Skip to main content

Medical Jobs: ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ!

Medical and Health Departmentలో మానవ వనరుల కొరతకు ఆస్కారం లేకుండా పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
Medical Jobs
ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ!

ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా చర్యలు చేపడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో అనేక విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 40 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. భారీగా నియామకాలు చేపట్టినప్పటికీ ఉద్యోగుల మరణాలు, ఉద్యోగ విరమణ, వీఆర్‌ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోతే వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఎప్పటికప్పుడు వైద్య శాఖలో ఏర్పడిన పోస్టులను భర్తీ చేసుకునేలా ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర అనుమతులు (బ్లాంకెట్‌ పర్మిషన్‌) ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి మూడు నెలలకు ఓసారి ఖాళీ అయిన పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ప్రతిసారి అనుమతులు లేకుండా

ఉద్యోగులు మరణించడం, వీఆర్‌ఎస్, పదవీ విరమణ వంటి కారణాలతో ఏడాది పొడవునా ఏదో ఒక విభాగంలో పోస్టులు ఖాళీ అవుతుంటాయి. ఈ తరహాలో గత ఏడాదికిపైగా కాలంలో ప్రజారోగ్య విభాగంలో 91, డీఎంఈలో 272 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 150 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 130 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటికి అదనంగా వందల సంఖ్యలో స్టాఫ్‌ నర్సు, పారామెడికల్, నాన్‌మెడికల్‌ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు విభాగాలతోపాటు వైద్య విధాన పరిషత్‌ను కూడా కలుపుకుంటే 2 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయని అంచనా. వీటిని భర్తీ చేయాలంటే మొదట ఆర్థిక శాఖ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపి.. ఆర్థిక శాఖ అనుమతులు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అత్యవసర అనుమతులు రావడం వల్ల ఖాళీల భర్తీకి ప్రతిసారి ప్రతిపాదనలు పంపడం, ఆర్థిక శాఖ అనుమతుల కోసం ఎదురుచూడటం వంటివి ఉండవు. 

చదవండి: 3 530 Jobs: కొత్త వైద్య కళాశాలలకు 3,530 పోస్టులు

ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు..

ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. ఖాళీలన్నింటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ఆస్పత్రుల్లో మానవవనరుల కొరతకు తావుండకూడదన్న సీఎం ఆశయాన్ని నెరవేర్చడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నాం.
– జె.నివాస్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ

సీఎస్‌కు ప్రతిపాదనలు పంపాం..

వైద్య శాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా అనుమతులు కోరుతూ సీఎస్‌కు ప్రతిపాదనలు పంపాం. ఏటా సెప్టెంబర్‌ నుంచి ఆగస్టు మధ్య పదోన్నతులు, ఉద్యోగ విరమణల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నాం. వీటిని ఓ ప్రణాళిక ప్రకారం భర్తీ చేస్తే ఉద్యోగుల మరణాలు, వీఆర్‌ఎస్‌ల రూపంలో ఏర్పడే ఖాళీలను అప్పటికప్పుడు భర్తీ చేయొచ్చు. తద్వారా వైద్య శాఖలో పోస్టుల ఖాళీలన్న మాటకు తావుండదు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
– ముద్దాడ రవిచంద్ర, ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ

Published date : 05 Jul 2022 02:54PM

Photo Stories