Skip to main content

గురుకులం.. కష్టాల నిలయం

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వాలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఆశించిన మేర ముందుకు సాగడం లేదు.
Govt Social Welfare Gurukula Schools

చిన్నగుండవెళ్లి శివారులోని ఎల్లంకి కళాశాలకు చెందిన ఒక భవనంలో కొనసాగుతున్న సిద్దిపేట మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల దుస్థితి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కనీస వసతులు మొదలు.. శాశ్వత భవనం వరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

పాఠశాలలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చి 266 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి సరైన వసతులు, సౌకర్యాలు, నిర్వహణ లేకుండా పోవడంతో విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
– సిద్దిపేటరూరల్‌

ఎల్లంకి కళాశాల భవనాల్లో కేంద్రీయ విద్యాలయం, మహాత్మాజ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలతోపాటుగా సిద్దిపేటకు చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల కొనసాగుతుంది. పాఠశాలకు చుట్టూ ఎలాంటి ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ లేకుండాపోయింది. దీనికి తోడుగా సాయంత్రం సమయంలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణం వదిలి బయటకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బట్టలు ఉతికిన అనంతరం విద్యార్థులు పక్కనే ఉన్న పొదల్లో ఆరేస్తున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులను చూసుకునేందుకు ఒక్కడే వాచ్‌మెన్‌ గార్డు ఉన్నారు.

చదవండి: Free Training: బ్యూటీకేర్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్ష‌ణ‌.. అర్హులు వీరే..

వర్షాకాలంలో నీళ్లు భవనంలోకి..

మైనార్టీ గురుకుల పాఠశాల నిర్వహణలో భాగంగా భవనం యజమానికి నెలకు రూ.మూడున్నర లక్షలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ఇవే డబ్బులతో భవనం నిర్మించినా అంత ఖర్చయ్యేది కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దె భవనానికి సైతం కిటికీలు లేకపోవడంతో దోమలు రావడం, వర్షాకాలంలో నీళ్లు లోపలికి వచ్చి విద్యార్థుల బెడ్లు, బట్టలు తడుస్తున్నాయి.

ఉదయం సమయంలో చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారు. మరుగుదొడ్లు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. డార్మెటరీ భవనంలో ఎలాంటి మెష్‌లు గాని లేకపోవడంతో అట్టముక్కలు, చెక్కల వంటివి అడ్డుపెట్టుకుంటున్నారు. ఈదురుగాలులకు చలికి నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు పూర్తి స్థాయిలో బుక్స్‌, యూనిఫాం నేటికీ అందుబాటులో లేవు. పాఠశాలలో ఇన్ని సమస్యలు ఉన్నా అధికారులు మాత్రం పర్యవేక్షణను మరచి చోద్యం చూస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

4 రోజులుగా స్నానం లేక..

గురుకుల పాఠశాల భవనానికి చెందిన భూ యజమాని నుంచి పైపులైన్‌ ద్వారా నీళ్లను సరాఫరా చేస్తున్నారు. సుమారు అర కిలోమీటర్‌ నుంచి పాఠశాలకు పైపులైన్‌ ఏర్పాటు చేసి భవనం 3వ అంతస్తుపైన ఉన్న ట్యాంక్‌లోకి ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు పాఠశాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు మిషన్‌ భగీరథ ద్వారా వస్తున్న నీటితో కాళ్లు, చేతులు కడుక్కుంటూ నాలుగు రోజులుగా స్నానం చేయకుండా, బట్టలు ఉతుక్కోకుండా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం సమయంలో మరుగుదొడ్డికి వెళ్లేందుకు పాఠశాలకు సుదూరంలో ఉన్న ఓ నీటి కుంట వద్దకు వెళ్లి వస్తున్నారు. ఏళ్ల కొద్ది నీటి సమస్య వెంటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకుంటున్నాం

ఇటీవల నీళ్లకు సంబంధించిన సమస్య ఎదురైన మాట వాస్తవమే. మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడడం జరిగింది. పరిష్కారం కోసం స్పందించారు. బుధవారం నూతన బోర్‌మోటార్‌ కొనుగోలు చేశాం. ప్రస్తుతానికి పంపింగ్‌ చేస్తున్నాం. నీళ్లు అవసరం ఉన్న సమయంలో మిషన్‌ భగీరథ అధికారులకు విన్నవించడంతో నీళ్లు వదులుతున్నారు. ప్రతీ సంవత్సరం ఇదే సమస్య తలెత్తుతుందని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

– భానుప్రకాశ్‌, మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్‌

Published date : 10 Sep 2024 01:50PM

Photo Stories