Skip to main content

స్టడీ అబ్రాడ్.. యూకే!

వీసా పైలట్ స్కీం
విదేశీ విద్య ఔత్సాహికులకు రెండో గమ్యంగా నిలుస్తున్న దేశం యునెటైడ్ కింగ్‌డమ్! కానీ, వీసా నిబంధనలు, పోస్ట్ స్టడీ వర్క్ నిషేధంతో యూకేకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు యూకే ప్రభుత్వం సరికొత్త వీసా పథకాన్ని ప్రవేశ పెట్టింది. అదే యూకే వీసా పైలట్ స్కీం. నిర్దేశిత వర్సిటీల్లో కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఆర్నెల్లు అక్కడే ఉండే అవకాశం కల్పించే ఈ కొత్త వీసా స్కీంపై విశ్లేషణ...

2012లో ప్రవేశపెట్టిన పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిషేధం నిబంధనతో యూకేకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మరోవైపు యూకేలోనే వివిధ యూనివర్సిటీల నుంచి సైతం పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో యూకే ప్రభుత్వం తాజాగా టైర్-4 వీసా పైలట్ స్కీం అనే కొత్త పథకానికి రూపకల్పన చేసింది.

సాధారణంగా యూకేలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో గ్రాడ్యుయేట్, ఆపై స్థాయి కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు జారీ చేసే వీసాను టైర్-4 జనరల్ వీసాగా పేర్కొంటారు. దీని ప్రకారం విద్యార్థులు గ్రాడ్యుయేట్, మాస్టర్ స్థాయిలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది. అయితే.. ఈ కోర్సులు పూర్తి చేసుకోగానే విద్యార్థులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేలా పోస్ట్ స్టడీ వర్క్ వీసా జారీలను నిషేధించింది. దీంతో అప్పటి నుంచి యూకేకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.

పైలట్ స్కీం
యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు తగ్గుతుండటం, ప్రతిభావంతులైన అభ్యర్థుల అవసరం ఏర్పడటంతో టైర్-4 జనరల్ వీసా పైలట్ స్కీం పథకాన్ని యూకే ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన నాలుగు యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌ల (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, బాత్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్) లో 13 నెలలు, అంతకంటే తక్కువ వ్యవధి గల మాస్టర్‌‌స డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు వీసా పైలట్ స్కీం సదుపాయం వర్తిస్తుంది.

నాలుగు ఉన్నత విద్యా సంస్థల్లో 13 నెలలు, అంతకంటే తక్కువ వ్యవధిలో ఉండే మాస్టర్‌‌స కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు కోర్సు ముగిసిన తర్వాత అదనంగా ఆర్నెల్లు అక్కడే ఉండొచ్చు. ఆ సమయంలో వారు ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఉద్యోగం సొంతమైతే సదరు ఎంప్లాయర్ ఇచ్చే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా టైర్-2 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

తొలుత రెండేళ్లు
వీసా పైలట్ స్కీంను తొలుత రెండేళ్లు అమలు చేయనున్నారు. 2016-17, 2017-18 విద్యా సంవత్సరాల్లో ప్రవేశాలు పొందే వారందరికీ టైర్-4 జనరల్ వీసా పైలట్ స్కీం పరిధిలో కోర్సు పూర్తయ్యాక అదనంగా ఆర్నెల్లు ఉండేందుకు అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో ఉద్యోగం సొంతమైతే టైర్-2 వీసా మంజూరవుతుంది. దీని ప్రకారం అభ్యర్థులు కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా అయిదు సంవత్సరాల 14 రోజులపాటు ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఆ ఉద్యోగ కాలపరిమితి మేరకు దీన్ని నిర్ణయిస్తారు. టైర్- 2 వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాము ఉద్యోగంలో చేరే తేదీకి మూడు నెలలు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

పొడిగించే అవకాశం
రెండేళ్ల పాటు అమలు చేయనున్న ఈ విధానం విజయవంతమైతే దీన్ని శాశ్వత ప్రాతిపదికన రూపొందించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్ అండ్ డీ, మేనేజ్‌మెంట్ విభాగాల్లో నిపుణుల కొరత, మరోవైపు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గి, అది ఆర్థికంగానూ ప్రభావం చూపిస్తున్న పరిస్థితుల్లో దీన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం నాలుగు యూనివర్సిటీలకు పరిమితమైన విధానాన్ని అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు విస్తరించే అవకాశం కూడా ఉంది.

భారత్ నుంచి ఏటా దాదాపు 20 వేల మందిపోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సైతం భారత విద్యార్థులకు యూకే రెండో గమ్యంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఏటా దాదాపు 20 వేల మంది విద్యార్థులు యూకే వైపు దృష్టిసారిస్తున్నారు.

పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిషేధం అమలైన సంవత్సరం (2012) నుంచి యూకేకు వెళ్తున్న భారత విద్యార్థులను పరిశీలిస్తే.. 2012-13లో 22,385 మంది; 2013-14లో 19,750 మంది; 2014-15లో 18,320 మంది.

పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం అమల్లో ఉన్నప్పుడు ఏటా దాదాపు 50 వేల మంది యూకే వెళ్లేవారు. ఉదాహరణకు 2010-11 సంవత్సరం నాటికి యూకేలో భారత విద్యార్థుల సంఖ్య 68,238. అది తర్వాత గణనీయంగా తగ్గింది.

పైలట్ వీసా స్కీం ప్రకారం ఎంపిక చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, బాత్ యూనివర్సిటీల్లో దాదాపు 13 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు.. తాజాగా నిర్దేశించిన 13 నెలల గడువున్న కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరిలో 10 నుంచి 12 శాతం మంది భారతీయ విద్యార్థులు ఉంటారని అంచనా.

సాధారణ ప్రవేశ నిబంధనలు యథాతథం
వీసా పైలట్ స్కీంను అమల్లోకి తెచ్చినప్పటికీ, ఆ నాలుగు యూనివర్సిటీలు, ఇతర వర్సిటీల్లో ప్రవేశాలు, నిబంధనల విషయంలో ప్రస్తుత నిబంధనలనే యూకే ప్రభుత్వం అమలు చేయనుంది. దీని ప్రకారం అభ్యర్థులు ముందుగా అడ్మిషన్ కన్‌ఫర్మ్ చేసుకుని సీఏఎస్ ఆధారంగా టైర్-4 జనరల్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రస్తుతం అవసరమవుతున్న ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, అకడమిక్ ప్రొఫైల్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, రిఫరెన్స్ లెటర్స్ వీటన్నింటినీ యథాతథంగా అందించాలి.

వారానికి 20 గంటలు
యూకేలో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘చదువుకుంటూ పని చేసే విధానాలను పరిశీలిస్తే గ్రాడ్యుయేట్, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్థులు వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్‌గా, సెలవు రోజుల్లో పూర్తి సమయం పనిచేసే అవకాశం ఉంది. అయితే ఇవి తాము చదువుతున్న సబ్జెక్ట్‌కు సంబంధించిన విభాగాలైతే సదరు ఇన్‌స్టిట్యూట్ నుంచి స్థానిక ఇమిగ్రేషన్ అధికారుల నుంచి సులభంగా అనుమతి లభిస్తుంది. అదే విధంగా నెలకు 20 వేల పౌండ్ల పైచిలుకు ఆదాయంతో ఉద్యోగం సొంతమైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అక్కడే కొనసాగొచ్చు.

అకడమిక్ కోర్సు పూర్తయ్యాక అక్కడే అదనంగా ఆర్నెల్లు ఉండేలా వీలుకల్పించే వీసా పైలట్ స్కీం.. విద్యార్థులకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పైలట్ స్కీంగా ఎంపిక చేసిన నాలుగు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందాలంటే అభ్యర్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ ఉన్నతంగా ఉండాలి. ఈ మేరకు ఇప్పటి నుంచే కృషి చేస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశాలు మెరుగవుతాయి.
-గీతా అరోరా, హెడ్, హెచ్‌ఆర్, బ్రిటిష్ కౌన్సిల్.
Published date : 23 Aug 2016 12:10PM

Photo Stories