TS TET 2022 Preparation Tips : టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుందా?
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి కీలక అర్హత ప్రమాణం.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్). ఇటీవల రాష్ట్రంలో టీచర్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. టెట్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది! డీఈడీ / బీఈడీ అర్హతలుగా నిర్వహించే.. టెట్‌లో పొందిన స్కోర్.. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో.. విజయానికి కూడా దోహదం చేస్తుంది! కారణం.. టెట్ స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో.. వెయిటేజీ కల్పిస్తుండటమే! దీంతో.. టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుంది!! టీఎస్–టెట్–2022కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. టెట్ వివరాలు, అర్హతలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్...
- తెలంగాణ టెట్‌కు ప్రకటన విడుదల
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- జూన్ 12న టెట్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు
- కంటెంట్, పెడగాజిలపై పట్టుతో విజయం సాధించే అవకాశం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి టెట్ నిర్వహిస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం–ఉపాధ్యాయ పోస్ట్‌లకు పోటీ పడాలంటే.. టెట్ స్కోర్ తప్పనిసరి. అందుకే అధికార వర్గాలు.. త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయ పోస్ట్‌ల భర్తీ క్రమంలో తొలి అడుగుగా భావించే టెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం అర్హత ప్రమాణాల్లో స్వల్ప మార్పులు కూడా చేశారు.
చదవండి: టీచర్ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!
రెండు పేపర్లుగా టెట్
- టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్, తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులను అర్హులుగా పేర్కొన్నారు.
- టెట్–పేపర్–1: టెట్ పేపర్–1ను ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అంటే ఎస్‌జీటీ పోస్ట్‌లకు ప్రామాణికంగా నిర్వహిస్తున్నారు.
- పేపర్–1: ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
- 2015 డిసెంబర్ 23 తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని ఉంటే..ఆ పరీక్షలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బీఈడీ లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
- ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం–బీఈడీ అభ్యర్థులను కూడా ఎస్‌జీటీ పోస్ట్‌లకు అర్హులుగా పేర్కొనడంతో వీరికి కూడా టెట్–పేపర్–1కు అర్హత లభించింది. వీరు టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో విజయం సాధించి, ఉద్యోగం సొంతం చేసుకుంటే.. ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ఆరు నెలల వ్యవధిలోని బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.
పేపర్–2 అర్హత
- ఆరు నుంచి పదో తరగతి వరకు ఆయా సబ్జెక్ట్‌లను బోధించేందుకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి ప్రామాణికంగా టెట్ పేపర్–2ను నిర్వహిస్తారు.
- బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏబీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. (లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారు కూడా అర్హులు
- లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులు సంబంధిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్‌తో బీఈడీలో ఉత్తీర్ణులవ్వాలి.
- ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ పేపర్లకు హాజరు కావచ్చు. కానీ తదుపరి దశలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) నిర్వహించే నాటికి డీఈడీ లేదా బీఈడీలలో ఉత్తీర్ణత సాధిస్తేనే డీఎస్సీకి అర్హత లభిస్తుంది.
చదవండి: టెట్ బిట్ బ్యాంక్
టెట్ పరీక్ష స్వరూపం
- టెట్ పేపర్–1, పేపర్–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు.
- టెట్–పేపర్–1 ఇలా: రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది. అవి..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్) | 30 | 30 |
4 | గణితం | 30 | 30 |
5 | ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ | 30 | 30 |
మొత్తం | 150 | 150 |
- లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
- ఒకటి నుంచి అయిదో తరగతి బోధించాలనుకునే డీఈడీ, బీఈడీ అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ పేపర్–1లో అర్హత సాధించాలి.
టెట్ పేపర్–2 స్వరూపం
ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్ పేపర్–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వివరాలు..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) | 30 | 30 |
4 | సంబంధిత సబ్జెక్ట్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
- నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
- సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజి నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు.
- సైన్స్ సబ్జెక్ట్ విషయంలో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాగీ నుంచి అడుగుతారు.
- సోషల్ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
- ఈ సబ్జెక్ట్ విభాగం విషయంలో రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగం పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
- లాంగ్వేజ్–1 విభాగానికి సంబంధించి టెట్ పేపర్–1 మాదిరిగానే ఆయా లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
కనీస అర్హత మార్కులు తప్పనిసరి
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
టీఎస్ టెట్–2022– ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు
- టెట్ తేదీ: జూన్ 12, 2022
- పేపర్–1: ఉదయం 9:30నుంచి 12:00 వరకు
- పేపర్–2: మధ్యాహ్నం 2:30నుంచి 5:00వరకు
- ఫలితాల వెల్లడి: జూన్ 27, 2022
- వెబ్‌సైట్: http://tstet.cgg.gov.in
చదవండి: Model papers
విజయం సాధించండిలా
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి
ఈ విభాగంలో బోధన, లెర్నింగ్‌కు సంబంధించిన ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు–సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇక పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
లాంగ్వేజ్–1
పేపర్ 1గా అభ్యర్థులు తెలుగు, ఉర్దు, హిందీ, కన్నడ, మరాఠి, తమిళం భాషలను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు ఎంచుకునే సబ్జెక్ట్ మీడియంలో లేదా సదరు సబ్జెక్ట్‌ను పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్–2లో ఇంగ్లిష్ పేపర్ ఉంటుంది. ఈ రెండు పేపర్లు పూర్తిగా ఆయా భాషల్లో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ.. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సిద్ధం కావాలి. పెడగాజికి సంబంధించి టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లిష్ నేపథ్యం మీద ప్రశ్నలు వస్తాయి.
మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఉంటాయి. క్లిష్టత స్థాయి పదో తరగతి వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో సబ్జెక్టులో ఉన్న 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్ మీద ఉంటే.. 6 ప్రశ్నలు పెడగాజిపై ఉంటాయి. ఇక పేపర్ –2 మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అడుగుతారు. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్ మీద, తెలంగాణ మీద ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ప్రస్తుతం టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ ప్రాముఖ్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదివడం లాభిస్తుంది.
సైన్స్
ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్–2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి.
సోషల్ స్టడీస్.. సక్సెస్ ఇలా
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు..ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణం,భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. సివిక్స్, ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి.
మెథడాలజీ
ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్–1, పేపర్–2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
చదవండి: TSTET Syllabus 2022