Skip to main content

డీఎస్సీలో విజయం సాధించాలంటే.. పక్కా ప్రణాళికతో చదవండిలా..

ఆకర్షణీయ వేతనాలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించే ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్‌తో పాటు డీఎస్సీలో మంచి స్కోర్ సాధించాల్సిందే! ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగార్థుల్లో ఆసక్తి పెరిగింది. సహజంగానే ఏ మెటీరియల్ చదవాలి? ఎటువంటి పుస్తకాలు చదవాలి వంటి సందేహాలు తలెత్తుతాయి. అటువంటి వారి కోసమే ఈ గైడెన్స్..
ప్రిపరేషన్:
ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) రెండు విభాగాలకు ఉమ్మడిగా ఉండే సబ్జెక్ట్‌లు కంటెంట్, టీచింగ్ మెథడాలజీ, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే. ఎస్‌జీటీకి అదనంగా లాంగ్వేజెస్ ఉంటాయి.
  1. కంటెంట్, మెథడాలజీ సబ్జెక్టులను టెట్ కోసం చదువుతారు కాబట్టి ఇది డీఎస్సీ ప్రిపరేషన్‌కు కొంత వరకూ ఉపయోగపడుతుంది.
  2. టెట్ సిలబస్‌తో పోల్చితే డీఎస్సీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి సమయపాలనను అలవరచుకొని, ప్రణాళిక ప్రకారం చదవాలి.
  3. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ప్రధానం. ఎస్‌జీటీ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే అలాంటి అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  4. స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్‌కు సంబంధించి హైస్కూల్ స్థాయి వరకు ఉండి, ఇంటర్మీడియెట్ పుస్తకాల్లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
  5. లాంగ్వేజెస్: ఎస్‌జీటీ విభాగంలో మాత్రమే లాంగ్వేజెస్ ఉంటాయి. ఆయా భాషల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. తెలుగుకు సంబంధించి కవులు- రచయితలు- వారి రచనలు, భాషారూపాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
  6. ఇంగ్లిష్‌కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్సెస్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్; వొకాబ్యులరీ వంటి అంశాలపై పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టెట్‌లో లాంగ్వేజెస్ కోసం సాగించిన ప్రిపరేషన్ డీఎస్సీకి సరిపోతుంది.
మెథడాలజీ:
ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. దీనిలో బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు ప్రధానాంశాలుగా ఉంటాయి.

మెథడాలజీ అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. భావన లను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకుని అధ్యయనం చేయాలి.
బోధన పద్ధతులను చదివేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ సబ్జెక్టుకు ఏ బోధనా పద్ధతి సరిపోతుందో విశ్లేషించుకుని చదవాలి.

పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్:
పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో విద్య, ఉపాధ్యాయుడు చారిత్రక నేపథ్యం, వేద విద్య, జైనుల, ముస్లిం, బ్రిటిష్ విద్యా విధానాలతోపాటు స్వాతంత్య్రానంతర ఉన్నత కమిషన్ల గురించి చదవాలి.

ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే అంశాలు, ఉపాధ్యాయుల వృత్తి పూర్వక, వృత్యంతర శిక్షణ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వాటి విధులు, రికార్డులు, రిజిస్టర్‌లకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి.

అర్థశాస్త్రం- విద్య, జనాభావిద్య, ప్రజాస్వామ్య విద్య, పర్యావరణ విద్య, కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించిన అంశాలను చదవాలి.
జాతీయ విద్యా ప్రణాళిక, విద్యా హక్కు చట్టం గురించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

ఎస్‌జీటీ/ఎస్‌ఏలకు ఒకే రకమైన సిలబస్ ఉన్నప్పటికీ.. ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. స్థూలంగా చూస్తే ఐదు విభాగాలుగానే కనిపిస్తున్నప్పటికీ.. అందులోని అంశాలను చూసినప్పుడు విస్తృత ప్రిపరేషన్ అవసరం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్, సమ్మిళిత విద్య, పర్యావరణ విద్య, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఉచిత నిర్భంద విద్య, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్- 2005.. ఇలా చాలా అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్:
కరెంట్ అఫైర్స్‌లో వర్తమాన, శాస్త్ర సాంకేతిక అంశాలు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వార్తల్లోని వ్యక్తులు, సమావేశాలు, క్రీడలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. జీకే కోసం.. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు-తెగలు-సంస్కృతులు, రాజధానులు, కరెన్సీ, తదితర అంశాలపై దృష్టి సారించాలి.

Ex: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది?
Ans: కోల్‌కతా

Ex: ఆస్ట్రేలియా 28వ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసింది ఎవరు?
Ans: టోనీ అబోట్ (లిబరల్ పార్టీ)

ప్రిపరేషన్ ప్రణాళిక:
మన విద్యా విధానంలో పాఠ్యాంశాలను రూపొందించేటప్పుడు ఏకకేంద్ర విధానాన్నే పాటిస్తున్నారు. ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో పొందుపరిచి.. ఎగువ తరగతులకు వెళ్లే కొద్దీ వాటి క్లిష్టత స్థాయిని పెంచుతూ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. కాబట్టి కంటెంట్ చదివేటప్పుడు కింది తరగతుల పుస్తకాలను చదవడం ప్రారంభిస్తే.. ఎగువ తరగతుల్లో పునరావృతమయ్యే అంశాలపై పట్టు చిక్కుతుంది.

అభ్యర్థులు ప్రతి పాఠ్యాంశానికి చివర్లో ఇచ్చిన ముఖ్యాంశాలను, బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

డీఎస్సీలో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలి. కటెంట్‌కు 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదివి సొంతంగా నోట్సు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మెథడాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదివితేనే మంచి స్కోర్‌కు అవకాశముంటుంది.

రిఫరెన్స్ బుక్స్:
ఎస్‌జీటీ: కంటెంట్:
1-10వ తరగతి టెక్ట్స్ బుక్స్
ఇంగ్లిష్ గ్రామర్: రెన్ అండ్ మార్టిన్, మార్కెట్లో లభించే ఏదైనా ప్రామాణిక పుస్తకం.
మెథడాలజీ: తెలుగు అకాడమీ పుస్తకాలు
ఎస్‌ఏ: కంటెంట్: 6-10వ తరగతి పుస్తకాలు, ఇంటర్మీడియెట్ తెలుగు అకాడమీ పుస్తకాలు
జీకే: మనోరమ ఇయర్ బుక్, తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు.

టిప్స్:
వివిధ అంశాలను చదువుతున్నప్పుడు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవాలి.
తెలుగు అకాడమీ పుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పడుతుంది. అధ్యాయాల వారీగా ప్రాక్టీస్ టెస్ట్ రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లు తెలుస్తాయి.

ఎస్‌జీటీ పరీక్షా విధానం
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్ 20 10
పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 10
లాంగ్వేజ్-1 (తెలుగు) 18 9
లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 18 9
కంటెంట్ మ్యాథమెటిక్స్ 18 9
సైన్స్ 18 9
సోషల్ 18 9
టీచింగ్ మెథడాలజీ 30 15
మొత్తం 160 80

ఎస్‌ఏ పరీక్షా విధానం
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్ 20 10
పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 10
కంటెంట్(సంబంధిత సబ్జెక్ట్) 88 44
టీచింగ్ మెథడాలజీ 32 16
మొత్తం 160 80

విద్యా దృక్పథాలపై అవగాహన అవసరం
టెట్‌తో పోల్చుకుంటే డీఎస్సీకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇటు టెట్‌తో పాటు డీఎస్సీకి ఉపయోగపడే కంటెంట్, మెథడాలజీ అంశాలను ఏకకాలంలో ప్రిపేర్ కావాలి.

నూతన విద్యా దృక్పథాలపై అభ్యర్థులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులోని చారిత్రక, మనోవైజ్ఞానిక, తాత్విక, సామాజిక అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి.

జనరల్ నాలెడ్జ్ విభాగం విస్తారమైంది. ఖండాలు, వాటిలోని దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన భౌగోళిక, చారిత్రక అంశాలను చదవాలి. అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను వర్తమాన వ్యవహారాలకు అన్వయించుకొని చదవాలి.

కంటెంట్ విభాగానికి సంబంధించి ఎస్‌జీటీ అభ్యర్థులు 6 నుంచి పదో తరగతి స్థాయి వరకు అధ్యయనం చేయాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదవాలి.

సొంతనోట్సు ఎంతోమేలు
డీఎస్సీలో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలి. కటెంట్‌కు 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదివి సొంతంగా నోట్సు ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. సోషల్ మెథడ్‌‌సకు తెలుగు అకాడమీ పుస్తకాన్ని క్షుణ్నంగా చదివితే టెట్‌కు సరిపోతుంది. 2012 డీఎస్సీలో అవగాహనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి సబ్జెక్ట్‌ను కాంప్రెహెన్సివ్‌గా, విశ్లేషణాత్మకంగా చదివిన వారికే విజయం సాధ్యం. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగం పెరిగి, సమయం ఆదా అవుతుంది.
Published date : 18 Jan 2014 10:42AM

Photo Stories