Skip to main content

No Admissions Board: మాస్టార్‌తోనే మేమూ.. ఈ మాస్టార్ ఊన్న‌ పాఠశాలలో జూన్‌ చివరిలోనే ‘నో అడ్మిషన్‌’బోర్డు

జన్నారం: బాగా చదువు చెప్పి.. బదిలీ అయ్యే ఉపాధ్యాయుడిని కన్నీటితో సాగనంపిన పిల్లలను చూశాం. ఆ ఉపాధ్యాయుడే కావాలని ఆందోళన చేసిన స్కూలు పిల్లలను చూశాం.
Jajala Srinivas

కానీ ఇక్కడ విద్యార్థుల భవితకు కృషి చేసిన ఓ టీచర్‌ బదిలీ కాగా.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే పాత స్కూలు విద్యార్థులూ చేరారు. ఒకరో ఇద్దరోకాదు.. ఏకంగా 141 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుడు బదిలీ అయిన పాఠశాలలోనే చేరడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మండలంలోని పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో 12 ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్‌ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన పాఠశాలలో చేరిన మొదట్లో 27 మంది విద్యార్థులు ఉండేవారు. అంకితభావం, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యాబోధన చేస్తూ మంచి ఫలితాలు తీసుకొచ్చారు.

చదవండి: KGBV School Admissions: కస్తూర్భా విద్యాలయాల్లో ప్రవేశాలు ఫుల్‌,ఇంగ్లీష్‌ మీడియంతో ప్రైవేటుకు ధీటుగా..

గురుకుల, నవోదయ వంటి పరీక్షలకు శిక్షణ ఇస్తూనే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. అనతికాలంలోనే విద్యార్థుల సంఖ్య 252కు చేరింది. గత ఐదేళ్లుగా జూన్‌ చివరిలోనే ఆ స్కూలో ‘నో అడ్మిషన్‌’బోర్డు తగిలిస్తున్నారు.

పొనకల్‌లో ఉన్న పాఠశాలకు మండలంలోని పది గ్రామాల నుంచి పిల్లలను తల్లిదండ్రులు ఆటోలో పంపించేవారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ఈ స్కూల్‌ నుంచే గురుకుల, నవోదయ పరీక్షల్లో ఎక్కువగా విద్యార్థులు ఎంపికవుతున్నారు. శ్రీనివాస్‌ వారికి అత్యుత్తమ బోధన అందించడమే కాకుండా తోటి ఉపాధ్యాయులతో కలిసి అంకితభావంతో జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

బదిలీ అయిన బడికే.. 

ఇటీవల ఎస్జీటీలను ప్రభుత్వం బదిలీ చేయగా.. జాజల శ్రీనివాస్‌ మండలంలోని అక్కపెల్లి గూడ ప్రాథమిక పాఠశాలకు ఈ నెల ఒకటిన బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికే వెళ్తామని మారాం చేయడంతో తల్లిదండ్రులు కూడా ఆయనపై నమ్మకంతో పిల్లలను ఆ స్కూల్‌లో చేర్పించారు.

ఇప్పటివరకు 11 మంది ఉన్న అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాలలో 141 మంది చేరారు. దీంతో 152 మంది విద్యార్థులతో ఆ బడి కళకళలాడుతోంది. టీజీపల్లి, దేవునిగూడ, కామన్‌పల్లి, కిష్టాపూర్, ఇందన్‌పల్లి, గాంధీనగర్, జువ్విగూడ, జన్నారం గ్రామాల నుంచి పిల్లలు ఆటోల్లో వస్తున్నారు. 

నా విధులు సక్రమంగా నిర్వర్తించాను 
ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నా విధులు సక్రమంగా నిర్వర్తించాను. విద్యార్థులకు బోధన సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో నాతోటి ఉపాధ్యాయులతో కలిసి కష్టపడ్డా. మంచి ఫలితాలు వచ్చాయి. నాపై, సిబ్బందిపై నమ్మకంతో వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపారు. ఈ నెల 1న బదిలీపై అక్కపెల్లి గూడ పాఠశాలకు వెళ్లాను. బదిలీ విషయం తెలుసుకుని 141 మంది విద్యార్థులు కూడా నా పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ఫలితాలు తీసుకువస్తాను. 
– జాజల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు  

సార్‌ వెళ్లిన చోటికే వెళ్తా అన్నాను 
మాది టీజీ పల్లి. నేను జన్నారం ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి వర కు చదివాను. తర్వాత మా తల్లిదండ్రులు నన్ను పొనకల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సార్లు మంచిగా చదువు చెప్పారు. ఇంగ్లిష్‌లోనే పాఠాలు చెప్పారు. కాని మా సారు బదిలీ అయిన విషయం తెలుసుకుని అక్కడికే వెళ్తాను అని చెప్పాను. మా నాన్న కూడా అక్కడికే పంపిస్తున్నారు.  
– శ్రేష్టవర్మ, ఐదో తరగతి విద్యార్థిని

మంచిగా చూసుకుంటారు 
మాది దేవునిగూడ. చదువు మంచిగా చెప్పుతున్నారని రెండేళ్ల క్రితం పొనకల్‌ ప్రాథమిక పాఠశాలలో మా పాప, బాబును చేర్పించాను. శ్రీనివాస్‌ సార్‌ మంచిగా చూసుకునేవారు. చదువు, హోంవర్క్‌ లాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకునేవారు. మా పాప, బాబు ఇంగ్లిష్‌లో మాట్లాడుతారు. శ్రీనివాస్‌ సార్‌ బదిలీ కావడంతో ఆయన పని చేసే పాఠశాలకే పిల్లలను పంపాలని నిర్ణయించుకున్నాం.
– ఉల్వకాని మల్లేశ్, పేరెంట్‌  

Published date : 04 Jul 2024 03:39PM

Photo Stories