Skip to main content

Rs.3000 AP Unemployment Allowance : ఇక రూ.3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తాంటే ..? అలాగే జాబ్‌ క్యాలెండర్ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఎదురు చూస్తోంది. జాబ్‌ క్యాలెండర్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు . ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు.. ‘నిరుద్యోగ భృతి’ రూ. 3000 ఇవ్వాలని కోరుతున్న విష‌యం తెల్సిందే. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా నిరుద్యోగ భృతిపై నోరు మెదపక పోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
AP Rs.3000 Unemployment Allowance Details

ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని.. లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశతో ఎదురు చూస్తోంది. చాలామంది చిన్నా చితకా పనులు వదిలేసి.. స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్ధిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగోలా నెట్టుకు రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

☛ Thalliki Vandanam Scheme New Rule : మీ పిల్లల‌కు రూ.15000 రావాలంటే.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..!

సూపర్‌ సిక్స్‌ టాప్‌లో నిరుద్యోగ భృతి..
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌లో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో తెలిపారు.  అలాగే మెగా డీఎస్సీ పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16 వేల పోస్టుల భర్తీ కాస్తా నత్త నడకను తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ కొలువుల కోసం పోటీపడే వారు లక్షల్లో ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇంకా వయస్సు ఉండి.. ఆర్ధిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్లలో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారందరినీ కలుపుకుంటే దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్న పరిస్థితి. 

గ్రూప్ 1, 2 , డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం..
ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వ నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్ధిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తున్నారు. పేరొందిన సంస్థల్లో గ్రూప్‌ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్‌ కోసమే రూ.లక్షలు, సాధారణ శిక్షణ కేంద్రాల్లో రూ.50 వేల వరకు ఖర్చువుతోంది. గ్రూప్‌–2కు అయితే రూ.30 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. డీఎస్సీ, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా రూ.వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికి తోడు భోజనం, హాస్టల్‌ ఖర్చుల నిమిత్తం తక్కువలో తక్కువ నెలకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటు, ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు..
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రధాన హామీగా పదే పదే ప్రచారం చేసుకుంది. అయితే అధికారంలోకి రావడం.. పాలనను ప్రారంభించడంతో పాటు.. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు మొదలెట్టారు. కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు కూడా ప్రారంభించ లేదు. 

ఈ సారి ఎలాంటి మెలిక పెట్ట‌తాడో..
అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ చదివిన వారు అనర్హులని తేల్చడంతో పాటు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని మెలిక పెట్టారు. కొన్ని చోట్ల కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారికి, 120 సీసీ ద్విచక్ర వాహనం ఉన్న వారిని సైతం పక్కన పడేశారు. ఇలా వడపోత అనంతరం తొలుత 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత ఆ సంఖ్యను పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ.. 1.62 లక్షల మందికే ఇస్తామని.. దీనికి ఈ–కేవైసీ లింక్‌ పెట్టి కేవలం వేల సంఖ్యలో మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. గతంలో ఇలా నిరుద్యోగ భృతి హామీని నీరుగార్చి.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అనుభవం దృష్ట్యా ఈ సారైనా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలతో పాటు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇవ్వాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.   

వయో పరిమితిని ..
రాష్ట్రంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 42 ఏళ్లు, రిజర్వడ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో 5 ఏళ్లు అదనంగా ఉంటుంది. ఈ క్రమంలో 40 ఏళ్లు దాటినప్పటికీ ప్రభుత్వ కొలువు సాధించాలనే సంకల్పంతో చాలా మంది ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూ, విజయం కూడా సాధిస్తున్నారు.  ఏపీపీఎస్సీ వయో పరిమితి ఇలా ఉంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 22–35 ఏళ్ల వయస్సు వారికి మాత్రమే భృతికి అర్హులని ప్రకటించడంతో చాలా మంది నష్టపోయారు. ఇంటర్‌ చదువుకున్న వారు కూడా ఏదో ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతారు. డిప్లొమా చేసిన వారి వయసు కూడా 19 ఏళ్ల లోపుగానే ఉంటుంది. వీళ్లందరిని కూడా గతంలో గుర్తించక పోవడం నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 

ఇక నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వాల్సిందే..
జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలి. ఒక్క నెల నోటిఫికేషన్‌ ఆలస్యమైనా లక్ష­లాది మంది నిరుద్యోగులు వయో పరిమితి దా­టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. యువగళంలో లోకేశ్‌.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. టీడీపీ 2014–19లో నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నిరుద్యోగుల ఉద్యమ సత్తాను చూడాల్సి వస్తుంది.  
                                                                   – వై.రామచంద్ర, నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు 
 
తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే .. లేదంటే..! 
గతంలో మాదిరి నిరుద్యోగులను మోసం చేయకుండా జనరల్‌ అభ్యర్థులతో సహా అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు కల్పించే వరకు ఆర్ధిక సాయంగా భృతి ఇస్తే నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది.  ఈసారి అమలు చేయబోయే నిరుద్యోగ భృతి కనీసం 40 ఏళ్లు దాటి పోటీ పరీక్షలు రాసేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే.   
                                           – సమయం హేమంత్‌ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు 

ఇప్ప‌టి వ‌ర‌కు నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు ..
నూత‌న ప్రభుత్వం ఏర్పడి నెల గడుస్తున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా..? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్‌ తీసుకుంటారా..? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలోని 1.70 కోట్ల కుటుంబాలపై నేరుగా పడుతుంది.    
                           – మేడూరి నవీన్‌ దాస్, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లా కాలేజ్, విశాఖపట్నం 
 
జాబ్‌ క్యాలెండర్ ఇంకెప్పుడు విడుద‌ల చేస్తారు..?
ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి. జాబ్‌ క్యాలెండ్‌ కంటే ముందు పాత నోటిఫికేషన్లను పూర్తి చేయాలి. ఈలోగా నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి నెలా రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలి. దీని స్పష్టమైన తేదీలను ప్రకటించాలి.
                                         – కొనిగపాగ అనిల్‌ బాబు, విజయవాడ

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకెప్పుడు ఇస్తారు..?
ఈ పథకం కింద (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌), వసతి దీవెన పథకాల కింద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో సగటున 27 లక్షల మంది విద్యార్థులకు రూ.18,663.44 కోట్లు అందజేసింది. విద్యార్థులకు మీరు ఈ సాయాన్ని ఎప్పుడు అందిస్తారు?

అమ్మ ఒడి పథకంకి ఇక వంద‌న‌మేనా..?
ఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున సగటున 42.62 లక్షల మంది తల్లులకు నాలుగేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.26,067.28 కోట్లు ఇచ్చింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ కింద కోటికి పైగా పిల్లలకు మీరు ఎప్పుడు ఈ సాయం అందిస్తారు..?

 Amma ki Vandanam Scheme : అమ్మ‌కు వంద‌నం.. అంతా మాయ..? ప్ర‌తి విద్యార్థికి రూ.15 వేలు ఇంకెప్పుడు..?

Published date : 15 Jul 2024 06:52PM

Photo Stories