UDISE Plus: పాఠశాలలు, విద్యార్థులు లెక్క ఇకపై పక్కా
అన్ని రాష్ట్రాల విద్యార్థుల వివరాలు ఒకే పోర్టల్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం యూడైస్ ప్లస్ (వెరిఫికేషన్) పేరుతో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ చేపట్టింది. మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, ఉపకార వేతనాలు, రవాణా భత్యం తదితర పథకాలకు యూడైస్‌లోని వివరాల ఆధారంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించనుంది. గతంలో లెక్కలు సక్రమంగా లేక నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉండటంతో ఈ ఏడాది నుంచి యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
చదవండి: Adilabad: యూడైస్‌లో వెనుకంజ
మూడంచెల విధానంలో పరిశీలన..
డిసెంబర్ 14వ తేదీనే సర్కార్ పాఠశాలల్లో సమగ్ర వివరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం యూడైస్ ప్లస్ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాలను మూడంచెల విధానంలో పరిశీలించనున్నారు. పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వివరాలను సమగ్రంగా పరిశీలించి, మండల విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించనున్నారు. 25శాతం బడులను ఎంఈఓలు, 10శాతం బడులను డీఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
చదవండి: Tenth Exams: యూడైస్‌లో పేరుంటేనే 'పది' పరీక్షలకు అనుమతి
శాశ్వత క్రమసంఖ్య కేటాయింపు..
ఏక్ భారత్.. ఏక్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి విద్యార్థికి శాశ్వత క్రమసంఖ్య కేటాయిస్తారు. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం పొందిన నాటి నుంచి కళాశాల విద్య పూర్తయ్యే వరకు కేటాయించిన క్రమసంఖ్య ఆధారంగా వివరాలను నమోదు చేస్తారు.
చదవండి: యూడైస్ ప్లస్‌లో విద్యార్థుల వివరాలు సవరించాలి
పకడ్బందీగా సమాచార సేకరణ..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటికి అదనంగా మరిన్ని వివరాలను యూడైస్ పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, ఎన్ని బడులు ఉన్నాయి? ఎన్ని తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి? ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు? ఏకరూప దుస్తులు, పుస్తకాలు ఎన్ని అవసరమవుతాయి? తదితర సమగ్ర వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు.
పారదర్శకతకు దోహదం..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతులు తదితర వివరాలను పకడ్బందీగా యూడైస్ ప్లస్ పోర్టల్‌లో నమోదు చేశాం. వివరాల పరిశీలన కొనసాగుతోంది. నిధులను సక్రమంగా వినియోగించడానికి, పారదర్శకత పాటించడానికి ఇది ఉపయోగపడనుంది. ఇక నుంచి ఏటా యూడైస్ ఆధారంగానే నిధులు మంజూరవుతాయి.
– గోవిందరాజులు, డీఈఓ
నిధులు సద్వినియోగమయ్యేలా..
బడుల్లో నిర్వహణ, నిధుల ఖర్చులో పారదర్శకత పాటించేలా యూడైస్ ప్లస్ పోర్టల్ ఉపయోగపడనుంది. ఏటా జరిగే మార్పులు, చేర్పులపై బడుల నిర్వాహకులకు ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోపాటు పోర్టల్ నమోదు ప్రక్రియ పూర్తయింది. మన ఊరు–మనబడి, పీఎంశ్రీ పథకం కింద ప్రభుత్వ బడులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు ప్రాధాన్యం సంతరించుకుంది.