Education Funds : బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలందరికీ తల్లి వందనం ఇవ్వాల్సిందే..!
అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది.
మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఎన్‌డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి.
ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
Narayana Health: దేశంలోనే తొలిసారి.. రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా!
ఖర్చులు తడిసిమోపెడు..
పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం.
భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది.
Tamil Actor Vijay : నీట్ పేపర్ లీక్ వివాదంపై.. ప్రముఖ నటుడు విజయ్ ఏమన్నారంటే..?
ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కాలయాపన.. కోతలు
2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది.
ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Dress Code For Students: టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు కళాశాల ఆదేశాలు
డ్రాప్ అవుట్స్‌కు అడ్డుకట్ట..
బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు.
జీఈఆర్..
2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.
Free Civils Coaching: సివిల్ సర్వీసెస్ లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణకు నేడే ఆఖరు
జూన్‌లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..
పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్‌కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.
Tomorrow Holiday news: రేపు విద్యా సంస్థలు బంద్ ఎందుకంటే..
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..
నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు.
– పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా
మాట ప్రకారం డబ్బులివ్వాలి
గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి.
– పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లా
Super Large Warhead: వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
పాత వాటికి పేర్లు మార్చారే కానీ
పిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి.
– సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా
ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు
నా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది.
– మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లా
బడులు మొదలైనా ఆ ఊసే లేదు
గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి.
– రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా
పిల్లలను ఆదుకోండయ్యా..!
పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
– పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా
World Sports Journalists Day: జూన్ 2న అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం