Skip to main content

TS Govt Jobs: భారీగా మిగిలిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు!.. కార‌ణం ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్‌లాగ్‌ తిప్పలు పట్టుకున్నాయి.
backlog jobs are Left Out Last Three Months Across Telangana

ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో.. గణనీయ సంఖ్యలో ఉద్యోగా­లు భర్తీకాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి.

ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమవుతున్నాయి.

చదవండి: UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ–సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్‌–2024

ఉద్యోగాలకు ఎంపికైనవారు వాటిని వదులుకుంటే.. తర్వాతి మెరిట్‌ అభ్యర్థులకు కేటాయించే పరిస్థితి (రిలిక్విష్‌మెంట్‌) లేకపోవడం కూడా సమస్యకు దారితీస్తోంది. ఇలా మిగిలిపోయిన ఉద్యోగాలకు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది.

ఇటీవల భర్తీ చేసిన గురుకుల కొలువులు, పోలీస్‌ కానిస్టేబుల్, స్టాఫ్‌ నర్స్, మెడికల్‌ ఆఫీసర్‌ తదితర కేటగిరీ ఉద్యోగాల్లో సుమారు 10శాతానికిపైగా ఇలా మిగిలిపోవడం గమనార్హం. 

చదవండి: UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

33వేల కొలువుల్లో.. 4,590 ఉద్యోగాలు ఖాళీ.. 

రాష్ట్రంలో గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఇందులో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయినట్టు నియామక సంస్థల ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత రానుంది.

గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో ఇప్పటివరకు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. ఏకంగా 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలినట్టు సమాచారం. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఇటీవల చేపట్టిన 15,644 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో దాదాపు 2వేల ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఇక మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 7 వేల స్టాఫ్‌ నర్సు, 1,150 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయగా.. వీటిలోనూ 780 ఉద్యోగాలు మిగిలిపోయాయి. 

చదవండి: Indian Army Recruitment 2024: ఏఆర్‌వో సికింద్రాబాద్‌ పరిధిలో అగ్నివీర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రిలిక్విష్మెంట్‌ లేకపోవడంతో.. 

తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్‌ విధానాన్ని అనుసరించారు. అంటే ఏదైనా నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రకటించిన ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకుంటే.. అందులోని తర్వాతి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీచేసేందుకు వీలు ఉండేది. 2018 వరకు ఈ విధానాన్ని అనుసరించారు.

కానీ ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, దానికితోడు ఇతర కారణాలతో రిలిక్విష్మెంట్‌ విధానాన్ని పక్కనబెట్టారు. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చాక జారీ అయిన నోటిఫికేషన్లలో రిలిక్విష్మెంట్‌ అంశాన్ని జతచేయలేదు.

అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎన్ని పోస్టులు మిగిలినా అదే నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే అవకాశం లేదు. ఇటీవల రిలిక్విష్మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, నిబంధనలపై చర్చించినా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఫలితంగా భర్తీ ప్రక్రియలో బ్యాక్‌లాగ్‌ ఖాళీలు మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నియామకాల ప్రక్రియలు ఇంకా కొనసాగుతుండటంతో.. నోటిఫికేషన్ల వారీగా ఏర్పడే ఖాళీలపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు.   

Published date : 29 Mar 2024 12:54PM

Photo Stories