Collector Nishant Kumar: బడిబయట పిల్లలను గుర్తించండి
పార్వతీపురం: బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సర్వేపై మండల పరిషత్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2005 సెప్టెంబరు 1వ తేదీ నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన పిల్లలు పాఠశాలలో ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బడి బయట ఉన్న పిల్లల కోసం సర్వే నిర్వహించి తక్షణం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సర్వేను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కోరారు. విద్యాశాఖ నిర్వహించే సర్వేలో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు, మృతి చెందిన విద్యార్థులు, కనిపించకుండా ఉన్న విద్యార్థుల వివరాలు ఉంటే నమోదు చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో సంక్షేమ, విద్యా సహాయకులు పర్యవేక్షణచేసి వలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయాలని చెప్పారు. సర్వేలో వలంటీర్లు విధిగా విద్యార్థుల ఆధార్ సంఖ్య నమోదు చేయాలని, గ్రామంలో ఉన్నప్పటికీ బడి బయట ఉన్న పిల్లల జాబితా, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారి జాబితా, ఇతర జిల్లాల్లో చదువుతున్న విద్యార్థుల జాబితా తయారుచేయాలని ఆదేశించారు.
చదవండి: Primary Education: ‘ప్రాథమిక’ విద్యపై ప్రత్యేక శ్రద్ధ
నాణ్యమైన సర్వే చేసిన వారికి ప్రోత్సాహం
బడి బయట ఉన్న వారిని విధిగా బడిలో చేర్పించాలని, వారు నిరంతరం పాఠశాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. నాణ్యమైన సర్వే చేసిన వారికి తగిన ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్మీడియట్ వరకు శతశాతం స్థూల నమోదు నిష్పత్తి జరగాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు పాల్గొన్నారు.