Telangana : వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్.. వారంలోగా..
వారిని నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ ఏల సర్దుబాటు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ జూలై 11వ తేదీన(మంగళవారం) సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
తుది నిర్ణయం..
వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్‌కమిటీ వీఆర్‌ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది. ఉప సంఘం సూచనల ప్రకారం వీఆర్‌ఏల సేవల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదే శించారు. ఉప సంఘం తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించారు.
పంచాయతీ కార్యదర్శుల పనితీరును..
నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిబంధనల మేరకు పరిశీలించి క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారి పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని, నిర్దేశిత లక్ష్యాల్లో మూడింట రెండో వంతు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతోపాటు పలు రకాల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావును కేసీఆర్ ఆదేశించారు.
పంచాయితీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెందాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.