Skip to main content

Jobs: కీలక పోస్టులు ఖాళీ.. ఈ సెంటర్‌లో కీలక పోస్టులన్నీ ఖాళీగానే

గద్వాల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌లో కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. దీంతో కేంద్రం పర్యవేక్షణ.. రక్షణ కోసం వచ్చే మహిళలు, యువతులకు భరోసా కరువైంది.
Key posts in Sakhi Center are vacant
కీలక పోస్టులు ఖాళీ.. ఈ సెంటర్‌లో కీలక పోస్టులన్నీ ఖాళీగానే

సఖి సెంటర్‌లో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. కేవలం ఏడుగురిని మాత్రమే నియమించగా అందులో నలుగురు పాతవారే. మరో ముగ్గురు కొత్తవారిని నియమించారు.

చదవండి: TOMCOM: విదేశీ ఉద్యోగాలకు 5న ఎన్‌రోల్‌మెంట్‌

పట్టించుకునే వారేరీ..?

నాలుగు నెలల క్రితం గద్వాల సఖి సెంటర్‌లో సిబ్బంది పెళ్లి రోజు వేడుకలు నిర్వహించడం.. ఈ విషయంపై కలెక్టర్‌ సీరియస్‌ అయి 14మంది సిబ్బందిపై వేటు వేయడంతోపాటు ఎన్జీఓను సైతం బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన శ్రామిక వికాస కేంద్రానికి కేంద్రం బాధ్యతలు అప్పగించారు.

ఏప్రిల్‌లో సఖి సెంటర్‌లో సెంటర్‌ అడ్మినిస్ట్రేటివ్‌, కేసు వర్కర్‌, సైకో సోషల్‌ కౌన్సిలర్‌, లీగల్‌ కౌన్సిలర్‌, పారామెడికల్‌, ఐటీ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఇటీవల నలుగురు పాతవారిని, అందులో ఇద్దరు మల్టీపర్సస్‌, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించారు. కొత్తగా ఇద్దరు కేసు స్టడీవర్కర్లు, ఒక సైకో సోషల్‌ కౌన్సిలర్‌ను నియామకం అయ్యారు.

చదవండి: Jobs: దేవాదాయ శాఖలో కీలక పోస్టులు ఖాళీ

అయితే సెంటర్‌లోని ప్రధాన పోస్టులైన అడ్మినిస్ట్రేటివ్‌, పారామెడికల్‌, ఐటీ అసిస్టెంట్‌ పోస్టులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం విధులు చేపడుతున్న సైకో సోషల్‌ కౌన్సిలర్‌యే ఇంచార్జ్‌ సీఏగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా సఖి సెంటర్‌ నియామకాల ప్రక్రియను త్వరగా చేపట్టి బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా ముందడుగు వేయడంలేదు.

నియామకాల ప్రక్రియ ఏన్జీఓదే.. అంటూ చేతులెత్తేస్త్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కేసుల పరిష్కారం, కౌన్సెలింగ్‌ విషయంలో సమస్యగా మారింది. పూర్తిస్ధాయిలో సిబ్బందిని నియమిస్తేనే బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వేతనాల పెండింగ్‌తో ఇబ్బంది

ఇదిలాఉండగా, గతంలో సఖి సెంటర్‌లో పని చేసిన 14మంది సిబ్బందికి నాలుగు నెలలకుపైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సిబ్బందికి అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు జీతాలు ఇవ్వకుండా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలోని ఓ అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమను విధుల్లో నుంచి తొలగించి దాదాపు 5నెలలు గడిచిన ఇప్పటి వరకు పెండింగ్‌లోని జీతాలు చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. తమకు ఉద్యోగం లేక.. కుటుంబ పోషణ భారంగా మారిన క్రమంలో తమకు రావాల్సిన జీతాలను మాత్రం పట్టించుకోవట్లేదనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికై నా అధికారులు స్పందించి పెండింగ్‌ జీతాలను ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయంపై డీడబ్ల్యూఓ ముసాయిదా బేగంను ‘సాక్షి’వివరణ కొరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.

త్వరలో నియమిస్తాం

సఖి సెంటర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించాం. కానీ, ఆ పోస్టులకు సరిపడా విద్యార్హతలు ఉన్న వారు ఎవరూ లేరు. సీఏ, కంప్యూటర్‌ డాటా ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి కొన్ని వెబ్‌సైట్లలో నోటిఫికేషన్‌ పొందుపర్చాం. ఆగ‌స్టు 10వరకు దరఖాస్తులు వస్తే అర్హులను నియమిస్తాం. గతంలో పనిచేసిన వారిలో అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన వారిని ఎవరినీ తీసుకోలేదు.
– లక్ష్మణ్‌ రావు, శ్రామిక వికాస కేంద్రం నిర్వాహకుడు, గద్వాల

Published date : 04 Aug 2023 01:56PM

Photo Stories