Textbooks: మన ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇతర రాష్ట్రాలకు
మహారాష్ట్రలో కూడా ద్విభాషా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటించారు. మహారాష్ట్రలో ఒకటో తరగతి పిల్లలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఏటా ఆపై తరగతుల విద్యార్థులకు వీటిని అందిస్తామన్నారు. మారుతున్న అవసరాలు, నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా విద్యార్థులు ఆంగ్ల భాషను, కొత్త పదాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
చదవండి:
వుయ్ లవ్ రీడింగ్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపునకు చర్యలు..!
ప్రశ్నలడిగే వీల్లేకుండా ఆన్‌లైన్ విద్య.. ఇంటర్ విద్యార్థుల ఇక్కట్లు..
నాణ్యమైన బోధన అందేలా పాఠ్యపుస్తకాలు
సెమిస్టర్ విధానానికి అనుగుణంగా..
ఆంధ్రప్రదేశ్‌లో ద్విభాషా పాఠ్యపుస్తక విధానాన్ని గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం విద్యార్ధులకు మాతృభాష పదాలతోపాటు ఆంగ్ల భాషా పదాలు, వాక్య నిర్మాణం తెలిసేందుకు వీలుగా మిర్రర్ ఇమేజ్ (ఒకపేజీలో తెలుగు, మరో పేజీలో ఆంగ్లం)లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను రూపొందించి పంపిణీ చేస్తోంది. పాఠ్యపుస్తకాల బరువు తేలికగా ఉండేందుకు వీలుగా సెమిస్టర్ విధానానికి తగినట్లుగా వీటిని ముద్రిస్తున్నారు. దీనివల్ల పుస్తకాల బరువు చాలా తగ్గింది. 2020–21లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చి 1 – 6వ తరగతి విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఇక 2021–22లో ఏడో తరగతి విద్యార్థులకు కూడా పంపిణీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం (2022–23)లో 8వ తరగతి విద్యార్థులకు సైతం వీటిని అందిస్తారు.
నిపుణుల బృందంతో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ద్విభాషా పాఠ్యపుస్తకాల రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ బాగా శ్రమించింది. ఆంగ్లంలోకి తర్జుమా చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని నియమించి పాఠ్యాంశాలను అనువాదం చేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు ఎదురెదురు పేజీల్లో సమాన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలు సందిగ్ధానికి గురి కాకుండా రెండూ సమానస్థాయిలో ఉండేలా సమగ్ర శిక్ష, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి చర్యలు తీసుకుంది.
డిగ్రీలో కూడా..
నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్విభాషా (ఆంగ్లం–తెలుగు) పాఠ్యపుస్తక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మొత్తం 13 సబ్జెక్టులకు సంబంధించి ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో మొదటి సెమిస్టర్ పుస్తకాలను బైలింగ్యువల్ విధానంలో ముద్రించారు.