Skip to main content

Department of Education: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ!.. షెడ్యూల్‌ ఇదీ...

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ రూపొందించింది.
Department of Education
టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ!.. షెడ్యూల్‌ ఇదీ...

సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్‌ 15న ఆన్‌లైన్‌లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు.

అయితే, ముందుగా హెచ్‌ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు. తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్‌ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

అక్టోబర్‌ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది.

చదవండి: DSC 2023 Notification: టీచర్‌ పోస్టులు @ 43.. పోస్టులు ఖాళీల్లో ఈ జిల్లాదే చివరి స్థానం

జనవరి షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు 

ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్‌ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌ కటాఫ్‌ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెప్టెంబర్‌ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు.

చదవండి: Teachers Transfers and Promotions: నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు.. వీరికి మాత్రం ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు

రిటైర్మెంట్‌కు 3 ఏళ్ళలోపు సర్వీస్‌ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్‌ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్వీస్‌ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్‌డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్‌ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. 

సీనియారిటీ దగ్గరే తికమక 

ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్‌ఏల్లో ఫిజిక్స్, మేథ్స్‌.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్‌ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్‌ఎం పోస్టులు మల్టీ జోనల్‌ అయినప్పుడు 14 జిల్లాల ఎస్‌ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్‌ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు.  40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్‌లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు.   

టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ ఇదీ... 

తేదీ

చేయాల్సిన కార్యక్రమం

3–5.9.23

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

6–7.9.23

ఆన్‌ లైన్‌ అప్లికేషన్‌ కాపీలను డీఈవోలకు సమర్పించడం

8– 9.9.23

దరఖాస్తు చేసిన వారి పేర్ల ప్రదర్శన

10– 11.9.23

అభ్యంతరాల స్వీకరణ

12–13.9.23

సీనియారిటీ జాబితా వెల్లడి

14.9.23

ఎడిట్‌ ఆప్షన్లు

15.9.23

ఆన్‌లైన్‌ ద్వారా హెచ్‌ఎంల బదిలీ

16.9.23

ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీల వెల్లడి

17–19.9.23

స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి హెచ్‌ఎంలుగా ప్రమోషన్స్‌

20,–21.9.23

ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వెల్లడి. 

21.9.23

ఎస్‌ఏలకు వెబ్‌ ఆప్షన్లు

22.9.23

ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం

23–24.9.23

స్కూల్‌ అసిస్టెంట్‌ బదిలీలు

24.9.23

స్కూల్‌ అస్టింట్‌ ఖాళీల వెల్లడి

26–28.9.23

ఎస్జీటీనుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు

29–31.9.23

ఎస్‌జీటీ ఖాళీల వెల్లడి

2.10.23

ఎస్‌జీటీ ఎడిట్‌ ఆప్షన్స్‌ 

3.10.23

ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు

5–19.10.23

 అప్పీల్‌ చేసుకునే అవకాశం  

Published date : 02 Sep 2023 11:46AM

Photo Stories