Skip to main content

Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు.. బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కొలువులు! తెలంగాణ విద్యాశాఖ తాజాగా 11,062 టీచర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎస్సీగా సుపరిచితమైన ఈ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు పోటీ తీవ్రంగా ఉంటుంది. రాత పరీక్షకు 80 శాతం, టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ కల్పించి తుది ఎంపిక చేపడతారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌ తదితర సమాచారంతో ప్రత్యేక కథనం..
11062 Teacher Posts Notification Details and Selection process and Preparation Tips
  • 11,062 టీచర్‌ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
  • ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీఈటీ, ఎల్‌పీ ఉద్యోగాలు
  • బీఈడీ, డీఈడీ అర్హతగా పోటీ పడే అవకాశం
  • రాత పరీక్షకు 80 శాతం, టెట్‌కు 20 శాతం వెయిటేజీ

మొత్తం 11,602 పోస్ట్‌లు
తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం-మొత్తం 11,062 టీచర్‌ పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్స్‌-2,629 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌-6,508, లాంగ్వేజ్‌ పండిట్స్‌-727,ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ)-182, స్పెషల్‌ కేటగిరీ స్కూల్‌ అసిస్టెంట్స్‌-220, స్పెషల్‌ కేటగిరీ ఎస్‌జీటీ-796 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు
ఈ టీచర్‌ పోస్టులకు దరఖాస్తుకు బీఈడీ, డీఎడ్‌ తదితర అర్హతలు ఉండాలి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టులకు డీఎడ్‌ పూర్తిచేసిన వారే అర్హులు. బీఈడీ వారు అర్హులు కాదు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) పోస్టులకు బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు. నాలుగేళ్లు బీఈడీ పూర్తిచేసిన వారు కూడా అర్హులే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసిన వారు బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ, డీఎడ్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 18-46 ఏâ¶్ల మధ్య ఉండాలి. రిజర్వేష¯Œ  వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.

టెట్‌కు వెయిటేజీ
టీఎస్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్ట్‌లకు పోటీ పడుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. స్కూల్‌ అసిస్టెంట్స్, లాంగ్వేజ్‌ పండిట్స్‌ అభ్యర్థులు టెట్‌ పేపర్‌-2లో.. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు టెట్‌ పేపర్‌-1లో అర్హత పొందాల్సి ఉంటుంది. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు 80 శాతం వెయిటేజీ, టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీని కల్పించి తుది నియామకాలు ఖరారు చేస్తారు.

చదవండి: Telangana TRT & DSC 2024 Notification: 11,062 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రాత పరీక్ష ఇలా

  • స్కూల్‌ అసిస్టెంట్, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్ట్‌లకు 160 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ (20 ప్రశ్నలు-10 మార్కులు); విద్యా దృక్పథాలు (20 ప్రశ్నలు-10 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్‌ కంటెంట్‌ (88 ప్రశ్నలు-44 మార్కులు); టీచింగ్‌ మెథడాలజీ (32 ప్రశ్నలు-16 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్ట్‌లకు సంబంధించి 200 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు (10 మార్కులు), జనరల్‌ ఇంగ్లిష్‌ 20 ప్రశ్నలు (10 మార్కులు), కంటెంట్‌ నుంచి 160 ప్రశ్నలు-80 మార్కులకు అడుగుతారు.

80 మార్కులకు ఎస్‌జీటీ పరీక్ష
ఎస్‌జీటీ పోస్ట్‌లకు నిర్వహించే పరీక్షలో 8 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 ప్రశ్నలు- 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌(20 ప్రశ్నలు-10 మార్కులు), విద్యా దృక్పథాలు(20 ప్రశ్నలు-10 మార్కులు), లాంగ్వేజ్‌-1(18 ప్రశ్నలు-9 మార్కులు), లాంగ్వేజ్‌-2 (18 ప్రశ్నలు-9 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (18 ప్రశ్నలు-9 మార్కులు), సైన్స్‌ (18 ప్రశ్నలు-9 మార్కులు), సోషల్‌ స్టడీస్‌ (18 ప్రశ్నలు-9 మార్కులు), టీచింగ్‌ మెథడాలజీ (30 ప్రశ్నలు-15 మార్కులు)ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అన్ని పోస్ట్‌లకు పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. ఈసారి పరీక్షను ఆన్‌లైన్‌ టెస్ట్‌గా నిర్వహిచనున్నారు. పరీక్షకు లభించే సమయం రెండున్నర గంటలు.

చదవండి: CTET July 2024 Notification: కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌ జూలై–2024)కు నోటిఫికేషన్‌ విడుదల..

రాత పరీక్షలో రాణించేలా.. 
ఎస్‌జీటీ అభ్యర్థులు
ఎస్‌జీటీ పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. అవి.. విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడాలజీ. విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు; దేశంలో విద్యా చరిత్ర; ఉపాధ్యాయ సాధికారత, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ, విద్యాహక్కు చట్టం వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. కంటెంట్‌ కోసం.. పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అ­ధ్యయనం చేయడం లాభిస్తుంది. సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం; మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు-సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం; తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు; ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్‌-ప్రిపొజిషన్స్‌ తదితర అంశాలపై దృష్టిసారించాలి. మెథడాలజీని ప్రత్యేక దృష్టితో చదవాలి. బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

స్కూల్‌ అసిస్టెంట్‌.. ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా
స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సబ్జెక్ట్‌ పరంగా ప్రత్యేక దృక్పథంతో చదవాలి.

మ్యాథమెటిక్స్‌-స్కూల్‌ అసిస్టెంట్‌
అభ్యర్థులు కంటెంట్‌ పరంగా.. బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి. మెథడాలజీ కోణంలో.. గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

బయాలజీ- స్కూల్‌ అసిస్టెంట్‌
ఈ సబ్జెక్ట్‌లో కంటెంట్‌ పరంగా..జీవ శాస్త్రం-ఆధునిక పద్ధతులు, జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జంతు ప్రపంచం వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఈ సబ్జెక్ట్‌లో మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతుల గురించి పూర్తిగా పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి.

ఫిజికల్‌ సైన్సెస్‌- స్కూల్‌ అసిస్టెంట్‌
ఈ సబ్జెక్ట్‌లో మెజర్‌మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్, సహజ వనరులు, మన విశ్వం, కాంతి సిద్ధాంతం, ఉష్ణం, ధ్వని విభాగాలకు సంబంధించి ఉండే అన్ని అంశాలను అప్లికేషన్‌ విధానంలో నేర్చుకోవాలి. అదే విధంగా అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రాలకు సంబంధించిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఫిజికల్‌ సైన్సెస్‌లో మెథడాలజీకి సంబంధించి బోధన పరికరాలు, మూల్యాంకన పద్ధతులు, బోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై అవగాహన పెంచుకోవాలి. 

సోషల్‌ స్టడీస్‌- స్కూల్‌ అసిస్టెంట్‌
ఇందులో కంటెంట్‌ పరంగా.. భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతిసిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; తెలంగాణ భౌగోళిక అంశాల గురించి అవగాహన పొందాలి. చరిత్రకు సంబంధించి.. మధ్యయుగప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులపై ప్రత్యేక దృష్టితో చదవాలి. 
పౌరశాస్త్రం విషయంలో భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశ పాత్ర; ఐక్యరాజ్య సమితి-విధి విధానాలపై అవగాహన పొందాలి. ఎకనామిక్స్‌ నుంచి ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీలో సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధనోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

అన్నింటితో అనుసంధానం
సబ్జెక్ట్‌ ఏదైనా అభ్యర్థులు ప్రిపరేషన్‌ పరంగా.. అనుసంధానం విధానాన్ని అవలంబించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక అంశం వివిధ తరగతుల్లో ఉన్నప్పుడు ఆ అంశానికి సంబంధించి ఆయా తరగతుల్లోని అన్ని విషయాలను ఒకేసారి క్రోడీకరించుకుని చదవడం ఎంతో మేలు చేస్తుంది. టీచింగ్‌ మెథడాలజీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదవితేనే మదిలో నిక్షిప్తమవుతాయి. వీటితోపాటు.. రోజూ దినపత్రికలను చదవడం అలవర్చుకోవాలి.

అప్లికేషన్‌ అప్రోచ్‌
అన్వయ దృక్పథం (అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌)తో ప్రిపరేషన్‌ సాగించాలి. ఈ విధానం ఫలితంగా ప్రశ్నను ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. కేవలం కొశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ విధానంలో చదవడం వల్ల ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే కంటెంట్, మెథడాలజీ పరంగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన చివరి రెండు, మూడు డీఎస్సీ పరీక్షల ప్రశ్న పత్రాలను అభ్యసించడం వల్ల పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 3
  • రాత పరీక్ష: మే/జూన్‌లో నిర్వహించే అవకాశం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tsdsc.aptonline.in/tsdsc/LoginPage

చదవండి: TS DSC and TET Candidates Demands : తెలంగాణ డీఎస్సీ, టెట్ అభ్య‌ర్థుల డిమాండ్లు ఇవే.. ఈ నిబంధనలు తొల‌గించాల్సిందే..!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 14 Mar 2024 05:38PM

Photo Stories