Amma Adarsh Committees: పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు
మార్చి 14న హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ.. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల నిర్వహణ బాధ్యతలను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కమిటీలను సత్వరమే ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కమిటీలో మహిళా సంఘం నాయకురాలు అధ్యక్షురాలిగా, పాఠశాల హెచ్‌ఎం మెంబర్ కన్వీనర్‌గా ఉంటారన్నారు. గ్రామంలో 2, 3 మహిళా సంఘాలు ఉంటే పాఠశాలకు దగ్గరగా ఉన్న మహిళా సంఘానికి మొదటి సంవత్సరం అవకాశం కల్పించాలన్నారు.
చదవండి: Free Electricity for Schools: సర్కార్ స్కూళ్లకు ఉచిత విద్యుత్
కమిటీ అధ్యక్షులు, మెంబర్ కన్వీనర్ కలిసి విద్యార్థుల తల్లులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేస్తారని, ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. కమిటీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించి కలెక్టర్లు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసి జిల్లా సమాఖ్యకు అప్పగించాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులను మండలాల వారీగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలుగా నియమించాలన్నారు. సదరు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలను జిల్లా సమాఖ్యకు, కలెక్టర్లకు సమర్పించాలని సూచించారు.
చదవండి: Tenth Class Public Exams: ఈసారి కొత్త టెక్నాలజీతో ప్రశ్న పత్రాల తయారి
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ. 25వేల వరకు అత్యవసర నిధులు వినియోగించవచ్చని తెలిపారు. వీసీలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, సీపీవో రాజారాం, డీఆర్డీవో చందర్ నాయక్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రజిత, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన అభివద్ధి అధికారి అంబాజీ, డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.