Skip to main content

ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో తాజా మార్పులు

 

స్టడీ అబ్రాడ్ దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి సన్నాహాల్లో వీసా ప్రాసెస్‌దే కీలక పాత్ర. అడ్మిషన్ లేదా కన్ఫర్మేషన్ లెటర్ సొంతం చేసుకోవడంతోనే ప్రారంభించాల్సిన ప్రక్రియ ఇది. అమెరికా మాదిరిగానే యూకేలో కూడా బహుళ వీసా విధానం అమల్లో ఉంది. ఒక్కో టాస్క్‌ను బట్టి ఒక్కో వీసా కేటాయిస్తారు. ఇందుకోసం ఆ దేశం ‘టయర్ 4 పాయింట్ బేస్డ్’ (పీబీఎస్) అనే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానానికి సంబంధించి యూకే ఇటీవల కొన్ని కీలక మార్పులను చేసింది.ఈ మార్పులను క్షుణ్నంగా పరిశీలిస్తే..
కార్పొరేట్ ఇంటర్న్‌షిప్:
చదువుతున్న డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు కొంత కాలంపాటు అక్కడే ఉండి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించారు. ఇంతకుముందు నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయిన వెంటనే అక్కడి విదేశీ విద్యార్థులు (గతంలో గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే టయర్-2 వీసా కింద నిబంధనల మేరకు గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగం చేసే అవకాశం ఉండేది) తమ దేశాలకు తిరుగుముఖం పట్టాల్సి వచ్చేది. తాజాగా సడలించిన నిబంధనల మేరకు తమ డిగ్రీ పూర్తయిన తర్వాత కార్పొరేట్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కోర్సు పూర్తయిన తర్వాత తమ ప్రతిభను పరీక్షించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. తద్వారా స్కిల్డ్ బేస్డ్ జాబ్ సాధన సులభతరమవుతుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో పనితీరు ఆధారంగా యూకేలోనే కాకుండా మిగతా దేశాల్లోని అవకాశాలను కూడా అందుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ వీసాతో ఉన్న వారు స్కిల్డ్ వర్కర్ వీసాకు సులువుగానే మారొచ్చు.

12 నెలలపాటు:
స్టూడెంట్ వీసా టయర్-4కు సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు చేశారు. పీహెచ్‌డీ కోర్సు పూర్తయిన తర్వా త మరో 12 నెలలు యూకేలో ఉండే అవకాశం కల్పించారు. స్కిల్డ్ వర్క్ జాబ్ వెతుక్కోవడానికి ఈ మార్పు దోహదం చేస్తుంది. ఇదే సమయంలో ఏదైనా వ్యాపార రంగంలో (ఎంటర్‌ప్రెన్యూర్‌గా) స్థిరపడే అవకాశాన్ని కల్పించారు.

మరికొన్ని:
యూకేలో చదువు కోసం విద్యార్థులు అంగీకరిస్తూ సమర్పించిన కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్‌‌స ఫర్ స్టడీస్ (Confirmation of Acceptance for Studies సీఏఎస్)లో పేర్కొన్న కోర్సు కంటే తక్కువ స్థాయి కోర్సులో చేరేందుకు అనుమతించరు. పాయింట్ బేస్డ్ సిస్టమ్‌లో.. సీఏఎస్‌లో పేర్కొన్న ఆర్థిక వనరుల (ఫైనాన్స్/ఫండ్స్) ఆధారంగా వీసా పాయింట్లను కేటాయిస్తారు.

మరో మార్పు ఐసీటీ:
మరో మార్పు ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఐసీటీ). దీని ద్వారా ఎటువంటి భాషా పరమైన పరీక్షకు హాజరు కాకుండానే (లాంగ్వేజ్ టెస్ట్) ఒక కంపెనీ ఉద్యోగులను అదే కంపెనీలోని యూకే శాఖకు బదిలీ చేయవచ్చు. ఇంతకుముందు ఈ విషయంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నిబంధన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు దీన్ని తొలగించారు.

బిజినెస్ టు ట్రైనింగ్:
మల్టినేషనల్ ఫర్మ్స్ వ్యాపార లావాదేవీల పర్యవేక్షణ కోసం తమ ఆడిటర్లను బిజినెస్ విజిటర్స్ వీసా ద్వారా యూకేకు తీసుకుని రావచ్చు. ఇదే సమయంలో ఆడిటర్లు అక్కడ ఉన్నంత కాలం తమ రంగంలో ఏదైనా షార్ట్‌టర్మ్ కోర్సు చేసే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల నుంచి వీరికి మినహాయింపునిచ్చారు. వ్యాపార వేత్తలు తమ రంగాల్లో షార్ట్‌టర్మ్ కోర్సెస్ లేదా ట్రైనింగ్ సెషన్స్‌కు హాజరు కావడానికి తాజా మార్పులు దోహదం చేస్తాయి.

జనరల్ విజిటింగ్ వీసా ద్వారా యూకే పర్యటన(టూరిస్ట్‌లు)కు వెళ్లిన వారు కూడా తమ తీరిక వేళల్లో ఇంగ్లిష్, తదితర అంశాల్లో ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసే అవకాశాన్ని కల్పించారు.

ప్రతిభావంతులే లక్ష్యం:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించే లక్ష్యంతో యూకే తాజాగా ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కొన్ని కీలక నిబంధనలను సడలించింది. ప్రకటించిన మార్పులు విద్యా, వ్యాపార రంగాలను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.

మార్పులివి

 

 

  • డిగ్రీ/చదువుతున్న కోర్సు పూర్తయిన తర్వాత ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం.
  • పీహెచ్‌డీ తర్వాత 12 నెలలపాటు స్కిల్డ్ వర్క్ జాబ్/ ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడే అవకాశం.
  • నిబంధనలతో నిమిత్తం లేకుండా ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్.
  • బిజినెస్ వీసా విజిటర్స్ షార్ట్‌టర్మ్ కోర్సు/ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొనవచ్చు.
  • టూరిస్ట్‌లు కూడా తమ తీరిక వేళల్లో ఇంగ్లిష్, తదితర అంశాల్లో ట్రైనింగ్ కోర్సుల్లో చేరొచ్చు.
  • సీఏఎస్‌లో పేర్కొన్న కోర్సు కంటే తక్కువ స్థాయి కోర్సులో చేరేందుకు అనుమతించరు.
  • ఆర్థిక వనరుల (ఫైనాన్స్/ఫండ్స్) ఆధారంగా వీసా పాయింట్ల కేటాయింపు.

Inputs by:
A. Joseph, Sr. Counsellor, Hyderabad.

భారతీయులకు ఊరట
Bavitha

 

  • భారతీయ విద్యార్థుల విషయానికొస్తే.. తాజాగా ప్రతిపాదించిన కార్పొరేట్ ఇంటర్న్‌షిప్ నిబంధన ఊరటనిచ్చే అంశంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే మన విద్యార్థులు చాలా మంది ఉద్యోగ సాధన లక్ష్యంగా విదేశీ విద్యకు సిద్ధమవుతుంటారు. గత నిబంధనల ప్రకారం కోర్సు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చేది. ఇది భారతీయ విద్యార్థులను పూర్తిగా నిరుత్సాహానికి గురి చేసింది. దీంతో గత ఏడాది యూకే వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 24 శాతానికి పడిపోయింది. తాజా నిబంధనల మేరకు అక్కడి కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సాధనలో దోహదపడుతుంది. అంతేకాకుండా తాజా మార్పు ద్వారా వీరు గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్కిల్డ్ వర్క్ వీసా పరిధిలోకి సులభంగా మారొచ్చు.
  • టయర్-4లో పీహెచ్‌డీ విద్యార్థులకు చేసిన మార్పులు కూడా భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేవిగా ఉన్నాయని చెప్పొచ్చు. వీరికి కోర్సు పూర్తయిన తర్వాత 12 నెలలపాటు అక్కడే ఉద్యోగం/ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండడానికి అవకాశం కల్పించారు. ఈ అంశం భారతీయ విద్యార్థులను మరింత ఆక ర్షించే అవకాశం ఉంది.
  • సీఏఎస్ ఆధారంగా చేసిన మార్పు కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. అది కూడా అక్కడ ఏదో విధంగా స్థిరపడాలనుకునే విద్యార్థుల విషయంలో మాత్రమే. నాన్ సీరియస్ విద్యార్థుల వడపోత లక్ష్యంగా ప్రవేశ పెట్టిన మార్పు కాబట్టి నిజమైన విద్యార్థులు నష్టపోయే అవకాశం చాలా తక్కువ.
వీసా సమాచారం
Bavitha పాయింట్ బేస్ట్ సిస్టమ్ (పీబీఎస్) ఆధారంగా వీసాను కేటాయిస్తారు. లెసైన్స్‌డ్ స్పాన్సర్ జారీ చేసే లెటర్, కోర్సు ఫీజు, అక్కడ నివసించేందుకు అవసరమయ్యే సౌకర్యాలు, తదితరాల ఆధారంగా ఈ పాయింట్లను కేటాయిస్తారు. ఈ పాయింట్లను పరిగణనలోకి తీసుకుని వీసా మంజూరు చేస్తారు. మొత్తం ఐదు కేటగిరీలుగా వీసాలను విభజించారు. అవి.. టయర్-1, టయర్-2, టయర్-3, టయర్-4, టయర్-5. వీటిల్లో.. టయర్-1 పోస్ట్ స్టడీ వర్క్ వీసా. టయర్ -2 స్పాన్సర్డ్ ఎంప్లాయీస్‌కు ఉద్దేశించింది (వర్క్ పర్మిట్ ). టయర్-3 తాత్కాలిక వీసా (లో స్కిల్డ్ వర్కర్స్ కోసం కేటాయించేది). టయర్-4 స్టూడెంట్ వీసా. టయర్-5 యూత్ మొబిలిటీ స్కీమ్స్/తాత్కాలిక వర్కర్స్ కోసం ఉద్దేశించింది. యూకే లో పోస్ట్-16 ఎడ్యుకేషన్ కోసం వచ్చే విదేశీ విద్యార్థులు టయర్-4 (జనరల్) వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూతో వీసా:
అమెరికా మాదిరిగానే వీసా మంజూరు కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీసా మంజూరు కోసం సమర్పించిన సర్టిఫికెట్స్ ఆధారంగా సదరు అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవాలా? వద్దా? అనే విషయాన్ని కాన్సులేట్ అధికారులు నిర్ణయిస్తారు. వ్యక్తిగతంగా లేదా టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఇటువంటి (ఇంటర్వ్యూ అవసరమయ్యే) సందర్భాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
వీసా కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. www.ukba.homeoffice.gov.uk http://www.vfs-uk-in.com/ వెబ్‌సైట్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును వీసా అప్లికేషన్ సెంటర్‌లో నేరుగా అందజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ కోరవచ్చు. నేరుగా లేదా టెలిఫోన్ ద్వారా కూడా అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకోవచ్చు. తర్వాత ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు, అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేస్తూ అందిన ఈ-మెయిల్ ప్రింట్ తీసుకోవాలి. వీటితోపాటు సంబంధిత డాక్యుమెంట్స్ జతచేస్తూ వీసా అప్లికేషన్ సెంటర్‌లో అందజేయాలి. అక్కడే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ (ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ ఫోటో) కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా ఫీజును ఎంపిక చేసిన స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ లేదా ఏదైనా నేషనలైజ్డ్/ఫారెన్ బ్యాంక్ నుంచి తీసుకున్న డీడీ రూపంలో వీసా అప్లికేషన్ సెంటర్‌లో చెల్లించవచ్చు. వీసా అప్లికేషన్ సెంటర్ వివరాలను http://www.vfs-uk-in.com/ వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు. దరఖాస్తులో పేర్కొన్న సెంటర్‌లో వీసా మంజూరు డాక్యుమెంట్స్‌ను పొందొచ్చు. అభ్యర్థి కాకుండా అతని తరపున ఎవరైనా సంబంధిత ఐడెంటిటీని చూపించి సర్టిఫికెట్లు పొందొచ్చు. వీసాలో ఏవైనా తప్పులు ఉంటే వీఎఫ్‌ఎస్ గ్లోబల్ సెంటర్‌ను వెంటనే సంప్రదించాలి.

సీఏఎస్ తప్పనిసరి:
వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సీఏఎస్ నెంబర్ తప్పనిసరి. యూకేలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు యూకేబీఏ నుంచి విధిగా లెసైన్స్ పొందాల్సి ఉంటుంది. టయర్-4లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థికి కావల్సిన సీఏఎస్ కోసం సదరు యూనివర్సిటీ దరఖాస్తు చేస్తుంది. ఇందులో రిఫరెన్స్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఎటువంటి షరతులు లేకుండా అక్కడి వర్సిటీలో చదివేందుకు ఒప్పుకోవడం, కోర్సు ప్రారంభానికి ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉండడం, కోర్సుకు సంబంధించి అన్ని ఫీజులు చెల్లించడం (పీజీ కోర్సులకు) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఏఎస్ కోసం వర్సిటీ దరఖాస్తు చేస్తుంది. యూకేబీఏ సదరు విద్యార్థికి కేటాయించే సీఏఎస్ రిఫరెన్‌‌స నంబర్ ఉంటేనే వీసా మంజూరవుతుంది.

అవసరమైన డాక్యుమెంట్ల జాబితా:
  • VFA 9+అపెండిక్స్ 8 ఫార్మ్ (టయర్4-స్టూడెంట్), గెడైన్స్ నోట్స్.
  • పాస్‌పోర్ట్ .
  • బయోమెట్రిక్ వివరాలు.
  • వీసా ఫీజు 255 పౌండ్లు (సమానమైన రూపాయల్లో).
  • విశ్వవిద్యాలయం నుంచి సీఏఎస్ లెటర్. అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్ అండ్ నకలు కాపీలు.
  • విశ్వవిద్యాలయం నుంచి బేషరతు పత్రం.
  • ATAS సర్టిఫికెట్ (అవసరమైతే).
  • వసతి, ట్యూషన్ ఫీజుల చెల్లింపు రశీదులు.
  • బ్యాంకు స్టేట్‌మెంట్లు-స్పాన్సర్లందరి నుంచి గత 28 రోజుల ఒరిజినల్స్.
  • టెన్త్ నుంచి చివరిగా పూర్తి చేసిన కోర్సు వరకు మార్క్‌షీట్లు.
  • 20 రూపాయల నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై
  • స్పాన్సర్ ఇచ్చిన అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్.
  • వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ల రశీదులు (అవసరమైతే)
  • బ్యాంక్‌లోన్ మంజూరు లేఖ (అవసరమైతే)

యూజ్‌ఫుల్ వెబ్‌సైట్స్:
www.vfs-uk-in.com
www.ukba.homeoffice.gov.uk

Published date : 18 May 2022 03:54PM

Photo Stories