AP Govt: తరగతి గదిలో ‘హలో’ ఏంటి?
చిత్తూరు కలెక్టరేట్ : దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితమవుతోంది. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అయితే గురువులే క్రమశిక్షణ పాటించకపోతే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. స్మార్ట్‌ఫోన్ల రాకతో చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడం అటుంచి ఫోన్లలో మాట్లాడడం, ఆన్‌లైన్ చాటింగ్‌లతో బిజీగా ఉండడంతో విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి. తరగతి గదుల్లో టీచర్లు సెల్‌ఫోన్‌ల వినియోగంపై ఉన్నతాధికారులకు నిత్యం ఫిర్యాదులు అందేవి. ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి పాఠశాలల్లో మొబైల్‌ఫోన్లను నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాలని ఆర్జేడీ, డీఈవో, డైట్ కళాశాల ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.
బోధనకు ఆటంకం కలగకుండా....
జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో బోధన సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మొబైల్ నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు వృత్తిపరమైన అవసరాలకు కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బోధనా సమయాన్ని వృథా చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వెళ్లాయి.
చదవండి: Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రిచే పురస్కారం...
ఫోన్లతో నష్టపోతున్న విద్యార్థులు
భావిభారత పౌరులను తీర్చిదిద్దే తరగతి గది వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే బోధన, అభ్యసన ప్రక్రియ అంత సాఫీగా సాగుతుంది. అయితే ఇటీవల ఉపాధ్యాయులు బోధిస్తున్న సమయంలో మొబైల్ మోగడం, వెంటనే బయటకు వెళ్లడం, లేదా విద్యార్థులకు చదువుకోమని చెప్పి ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌న్లతో కాలక్షేపం చేస్తుండడం ఎక్కువయ్యాయి. ఇదే అదనుగా భావించి విద్యార్థులు సైతం స్మార్ట్‌ఫోనన్లను పాఠశాలకు తీసుకురావడం మొదలుపెట్టారు. తరగతి గదిలోనే ఫోన్లు మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం, అల్లరి చేయడంతో క్రమశిక్షణ తప్పింది. దీంతో పాఠశాలల్లో మొబైల్ ఫోన్ నిషేధం విధించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా కొన్ని షరతులు విధించింది. ఈ నిషేధం అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓలకు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
హెచ్‌ఎం అనుమతితో
బయోమెట్రిక్ వేసిన వెంటనే హెచ్‌ఎం గదిలో, క్లర్క్ వద్ద మొబైల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అత్యవసరం అయితే హెచ్‌ఎం అనుమతి తీసుకుని ఉపయోగించాలి. తరగతి గదుల్లో విద్యాబోధన కోసం ప్రభుత్వం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్‌టీవీలు, ట్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు ఉదయం తొమ్మిదిన్నరకు ముందు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే మొబైల్ వినియోగించాలి. ఒకవేళ అటెండెన్స్ తీసుకోవడం ఆలస్యం అయితే సంబంధిత హెచ్‌ఎం అనుమతితో సెల్ ఫోన్ ఉపయోగించాలి. మొదటి సారి నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్‌ఎంకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. రెండోసారి మండల విద్యాశాఖాధికారితో మాట్లాడిన తర్వాత మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి. మూడోసారి అయితే ఉపాధ్యాయుడి సెల్‌ఫోన్‌ను డీఈవోకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. డీఈవోతో చర్చించిన తర్వాత మాత్రమే సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి సెల్‌ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీల సమయంలో సెల్ ఫోన్ నిషేధం నిబంధనలు ఖచ్చితంగా అమలవుతున్నాయో లేదో చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
చదవండి: 7547 SSC Constable Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు| పరీక్షా విధానం ఇదే!
జిల్లా సమాచారం పాఠశాలల్లో మొబైల్ ఫోన్ నిషేధం ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ కమిషనర్ డీఈవో, డీవైఈవో, ఎంఈవోలకు పర్యవేక్షణ బాధ్యతలు
పకడ్బందీగా అమలుకు చర్యలు
ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పాఠశాలల్లో సెల్‌ఫోన్‌ల నిషేధంపై జారీచేసిన ఉత్తర్వులను అన్ని మండలాల ఎంఈవోలకు, డీవైఈవోలకు పంపించాం. ఉపాధ్యాయులు తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడితే చర్యలు చేపడుతాం. విద్యార్థులతో పాటు టీచర్లు సెల్‌ఫోన్ తరగతి గదుల్లో వినియోగించరాదు.
– విజయేంద్రరావు, డీఈవో, చిత్తూరు.
ఉత్తర్వుల అమలుకు సన్నాహాలు
పాఠశాలల్లో సెల్‌ఫోన్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అందాయి. ఆ ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయనున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది. పాఠశాలల తనిఖీల సమయంలో టీచర్లు సెల్‌ఫోన్‌లు వినియోగిస్తున్నట్లు కనిపిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బోధన అభ్యసన ప్రక్రియ సజావుగా సాగుతుంది.
– చంద్రశేఖర్, డీవైఈవో, చిత్తూరు