Telangana: పాఠశాలలకు సోలార్ వెలుగులు
విద్యుత్ వెలుగుల స్థానంలో ఇకపై సౌర (సోలార్) వెలుగులు విరజిమ్మనున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నాబార్డు సహకారంతో సౌర యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మేరకు టీఎస్ రెడ్కో (పునరుత్పాదక ఇంధన సంస్థ)కు ఆదేశాలివ్వగా, అవసరమైన పాఠశాలలను ఎంపిక చేసిన విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వుల జారీ చేసింది. ప్రస్తుతం ఎంపికై న 47 పాఠశాలల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.
చదవండి: Aditya-L1 mission: ఆదిత్య –ఎల్1 మార్గాన్ని చక్కదిద్దిన ఇస్రో
తీరనున్న విద్యుత్ బిల్లు కష్టాలు..
జిల్లాలో 680 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 182 ఉన్నత, 18 కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం మేర పాఠశాలలకు విద్యుతు సరఫరా ఉంది. అయితే, కంప్యూటర్ బోధన, డిజిటల్ పాఠాలు, ఫ్యాన్ల ఏర్పాటు, కొన్ని చోట్ల వాటర్ ప్లాంట్ల నిర్వహణ కారణంగా చాలా పాఠశాలలకు కరెంట్ బిల్లు నెలకు వేల రూపాయల్లో వస్తోంది.
సకాలంలో పాఠశాల గ్రాంటు రాకపోవడం, ఒకవేళ వచ్చినప్పటికీ ఆ గ్రాంటు విద్యుత్ బిల్లులకే సరిపోతుండడం ఇబ్బందికరంగా మారింది. అక్కడక్కడ బిల్లులు కట్టలేక విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణాలన్నింటి దృష్ట్యా పాఠశాలలకు సౌర విద్యుత్‌ను అందించేలా చర్యలు తీసుకుంటుడడంతో విద్యుత్ బిల్లుల కష్టాలు తీరనున్నాయి.
అయితే జిల్లా పరిధిలో గతేడాది కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో సౌర యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుకు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు మూడు పాఠశాలల్లో యూనిట్ల ఏర్పాటు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.
కిలోవాట్‌కు రూ.లక్ష చొప్పున
పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య, అక్కడి అవసరాలకు అనుగుణంగా కనిష్టంగా 2 కిలోవాట్స్.. గరిష్టంగా 10 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కిలోవాట్‌కు రూ.లక్ష చొప్పున గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను వెచ్చించనున్నారు.
ప్రాథమిక పాఠశాలలకు 2 కిలోవాట్స్, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు 5 కిలోవాట్స్, అలాగే హాస్టల్ వసతి సౌకర్యం, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే కేజీబీవీ, ఆదర్శ, గురుకులాలకు 10 కిలోవాట్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లుగా విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.