీవ్‌ అయ్యారు. మిగతా ఎక్కడివారక్కడే జిల్లాలో కొన్ని నెలల క్రితం స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో ఉపాధ్యాయులు (ఎస్‌ఏలు, పీడీలు, పీసీహెచ్‌ఎంలు) 320 మంది బదిలీ అయ్యారు. వారిలో 165 మంది వివిధ పాఠశాలల నుంచి రిలీవ్‌ కాగా.. మరో 155 మంది వరకు ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయలేదు.

సబ్‌స్టిట్యూట్‌ వస్తేనే వీరిని రిలీవ్‌ చేయాల్సి ఉంటుంది. రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం పాఠశాలలో కనీస సంఖ్యలో ఉపాధ్యాయులు ఉంటేనే రిలీవ్‌ చేయాలని చెప్పడంతో మిగతా ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ.. వారు పని చేస్తున్న పాఠశాలల్లోనే ఉండిపోయారు.

చదవండి: Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..

ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతుల ప్రక్రియ కల్పించాల్సి ఉండగా.. ఈఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లో నిలిపేసిన విషయం తెలిసిందే. దీంతో కూడా సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది.

రేషనలైజేషన్‌ ప్రకారం..

జిల్లాలో వివిధ సబ్జెక్టుల కొరతతో పాటు పలు పాఠశాలల్లోనూ టీచర్ల కొరత తీరాలంటే కనీసం 120 మంది అవసరం. ఆయా పాఠశాలల్లో రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస సంఖ్యలో ఉండాల్సిన ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా ఉన్న చోటు నుంచి.. అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. కొన్ని పాఠశాలల్లో జీరో విద్యార్థులున్నారు.

హైస్కూళ్ల నుంచి హైస్కూళ్లకు సరిపడా వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌కు సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలల ఎస్‌జీటీలను కూడా హైస్కూళ్లకు అడ్జెస్ట్‌ చేశారు. ఏ మండలంలోని పాఠశాలలకు ఆమండలంలోనే సరిపడా సర్దుబాటు లభించకపోవడంతో.. జిల్లాని యూనిట్‌గా తీసుకొని సర్దుబాటు చేశారు.

జిల్లాలో తొలిదశలో 88 మంది టీచర్లను వివిధ పాఠశాలలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేస్తూ.. డిసెంబ‌ర్ 13న‌ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై ఉత్తర్వులు జారీ చేశారు. ఉదాహరణకు హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో 800ల మంది విద్యార్థులున్నారు. అక్కడ టీచర్ల కొరత ఉంది ఈవర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌లో ఆ స్కూల్‌కు ఒక హిందీ పండిట్‌, ఒక ఫిజిక్స్‌, ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడిని కేటాయించారు.

ఇలా.. అనేక పాఠశాలల్లో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. రెండో దశలో జిల్లాలో మిగతా అవసరం లేని చోట ఉండే ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోటుకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేస్తారని భావిస్తున్నారు. జిల్లాలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ కింద ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో డిసెంబ‌ర్ 14న జాయిన్‌ కావాల్సి ఉంటుంది.

sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 03:23PM

Photo Stories