Skip to main content

పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు దీవెన

నంద్యాల: పేద విద్యార్థులు విదేశాల్లోనే అగ్రగామి యూనివర్సిటీల్లో చదవాలనే లక్ష్యంతో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పేర్కొన్నారు.
Blessings for the bright future of poor students
పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు దీవెన

గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 357 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.45.53 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వర్చువల్‌గా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌, ఎమ్మెల్సీ ఇషాక్‌ బాషా, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, మైనారిటీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్‌, బీసీ సంక్షేమ అధికారి లక్ష్మీదేవి, విద్యార్థులు, విద్యార్థుల తలిదండ్రులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన టాప్‌ 50 యూనివర్సిటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు అయ్యే ఖర్చును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్లు, మిగిలిన వారికి రూ.కోటి వరకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. విమాన చార్జీలు, వీసా చార్జీల నుంచి విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లలేని విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం కింద 2022–23 సంవత్సరానికి జిల్లాకు సంబంధించి రూ.64,24,012 ఐదుగురు విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారన్నారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఎంతో మేలు చేకూరుస్తోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి ఉన్నత పదవులను అలంకరించాలన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని నీరుగార్చిందని, దాదాపు రూ.318 కోట్లు బకాయి లు పెట్టిందన్నారు. గతంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు రూ.15 లక్షలు, మిగిలిన వారికి రూ.10 లక్షలు అందజేస్తే నేడు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కో విద్యార్థిపై రూ. కోటికి పైగా ఖర్చు పెడుతున్నారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్సీ, మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌, తదితరుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు.

Published date : 28 Jul 2023 04:24PM

Photo Stories