Skip to main content

PM-Shri Scheme: పాఠశాలలకు వరం

Schools applying in the scheme of PM-Shri

దరఖాస్తు చేయాలిలా..

  • స్టెప్‌–1లో భాగంగా పాఠశాలల రిజిస్ట్రేషన్‌ చేయాలి.
  • స్టెప్‌–2లో పరిశీలన ప్రక్రియ ఉంటుంది. హెచ్‌ఎం లాగిన్‌లో పీఎం–శ్రీ పోర్టల్‌ నమోదు చేసిన వెంటనే ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అందులో పేర్కొన్న 42 అంశాలను పూర్తి చేయాలి.
  • వీటితో పాటు హెచ్‌ఎం, పంచాయతీ కార్యదర్శి, విద్యార్హత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
  • తర్వాత కేంద్ర విద్యా శాఖ ఆయా పాఠశాలలకు మార్కులు వేస్తుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు 60 శాతం, పట్టణాల్లోని పాఠశాలలు 70 శాతం మార్కులు సాధిస్తే ఈ పథకానికి అర్హత పొందుతాయి.
  • ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.

రాయవరం: మన బడి నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాలలను భౌతికంగా అభివృద్ధి చేయడంతో పాటు, విద్యాపరంగా గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన బడి నాడు–నేడు మాదిరిగానే, ఇప్పుడు కేంద్రం కూడా ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం–శ్రీ) పథకాన్ని గత విద్యా సంవత్సరం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు హై క్వాలిటీ విద్యను అందించనున్నారు. యూడైస్‌ 2021–22 ద్వారా విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లోని విద్యార్థుల సమగ్ర ప్రగతే లక్ష్యంగా.. వాటికి నేరుగా నిధులు అందజేసే పీఎం–శ్రీ పథకం తొలి విడతకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి 21 పాఠశాలలు ఎంపికయ్యాయి. జిల్లా స్థాయిలో ఈ పథకానికి జిల్లా విద్యాశాఖాధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు.

చదవండి: Collector Shashank: పాఠశాలల దత్తతకు ముందుకు రావాలి

ఎంపిక చేస్తారిలా..
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నిర్వహణలోని అన్ని పాఠశాలలూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మూడంచెల ప్రక్రియ ద్వారా పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆయా పాఠశాలలే నిర్దేశిత ఫార్మాట్‌లో సంబంధింత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న పాఠశాలలను జియో ట్యాగింగ్‌ చేసి, కార్యకలాపాలను సమీక్షిస్తారు. ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఓపెన్‌ అయిన సమయంలో మాత్రమే పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పక్కా భవనం, బాలురకు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, ఆటస్థలం తదితర కొన్ని వసతులు ఆయా పాఠశాలల్లో కచ్చితంగా ఉండాలి. పీఎం–శ్రీలో ఎంపికై న పాఠశాలల హెచ్‌ఎంలు చేపట్టాల్సిన పనులపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఇప్పటికే వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

విడతల వారీగా నిధులు
పీఎం–శ్రీ పథకంలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను నిపుణుల కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికై న పాఠశాలలకు విడతల వారీగా నేరుగా నిధులు అందజేస్తారు. ఈ నిధులతో విద్యార్థులకు అవసరమైన సాంకేతిక సాధనాలను ఆయా పాఠశాలలు సమకూర్చుకోవచ్చు. డిజిటల్‌ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఎంపికై న పాఠశాలలకు ఐదేళ్ల వరకూ ఆర్థిక, సాంకేతిక సహకారం లభిస్తాయి. ఎంపికై న పాఠశాలలను పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్‌ స్కూల్స్‌గా మార్చాల్సి ఉంటుంది. పాఠశాలల్లో సోలార్‌ ప్యానెళ్లు, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి స్వయంగా సేంద్రియ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలి. పాఠశాలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలి. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వ్యర్థాల నిర్వహణ వంటివి చేయాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సంప్రదాయ విధానాలను విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుంది.

జిల్లాలో పరిస్థితి ఇదీ..
పీఎం–శ్రీ పథకం రెండో దశ కింద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 410 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు దరఖాస్తుకు అర్హత సాధించాయి. వీటిలో 304 ప్రాథమిక, 31 ప్రాథమికోన్నత, 75 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి 368, పట్టణ ప్రాంతం నుంచి 42 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం వచ్చే మార్కుల ఆధారంగా ఆయా పాఠశాలలకు పీఎం–శ్రీ పథకానికి ఎంపికవుతాయి.

రెండో దశ పీఎం–శ్రీకి దరఖాస్తుల ఆహ్వానం కోనసీమ జిల్లాలో దరఖాస్తుకు అర్హత పొందిన 410 పాఠశాలలు ఎంపికై న పాఠశాలలకు కేంద్రం సహకారం యూడైస్‌ 2021–22 ప్రామాణికం వేగవంతం చేయాలి

పీఎం–శ్రీ పథకంలో రెండో దశకు ఎంపికై న పాఠశాలల జాబితాను ఆయా మండలాల విద్యాశాఖాధికారులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించాం. పీఎం–శ్రీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే విధానంపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే వెబెక్స్‌ నిర్వహించాం. ఈ పథకం ద్వారా ఎంపికై న పాఠశాలల్లో కార్పొరేట్‌ తరహాలో అన్ని సౌకర్యాలతో విద్య అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్‌లో పాఠశాలలు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలి.
– ఎం.కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం
 

Published date : 18 Aug 2023 04:54PM

Photo Stories