SEAS-2023: పాఠశాల విద్యార్థులకు సీస్ పరీక్షలు..
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించేందుకు నవంబర్ 3వ తేదీన రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎస్‌ఈఏఎస్–2023) నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,6,9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సర్వేలో భాగంగా అభ్యాసన సామర్ధ్య పరీక్ష నిర్వహించేందుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని 819 పాఠశాలల పరిధిలో 20,495 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
➤ AP Government Jobs : కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వీరికే.. పూర్తి వివరాలు ఇవే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక ఇంగ్లిష్ మీడియంలో చదువులను చెప్పిస్తున్న ప్రభుత్వం ఇంగ్లిషుతో పాటు గణిత, భౌతిక, సామాన్యశాస్త్రాల వారీగా విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకునేందుకు గాను రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా సీస్–2023 నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని, పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాఠశాలల్లో 3,6,9 తరగతుల వారీగా విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించడం ద్వారా పాఠ్యాంశాల్లో మార్పులు, సిలబస్ రూపకల్పనపై సమగ్రమైన నిర్ణయాలను తీసుకునేందుకు వీలుగా సీస్‌ను నిర్వహిస్తున్నారు.
➤ Contract Jobs: కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు.. ఎందులో?
జిల్లాలో 819 పాఠశాలలు ఎంపిక
గుంటూరు జిల్లాలో ఎంపిక చేసిన 819 పాఠశాలల్లో 3,6,9 తరగతులు చదువుతున్న 20,495 మంది విద్యార్థులకు నవంబర్ 3వ తేదీన సీస్–2023 జరగనుంది.
అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకునేదిలా...
మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు వారు చదువుతున్న పాఠ్యాంశాలపైనే ప్రశ్నలతో కూడిన పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో విద్యార్థులకు సిలబస్‌తో లాంగ్వేజ్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 9వ తరగతి విద్యార్థులకు ఎనిమిదో తరగతి సిలబస్‌తో లాంగ్వేజ్, గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు. మూడు, ఆరు తరగతుల వారికి 40 ప్రశ్నలతో కూడిన పరీక్షకు ఒక గంట సమయాన్ని కేటాయిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలతో కూడిన పరీక్షకు గంటన్నర సమయాన్ని ఇస్తారు.
ఫీల్డ్ ఇన్విజిలేటర్లుగా కాలేజీ విద్యార్థులు
డైట్ అధ్యాపకుల పర్యవేక్షణలో ఫీల్డ్ ఇన్విజిలేటర్లుగా బీఎడ్, డీఎడ్, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులను ఇన్విజిలేటర్లుగా నియమించి వారి పర్యవేక్షణలో పాఠశాలల్లో విద్యార్థులకు సీస్–2023 నిర్వహించనున్నారు. ఎంఈవోలు మండలస్థాయిలో కో–ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. వారు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సమన్వయపరచుకుని పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో డీఈవో సీస్–2023ను పక్కాగా నిర్వహించేందుకు పర్యవేక్షించనున్నారు. సీస్ నిర్వహణపై ఎంఈవోలకు శిక్షణ పూర్తి చేశారు. వారి ఆధ్వర్యంలో డైట్ అధ్యాపకులు, హెచ్‌ఎంలకు శిక్షణ కల్పించనున్నారు.
➤ Children's Day Competitions: బాలల దినోత్సవం సందర్భంగా పోటీలు..
3న స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,6,9 తరగతుల విద్యార్థులకు పరీక్ష గుంటూరు జిల్లాలో 819 పాఠశాలల్లో పరీక్ష రాయనున్న 20,495 మంది విద్యార్థులు
విద్యార్థులతో ప్రాక్టీసు చేయించాలి
రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న అచీవ్‌మెంట్ సర్వేల్లో పాల్గొంటున్న పాఠశాలల యాజమాన్యాలు సంబంధిత విద్యార్థులతో ప్రాక్టీసు చేయించాలి. దసరా సెలవులు ముగిసి, పాఠశాలలు పున: ప్రారంభమైనప్పటి నుంచి సర్వే నిర్వహణపై ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసిన పాఠశాలల్లో 3,6,9 తరగతుల వారీగా ప్రతి తరగతిలో 30 మంది విద్యార్థుల చొప్పున పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
–పి. శైలజ, డీఈవో