Nadu Nedu Scheme: 'నాడు–నేడు'తో మారిన పాఠశాలల రూపురేఖలు!!
కార్పొరేట్‌ను తలదన్నేలా మౌళిక వసుతులు సమకూరాయి. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా వసతులు కల్పించారు. పిల్లల చదువుకు కావాల్సిన వస్తువులను విద్యాకానుక పేరుతో అందిస్తున్నారు. పిల్లలు చదువులో రాణించాలంటే ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజుకో మెనూతో పాటు కోడిగుడ్లు, రాగిజావ, చిక్కీ అందజేస్తున్నారు. దీంతో పిల్లలు ఆడుతూ పాడుతూ పాఠశాల మెట్లెక్కి సంతోషంగా విద్యనభ్యసిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద 605 పాఠశాలలను రూ.148 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండవ విడత కింద 1037 పాఠశాలల్లో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు. వాటిలో నాడు–నేడు కింద తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రీన్‌చాక్ బోర్డు, కిచెన్‌షెడ్డు, ఇంగ్లిష్ ల్యాబ్ తదితర పనులు చేస్తున్నారు. ఇందుకోసం రూ.341 కోట్లు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి.
Inter board: ఇంటర్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఆధునికీకరణ.. నాడు–నేడుతో విప్లవాత్మక మార్పులు
ప్రత్యేక బృందంతో పనుల నిర్వహణ
జిల్లాలో జరుగుతున్న నాడు–నేడు రెండో విడత పనులకు సంబంధించిన ప్రొగ్రెస్‌పై సమగ్రశిక్ష కార్యాలయంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. టీమ్ సభ్యులు పాఠశాలల్లో పనులు ఎలా జరుగుతున్నాయి, వారికి కావాల్సిన మెటీరియల్‌ను సకాలంలో అందించడంతో పాటు ప్రొగ్రెస్ ఎలా ఉంది.. ఎక్కడైనా పనుల్లో వెనుకబడి ఉంటే ఎందుకు వెనుకబడిందని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా నాడు–నేడు 2 ఏ, బీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
నాడు.. గుండీలు ఊడిన చొక్కాలు.. జారిపోయే నిక్కర్లు.. చేతిలో పలక ఉంటే జేబులో బలపం ఉండదు.. మొన్నటివరకు ప్రభుత్వ పాఠశాలలకెళ్లే పేద పిల్లల పరిస్థితి ఇది. ఇక పాఠశాలల పరిస్థితీ ఇంచుమించూ ఇంతే. పెచ్చులూడే పైకప్పులు.. వర్షానికి ఉరిసే గదులు.. చెట్ల కింద చదువులు.. ఇక వానొసే సెలవే అన్నట్లు ఉండేది. రంగులు వెలిసిపోయి.. బూజు పట్టిన గోడలతో దుర్భరంగా ఉండేవి.
నేడు.. చక్కని యూనిఫాం.. మెడకు టై.. కాళ్లకు బూట్లు..అవసరమైన పిల్లలకు కంటి అద్దాలు.. పుస్తకాలు.. నోటు బుక్కులు.. ఇదీ నేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆహార్యం. ఇక ఆర్చి మొదలు తరగతి గది దాకా పాఠశాలలు కొత్త సొబగులు అద్దుకున్నాయి. రంగు రంగుల బల్లలు.. ఇంగ్లీషు ల్యాబులు.. స్వచ్ఛమైన మంచినీటి కుళాయిలు.. శుభ్రమైన మరుగుదొడ్లు. స్మార్ట్ టీవీలతో బోధన, విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్‌తో కళకళలాడుతున్నాయి.