Skip to main content

టెట్ కమ్ టీఆర్‌టీ స్కూల్ అసిస్టెంట్ కొలువు.. ఇలా సులువు

పాత సిలబస్ అని ఒకరంటే.. లేదు కొత్త సిలబస్ ఉంటుందని మరొకరు.. లేదు లేదు పాత, కొత్త కలిిపి సరికొత్త సిలబస్ అని ఇంకొకరు..
పాత సిలబస్ అని ఒకరంటే.. లేదు కొత్త సిలబస్ ఉంటుందని మరొకరు.. లేదు లేదు పాత, కొత్త కలిిపి సరికొత్త సిలబస్ అని ఇంకొకరు.. ఇలా ఇటీవల కాలంలో డీఎస్సీ ఔత్సాహికుల మధ్య సిలబస్‌పై పెద్ద చర్చే జరిగింది. వీటన్నింటికీ తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ‘టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్’ సిలబస్‌ను విడుదల చేసింది. టెట్, డీఎస్సీని కలిపిన నేపథ్యంలో రెంటింటికి సంబంధించిన సిలబస్‌తో కొత్త విధానంలో పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌పై విశ్లేషణతో పాటు ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్..

మ్యాథమెటిక్స్
ప్రస్తుత మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌లో సంఖ్యా వ్యవస్థ; సమితులు-సంబంధాలు; ప్రమేయాలు; వ్యాపార గణితం, బీజ గణితం; రేఖీయ సమీకరణాలు; రేఖాగణితం; క్షేత్ర గణితం; మాత్రికలు; సాంఖ్యకశాస్త్రం; గణన; శ్రేఢులు; త్రికోణమితి; వైశ్లేషిక రేఖాగణితం పాఠ్యాంశాలున్నాయి. గతంలో 80 మార్కులకు 160 ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. వీటిలో 70 మార్కులను మ్యాథ్స్ కంటెంట్, మెథడాలజీకి కేటాయించారు. ఫిజికల్ సైన్స్‌కు 15 మార్కులు, బయాలజీకి 15 మార్కులు ఉన్నాయి. సిలబస్‌లోని అన్ని అంశాలపై పట్టు సాధించేందుకు ఆరో తరగతి నుంచి ఇంటర్ స్థాయి వరకు పాఠ్యపుస్తకాల్లోని సమస్యల్ని సాధించాలి.

ప్రిపరేషన్:
పాత సిలబస్ ఉంది కాబట్టి తొలుత గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ప్రశ్నల సరళిని గుర్తించి ఏ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారో గమనించాలి. సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసుకొని, మిగిలిన సమయాన్ని రివిజన్‌కు, నమూనా ప్రశ్నపత్రాలను సాధించేందుకు కేటాయించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వివిధ పాఠ్యాంశాల్లో సమస్యలను షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సాధించడం ప్రాక్టీస్ చేయాలి.
వ్యాపార గణితం, రేఖాగణితం, త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం పాఠ్యాంశాలు ముఖ్యమైనవి.

మాదిరి ప్రశ్నలు
3x2 + 5y2 = 32; 25x2 + 9y2 = 450లతో సూచించే దీర్ఘవృత్తాలకు (3, 5) ద్వారా గీయగలిగే వాస్తవ స్పర్శ రేఖల సంఖ్య?
ఎ) 6
బి) 4
సి) 3
డి) 0
సమాధానం: సి

బయాలజీ
స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నపత్రానికి నిర్దేశించిన మార్కులు 200. ఇందులో 70 మార్కులను బయాలజీ మెథడాలజీ, కంటెంట్‌కు కేటాయించారు. మెథడాలజీకి ఇచ్చిన సిలబస్‌లో గత డీఎస్సీ సిలబస్‌లోని అంశాలే ఉన్నాయి కాబట్టి పాత మెథడాలజీ పాఠ్యపుస్తకాన్ని చదవాలి. కంటెంట్‌లో 9, మెథడాలజీలో 10 యూనిట్లు ఉన్నాయి. కంటెంట్‌లో జీవశాస్త్రం - శాఖలు, జీవ ప్రపంచం, సూక్ష్మజీవ ప్రపంచం, కణం-కణజాలం, వృక్ష ప్రపంచం, జంతు ప్రపంచం, మన పర్యావరణం, శక్తి ప్రపంచం, జీవ శాస్త్రంలోని తాజా పరిణామాలు ఉన్నాయి.

మెథడాలజీలో విజ్ఞానశాస్త్ర స్వభావం-పరిధి; ఉద్దేశాలు-విలువలు; లక్ష్యాలు-స్పష్టీకరణలు; బోధనా ఉపగమాలు-పద్ధతులు; పాఠ్యప్రణాళిక; ప్రయోగశాల-బోధనోపకరణాలు; ఫలవంతమైన బోధనా ప్రణాళిక, అనియత విజ్ఞానశాస్త్ర విద్య, జీవశాస్త్ర ఉపాధ్యాయుడి లక్షణాలు; మూల్యాంకనం అంశాలున్నాయి. వీటి అధ్యయనానికి తెలుగు అకాడమీ జీవశాస్త్ర బోధనా పద్ధతులు (పాత సిలబస్) పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

గత డీఎస్సీ, టెట్ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల సరళి, ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. 2001, 2002, 2004, 2006 డీఎస్సీ పేపర్లలో ఎక్కువగా జ్ఞానసంబంధమైన ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత జరిగిన టెట్, డీఎస్సీలలో ప్రశ్నలు అప్లికేషన్స్ ఆధారంగా వచ్చాయి. వీటికి సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. విజయం సాధించాలంటే కచ్చితంగా అన్వయం ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సిందే.

ఉదా: జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తరగతిగదిలో విద్యార్థులకు శాస్త్రవేత్తల గురించి ప్రత్యక్షంగా బోధించాడు- ఇది ఏ రకమైన బోధనాపద్ధతి అని అడిగారు. దీనికి సమాధానం ఉపాన్యాస పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థి సహజ వాతావరణంలో నేర్చుకునేటట్లు చేశాడు. ఇది ఏ రకమైన బోధనా పద్ధతి- ప్రాజెక్టు పద్ధతి. ఇలాంటి జ్ఞాన సంబంధమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించడం తేలిక.
అ అనే ఉపాధ్యాయుడు చార్టు చూపిస్తూ జంతువుల వర్గీకరణ అంశాన్ని బోధించాడు. ఆ అనే ఉపాధ్యాయుడు బడి తోటను పరిశీలించి మొక్కల ఆకులకు వచ్చే తెగుళ్ల గురించి విద్యార్థులను తెలుసుకోమన్నాడు. వీరు ఉపయోగించిన బోధనాపద్ధతులు వరుసగా ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఇవి అన్వయ సంబంధ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాలంటే ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం తప్పనిసరి.

కొత్త అంశాలు:
టెట్ కమ్ టీఆర్‌టీ-2014 సిలబస్‌లో పాత మెథడాలజీలో లేని కొన్ని అంశాలను ఇచ్చారు. అవి.. బోధనోపకరణాలు; ఓరియంటల్, వెస్ట్రన్ సైన్స్; జీవశాస్త్ర ఉపాధ్యాయుడి లక్షణాలు- విధులు-బాధ్యతలు; ఎకో క్లబ్-బ్లూ క్లబ్-రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్‌జీవోల పాత్ర. వీటిలో కొన్ని బీఈడీ బయాలజీ మెథడాలజీ పుస్తకంలో ఉన్నాయి. మరికొన్ని ఎస్‌జీటీ సైన్స్ మెథడాలజీ పుస్తకంలో, బయాలజీ మెథడాలజీ ఇంగ్లిష్ మాధ్యమం (ఉత్తర భారతదేశ రచయితలు రాసినవి..) లో లభిస్తాయి.
ఉదా:
శ్రావణమాసంలో వివాహం చేసుకుంటే శుభం కలుగుతుందని నమ్మే వ్యక్తిలో నెరవేరని లక్ష్యం?
ఎ) వినియోగం
బి) అభిరుచి
సి) ప్రశంసనీయత
డి) శాస్త్రీయ దృక్పథం
సమాధానం: డి

ఫిజికల్ సైన్స్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టెట్ కమ్ టీఆర్‌టీ సిలబస్‌లో పాత పాఠ్యపుస్తకాల్లోని అంశాలే ఉన్నాయి. డీఎస్సీ-2012లో ఫిజికల్ సైన్స్ కంటెంట్‌కు 44 మార్కులు, మెథడాలజీకి 16 మార్కులు కేటాయించారు. డీఎస్సీ-2014కు కంటెంట్, మెథడాలజీకి 70 మార్కులు ఇచ్చారు. సిలబస్‌లో 21 యూనిట్లు ఉన్నాయి. దీంట్లో 10 యూనిట్లు భౌతికశాస్త్రానికి, 11 యూనిట్లు రసాయనశాస్త్రానికి సంబంధించినవి. సిలబస్ మొత్తం ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యాంశాల్లోని భావనలతో కూడుకున్నవి. 8, 9, 10 తరగతుల్లోని అధ్యాయాలకు ఇంటర్‌లో కొనసాగింపు ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో చేర్చారు. ఉదాహరణకు కొలతలు పాఠ్యాంశం ఏడు నుంచి పదో తరగతి వరకు ఉంది. వీటి కొనసాగింపు ఇంటర్‌లోనూ ఉంది కాబట్టి మితి ఫార్ములాలు, డైమన్షల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ అప్లికేషన్స్ వంటి క్లిష్ట భావనలను సిలబస్‌లో పేర్కొన్నారు.

రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయనబంధం వంటి అధ్యాయాలను ఇంటర్ స్థాయి వరకు సిలబస్‌లో ఇచ్చారు. 8, 9, 10 తరగతుల రసాయనశాస్త్రానికి సంబంధించని పర్యావరణ రసాయనశాస్త్రాన్ని కూడా పొందుపర్చారు. పదో తరగతిలోపు ఎక్కడా ప్రస్తావించని క్షారలోహాల అంశాన్ని ఇచ్చారు.

మెథడాలజీలో 11 అధ్యాయాలున్నాయి. తెలుగు అకాడమీ బీఈడీ భౌతిక, రసాయనశాస్త్ర బోధనా పద్ధతుల్లోని అంశాలను సిలబస్‌లో ఇచ్చారు.

ప్రిపరేషన్:
ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యపుస్తకాలను సేకరించుకొని, సిలబస్‌ను అనుసరించి ముఖ్యాంశాలతో నోట్స్‌ను రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు బాగా ఉపకరిస్తుంది.
కంటెంట్‌లో సహజ దృగ్విషయాలు, శుద్ధగతిక శాస్త్రం, గతిశాస్త్రం, ప్రవాహ విద్యుత్, విద్యుదయస్కాంతత్వం, ఆధునిక భౌతికశాస్త్రం, పరమాణునిర్మాణం, రసాయనబంధం, మూలకాల వర్గీకరణ, క్షార, క్షారమృత్తిక లోహాలు, కర్బన సమ్మేళన రసాయనశాస్త్రం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ తదితర అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. గణిత సంబంధిత ప్రక్రియలను సులువుగా నేర్చుకునేందుకు టెక్నిక్స్ రూపొందించుకోవాలి. పర్యావరణ రసాయనశాస్త్రానికి సంబంధించి 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న పర్యావరణ విద్య పాఠ్యపుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి.
ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను ఉదాహరణలు, ఉపయోగాలు, నిర్వచనాలు, గణనలు, కారణ సంబంధ ఫలితాలు, ప్రత్యేకతలు, భౌతికరసాయన శాస్త్ర స్థిరాంకపు విలువలు, ప్రమాణాలు, పరికరాలు ఇలా వర్గీకరిస్తూ చదవాలి.

విద్యుత్ మోటార్‌లో శక్తి మార్పు ఎలా ఉంటుంది?
ఎ) యాంత్రికశక్తి అయస్కాంత శక్తిగా మారుతుంది
బి) అయస్కాంత శక్తి, విద్యుత్‌శక్తిగా మారుతుంది
సి) విద్యుత్‌శక్తి, యాంత్రికశక్తిగా మారుతుంది
డి) యాంత్రికశక్తి, విద్యుత్‌శక్తిగా మారుతుంది
సమాధానం: సి

ఒక పాఠ్యపుస్తకంలో నాలుగు యూనిట్లున్నాయి. వార్షిక పరీక్షలో ప్రతి యూనిట్ నుంచి 25 మార్కులకు చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఆ పరీక్షపత్రానికి ఉన్న ముఖ్య లక్షణం?
ఎ) ప్రామాణికత
బి) ఆచరణాత్మకత
సి) విశ్వసనీయత
డి) సమగ్రత
సమాధానం: డి

సోషల్
స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నపత్రంలో సోషల్ స్టడీస్ కంటెంట్, మెథడాలజీకి వంద మార్కులు కేటాయించారు. జాగ్రఫీలో 12 యూనిట్లు, హిస్టరీలో 26 యూనిట్లు, సివిక్స్‌లో 11 యూనిట్లు, ఎకనామిక్స్‌లో 13 యూనిట్లు ఉన్నాయి.

భూగోళశాస్త్రం: సౌర కుటుంబం, భూమి అంతర్భాగం, శిలలు, ప్రధాన భూ స్వరూపాలు, అగ్ని పర్వతాలు, భూకంపాలు, జలావరణం, ప్రకృతి విపత్తులు, ప్రకృతి సహజ సిద్ధ మండలాలు, ఖండాలు, ప్రపంచ జనాభా, భారతదేశ భూగోళశాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి.
చరిత్ర: ప్రపంచ నాగరికతలు, మధ్యయుగపు ప్రపంచ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర, ప్రపంచ యుద్ధాలు, సింధు నాగరికత, జైన-బౌద్ధ మతాలు, దక్కన్ రాజ్యాలు, ఢిల్లీ సుల్తాన్లు, మొగల్ సామ్రాజ్యం, 1858-1947 వరకు స్వాతంత్య్ర ఉద్యమం, ఆ కాలంలో జరిగిన పోరాటాలు, అమెరికా-ఫ్రెంచ్ విప్లవాలు, జాతీయోద్యమాలు తదితర అంశాలుంటాయి.

పౌరశాస్త్రం: కుటుంబం/సామాజిక వ్యవవస్థలు,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, శాసనసభలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, సోషలిజం, లౌకికవాదం, లోకాయుక్త, మానవ హక్కుల సంఘం, సమాచార హక్కు చట్టం, అంతర్జాతీయ సంస్థలైన యూఎన్‌వో, సార్క్ తదితర సంస్థల గురించి చదవాలి. రవాణా భద్రత విద్య అధ్యయనం తప్పనిసరి.

అర్థశాస్త్రం: ఆర్థికశాస్త్రం-నిర్వచనం, పరిధి, వినియోగం, డిమాండ్, సప్లయ్, మార్కెట్, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, ఇండియన్ ఎకానమీ, భారతదేశ వ్యవసాయ విధానం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మెథడాలజీ: ఈ విభాగంలోని పాఠ్యాంశాలు ప్రధానంగా స్వభావం-పరిధి,విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, బోధనా సామగ్రి, మూల్యంకనం తదితర అంశాలుంటాయి.

కంటెంట్‌లోని అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు కాన్సెప్టుల వారీగా అధ్యయనం చేయాలి. 2012 సిలబస్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌ను ఉపయోగించుకోవాలి. ఉదా:

కార్సికా, సార్డీనియా దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?
ఎ) హిందూ మహాసముద్రం
బి) మధ్యధరా సముద్రం
సి) కాస్పియన్ సముద్రం
డి) దక్షిణ చైనా సముద్రం
సమాధానం: బి

సూయజ్ కాలువ వివాదంలో భారత్ ఎవరి పక్షాన నిలిచింది?
ఎ) బ్రిటన్
బి) ఫ్రాన్స్
సి) ఈజిప్టు
డి) స్పెయిన్
సమాధానం: సి
Published date : 04 Dec 2014 05:56PM

Photo Stories