Schooling: అందరూ ఉత్తీర్ణులే.. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు అందుకున్న విద్యార్థులు!!
బంజారాహిల్స్: ప్రస్తుత విద్యా సంవత్సరం(2021–22)లో ఇటీవల చివరి పరీక్ష సమ్మెటివ్ అసెస్‌మెంట్–2(ఎస్‌ఏ) పూర్తి చేసుకున్న విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. కరోనా నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాలు పరీక్షలు నిర్వహించడం అసాధ్యమైంది. దీంతో ఆ రెండు సంవత్సరాలు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ వార్షిక సంవత్సరం మాత్రం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు పరిస్థితులు అనుకూలించడంతో గతేడాది సెపె్టంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. తరగతులు ఆలస్యం కావడం, విద్యార్థుల అభ్యసనా సామరŠాధ్యలను పరిగణలోకి తీసుకొని సిలబస్‌ను కుదించారు. నిబంధనల ప్రకారం... రెండు ఎఫ్‌ఏ(ఫార్మెటివ్), రెండు సమ్మెటివ్(ఎస్‌ఏ) పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. వీటితో పాటే విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ‘చదువు–ఆనందించు–అభివృద్ధి చెందు’ అనే వంద రోజుల కార్యక్రమం రీడ్ సైతం పూర్తి చేశారు. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులందరినీ ఈ ఏడాది ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
Also read: Model School: మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు 86.42% హాజరు
1,07,376 మంది విద్యార్థులకు రిపోర్ట్‌లు..
ఖైరతాబాద్ విద్యాశాఖ జోన్ పరిధి కిందకు వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళ్‌రావునగర్, బోరబండ, సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లను ఆయా పాఠశాలల్లోని టీచర్లు చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌నుంచి డౌన్‌లోడ్ చేసి పంపిణీ చేశారు. ఖైరతాబాద్ జోన్‌పరిధిలోని 17 ప్రభుత్వ ఉన్నత, 38 ప్రాథమిక, 148 ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 1,07,376 మంది ఉన్నారు. వీరందరికీ ఉత్తీర్ణతా పత్రాలు పంపిణీ చేశారు. చైల్డ్ ఇన్ఫోపోర్టల్‌లో ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మార్కులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నమోదు చేయడంతో పాటు ప్రోగ్రెస్ కార్డులు వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇచ్చారు. చివరి రోజు పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ప్రోగ్రెస్ కార్డులు తీసుకున్నారు.
Also read: Academic Exams: పరీక్షలపై 28న విద్యామంత్రి వీడియో కాన్ఫరెన్స్
విద్యా సంవత్సరం పూర్తి..
గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి విద్యార్థుల చదువులతో ఆటలాడుకుందనే చెప్పాలి. తరగతులు ప్రారంభమైన కొద్ది రోజులకే కోవిడ్ విజృంభిస్తూ చదువులకు ఆటంకం కలిగించింది. అయితే ఈ విద్యా సంవత్సరం కొంత మేలనే చెప్పాలి. కోవిడ్ కష్టకాలాన్ని అధిగమించి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులంతా విజయవంతంగా విద్యాసంవత్సరం పూర్తి చేసుకోవడంతో అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత పరీక్షలకు హాజరైన విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.