Staff Nurses jobs : స్టాఫ్ నర్సు ఉద్యోగాల ఎంపిక నిలుపుదల.. కారణం ఇదే..
దాదాపు 30 నుంచి 40 మందికి వెయిటేజ్ మార్కులు కలపలేదని విషయం బయటకు రావడంతో.. ఈ జాబితాను పునఃపరిశీలన కోసం అధికారులు భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తప్పుల తడకలతో కూడిన 172 మంది అభ్యర్థుల జాబితాను మళ్లీ పరిశీలన చేస్తున్నారు. కొంత మందికి అనవసరంగా ఎలా మార్కులు కలిశాయన్న దానిపై యంత్రాంగం దృష్టి పెట్టింది. అమరావతి నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విశాఖ చేరుకుని జాబితాను పరిశీలిస్తున్నారు.
☛ చదవండి: Telangana Job notification: 5204 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఇప్పటివరకు నాలుగు సార్లు..
స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం ఇప్పటివరకు నాలుగు సార్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాబితాను తయారు చేశారు. జీఓ ప్రకారం జాబితా తయారు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఎంపికలో సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను తప్పించడం, అనర్హులను అందలం ఎక్కించడం కోసం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి. ఎంపికైన 172 మందిలో 100 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించారు. బుధవారం మరో 30 మంది సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది.
☛ 5,204 Jobs: స్టాఫ్ నర్సు పోస్టులు.. విభాగాలు, జోన్ల వారీగా పోస్టుల వివరాలు..
జాబితాను పునఃపరిశీలన చేస్తున్న క్రమంలో ఇందులో ఎంత మంది పేర్లు ఉంటాయో.. ఊడుతాయో తెలియని పరిస్థితి. కాగా.. ఎంపిక జాబితా రూపొందించడంలో సిబ్బంది తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మార్కులు కలపడం, మరోసారి తొలగించడం, ఎంపిక జాబితాలో కొందరి పేర్లు ఇప్పుడు తొలగించడం.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.
☛ స్టాఫ్ నర్సు పోస్టులు .. జోన్‌ల వారీగా పోస్టుల భర్తీ ఇలా..
కొత్త జాబితా కోసం..
పోస్టుల సంఖ్య పెరగడం, కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు కలపడం వంటి నిర్ణయాలు రావడంతో మెరిట్ లిస్ట్‌కు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఇందుకు సహకారం అందిస్తున్నారు. దీంతో కొత్త జాబితా కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా..అర్హులకు అన్యాయం జరగదని డాక్టర్ ఉమా సుందరి హామీ ఇస్తున్నారు.
చదవండి: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, చిత్తూరు జిల్లాలో 53 పోస్టులు.. ఎవరు అర్హులంటే..