Free Electricity for Schools: సర్కార్ స్కూళ్లకు ఉచిత విద్యుత్
ఈ నేపథ్యంలో ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లు జారీ చేస్తున్నట్టుగా విద్యాసంస్థలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే పలు ప్రభుత్వ స్కూళ్లలో ఫిబ్రవరి నెలలో విద్యుత్ వినియోగం, పాత బకాయిల వివరాల సేకరణలో విద్యాశాఖ నిమగ్నమైంది. సర్కార్ బడుల్లో ఉచిత విద్యుత్ అమల్లోకి వస్తే ఆయా పాఠశాలలకు బిల్లుల భారం తప్పనుంది.
చదవండి: Telangana: పాఠశాలలకు సోలార్ వెలుగులు
స్కూల్ గ్రాంట్‌లో సగం విద్యుత్ బిల్లులకే..
బడి నిర్వహణకు మంజూరు చేసే నిధుల్లోంచి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది స్కూళ్లకు ప్రత్యేక గ్రాంట్లు మంజురవుతాయి. విద్యార్థుల నమోదు స్లాబ్ ఆధారంగా కాంపొజిటివ్ స్కూల్ గ్రాంట్ కేటాయించారు. 30 మంది లోపు విద్యార్ధులుంటే రూ. 10వేలు, 100 మందిలోపు ఉంటే రూ. 25వేలు, 250 మందిలోపు ఉంటే రూ. 50వేలు, వెయ్యి మందిలోపు ఉంటే రూ. 75వేలు, 1000 మందికిపైగా రూ.లక్ష నిధులు మంజూరు చేస్తారు.
ఈ గ్రాంటు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే విడుదల చేస్తారు. ఇందులో సగం వరకు విద్యుత్ బిల్లులకు చెల్లింస్తుండగా, మిగతావి మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ సామగ్రి, చాక్‌ఫీసులు, జెండా పండుగలు ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నారు.
చదవండి: Free computer training: ఉచిత కంప్యూటర్ శిక్షణ
వచ్చే గ్రాంట్‌లో సగం మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుండడంతో రూ. వేలాదిగా విద్యుత్ బిల్లులు పేరుకుపోతున్నాయి. ఈ బిల్లులు కూడా స్కూళ్లకు సకాలంలో రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బడుల్లో విద్యుత్ వినియోగం ఇలా..
సర్కార్ బడుల్లో ప్రతి తరగతి గదిలో ఫ్యాన్ ఉంటుంది. ఇటీవల కొన్నిచోట్ల డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో బిల్లులు తడిసిమోపెడు అవుతున్నాయి.
విద్యుత్‌శాఖ విద్యాసంస్థలకు కేటగిరీ–7 కింద పరిగణనలోకి తీసుకుని యూనిట్‌కు రూ.8.30 చార్టీలు వేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో పాఠశాలలకు విద్యుత్ వినియోగాన్ని బట్టి రూ.250 నుంచి రూ.5వేలకుపైన విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే మంచిదే..
సర్కార్ బడుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుల నిర్వహణకు విద్యుత్ అవసరం ఉంటుంది. వచ్చిన గ్రాంట్లు మౌలిక అవసరాలకే సరిపోవడం లేదు. విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే మంచిదే.
–మంచికంటి మధుసూదన్, పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి, అనుముల
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
పాఠశాలలను క్యాటగిరీ–7లో పెట్టడం వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా ఫిక్స్‌డ్ గ్రాంట్లను మంజూరు చేయాలి. సర్కార్ స్కూళ్లకు ఉచిత కరెంట్‌ను అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
–దాసా వెంకన్న, యూటీఎఫ్ జిల్లా నేత