Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనతో 40,397 మంది విద్యార్థులకు రూ.27.43 కోట్లు లబ్ధి
కాకినాడ సిటీ: జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 40,397 మంది విద్యార్థులకు రూ.27.43 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టరేట్‌లో జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ కృతికా శుక్లా, కౌడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి డీవీ రమణమూర్తి తదితరులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమ చేసిన అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫీజు రీయంబర్స్‌మెంట్ మెగా చెక్‌ను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ రంగంలో విప్లవాత్మక కార్యక్రమలు, పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సమస్యలు అడ్డం కాకూడదని ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్‌పరంగా ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ పథకాలను ఉపయోగించుకొని ఉన్నత విద్యా నైపుణ్యాలను పెంపొందించుకొని అధిక వేతన ప్యాకేజీలతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు.
క్రమం తప్పకుండా ద్వారా లబ్ధి
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేస్తోందని కలెక్టర్ వివరించారు. పథకం కింద ఈ త్రైమాసికానికి జిల్లాలో వివిధ వర్గాల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్ధిక సామయం జమ అవుతున్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి డీవీ రమణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎ విజయశాంతి, వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు.
చదవండి: Jagananna Vidya Deevena Scheme: జగనన్నవిద్యాదీవెన రూ.24.85 కోట్లు
జిల్లాలో విద్యా దీవెన పథకం లబ్ధి వివరాలు
కేటగిరి | విద్యార్థులు | లబ్ధి (రూ.) |
ఎస్సీ | 6,203 | 4,49,62,365 |
ఎస్టీ | 309 | 16,60,049 |
బీసీ | 18,666 | 12,06,03,091 |
ఈబీసీ | 2,689 | 2,18,73,085 |
ముస్లిం మైనారిటీ | 529 | 37,32,604 |
కాపు | 11,893 | 8,06,41,829 |
క్రిస్టియన్ మైనారిటీ | 108 | 8,35,440 |
మొత్తం | 40,397 | 27,43,08,473 |