Skip to main content

Ts Dsc Hall Tickets: అబ్బాయి హాల్‌ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్‌ టికెట్లలో గందరగోళం

Ts Dsc Hall Tickets  DSC Teacher Recruitment Test Hall Ticket  Education Department Hall Ticket Issue

సాక్షి,  హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) హాల్‌ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్‌ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్‌ టికెట్‌పై అబ్బాయి  ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థి­తి ఏర్పడిందని పలువురు వాపోయారు. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్‌ టికెట్ల రూపకల్పనలో అధికారు­లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖ
డీఎస్సీ పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. పరీక్షకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్న యువత హాల్‌ టికెట్ల గందరగోళంతో కంగారు పడుతోంది. అయితే ఈ తప్పిదాలకు వి­ద్యా­శాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దర­ఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు తామెలా ఫొటో­లు, సంతకాలు మారుస్తామని వారు అంటున్నారు. సిస్టమ్‌ జనరేటెడ్‌ హాల్‌ టికెట్లను తాము  చూసే అవకాశమే లేదంటున్నారు. తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి న్యాయం చేస్తున్నామని విద్యాశాఖ వెల్లడించింది.

Bhatti Vikramarka On DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 6వేల పోస్టులతో మరో డీఎస్సీ

మొదట్నుంచీ వివాదమే
డీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదమే అవుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్‌ లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్‌ కేంద్రాలు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే నేతలు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. తాజాగా హాల్‌ టిక్కెట్లు ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, చాలా చోట్ల అవి డౌన్‌లోడ్‌ కావడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విద్యాశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అన్ని చోట్ల డౌన్‌లోడ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోమవారం విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

TSRTC Jobs: సొంతంగా పోస్టుల భర్తీ అధికారం కోల్పోయిన ఆర్టీసీ.. ఖాళీలు ఉన్నా రిక్రూట్‌మెంట్‌కు నో

ఫొటోల తారుమారు
మేడ్చెల్‌ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హాల్‌ టికెట్‌లో అతని పేరు సక్రమంగానే ఉంది. కానీ ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య డీఎస్సీలో ఎస్‌ఏ పోస్టుకు అప్లై చేసింది. ఆమె ఫొటో బాదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన అధికారులు ఆమె ఫొటో వచ్చేలా చేశారు.

నిజంగా నెట్‌ సెంటర్లదే తప్పా?
అభ్యర్థులు నెట్‌ సెంటర్లలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారి ఫొటో, సంతకాలను డిజిటల్‌ చేసి ఇస్తుంటారని తెలిపారు. ఎక్కువ మంది ఉండటంతో నెట్‌ యజమానులు ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో పెట్టారని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ఫొటో, సంతకం ఉంటుందో హాల్‌ టికెట్‌లోనూ అదే వస్తుందని, దీనికే తమను నిందిస్తే ఎలా అని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  
 

Published date : 16 Jul 2024 11:57AM

Photo Stories