Heavy School Bags: తప్పని పుస్తకాల భారం... చిన్నారులకు ఆరోగ్య సమస్యలు!!
పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాల సంచి భారంగా మారుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారన్నది వైద్యుల మాట. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) చేసిన సూచనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏటా పుస్తకాల సంచిలో బరువు పెరగడమే తప్ప... తగ్గడం కనిపించడం లేదు. విద్యార్థి తన శరీర బరువులో రెండో వంతు మోయడం అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో పుస్తకాల సంచి పరిమాణాన్ని తగ్గిస్తూ రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.
School Teachers : ప్రతీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు..
తగ్గని బరువు...
వాస్తవానికి ఒకటి, రెండు తరగతులకు రెండు పుస్తకాలు(లాంగ్వేజెస్, గణితం), మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కేవలం మూడు పుస్తకాలు(లాంగ్వేజెస్, గణితం, ఎన్విరాన్మెంట్) ఉండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తుంది. అయితే ప్రస్తుతం ఒకటి రెండు తరగతులకు ఎనిమిది పుస్తకాలు, తర్వాత పెరిగే కొద్దీ అధిక పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ మోయాల్సి వస్తోంది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.
ఆరోగ్య సమస్యలు ఇవే...
విద్యార్థులు తమ స్థాయికి మించి బరువు మోస్తుండడంతో పలు రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- వెన్ను, కండరాల నొప్పులకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
- శారీరక, మానసిక సమస్యలు ఏర్పడవచ్చంటున్నారు.
- చదువులపై ఏకాగ్రత తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.
- సృజనాత్మకత దెబ్బతినడమే కాకుండా తద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని పేర్కొంటున్నారు.
ఇదీ ఎన్‌సీఈఆర్‌టీ పరిశీలన
బడిసంచి బరువుపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వ హించిన సర్వేలో నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను పరిశీలించారు.
- సాధారణంగా వీరి శరీర బరువు 18 కేజీల నుంచి 22 కేజీల వరకు ఉంటుంది.
- ప్రభుత్వ బడుల్లో 10 నుంచి 12 కేజీలు,
- ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 14 నుంచి 18 కేజీల పుస్తకాల మోత ఉంటుంది.
- 8 నుంచి 10వ తరగతి విద్యార్థుల శరీర బరువు 40 నుంచి 50 కేజీల వరకు ఉంటే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా భావించాలి.
- వారు బడికి వెళ్లేందుకు 20 నుంచి 25 కేజీల సంచిని మోయాల్సి వప్తోంది.
- పాఠ్యపుస్తకాలకు తోడు క్యారేజీ, తాగునీటి బాటిల్స్ తదితరాలు అదనం.
- ప్రభుత్వ బడులు కన్నా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల మోత ఎక్కువగా ఉంటుందని శిక్షణ మండలి పేర్కొంది.
- రాష్ట్ర సిలబస్‌తో పాటు పాఠశాలలు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్, ఐఐటీ, సీబీఎస్‌ఈ ఇలా వివిధ రకాల పుస్తకాలను మోయాల్సి రావడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.
ప్రభుత్వ జీఓ ఇలా
విద్యార్థుల బడి సంచి బరువుపై రాష్ట్ర ప్రభుత్వం 2017లో జీఓ నంబర్ 22 విడుదల చేసింది. దాని ప్రకారం తరగతుల వారీగా బ్యాగు బరువు ఇలా ఉండాలని సూచించింది.
తరగతి బరువు(కిలోలు)
- 1–2: 1.50 kg
- 3–5: 2–3 kg
- 6–7: 4 kg
- 8–9: 4–5kg
- 10: 5kg
ఆరోగ్యంపై దుష్ప్రభావం
విద్యార్థులు తమ సామర్థ్యానికి మించి పుస్తకాల సంచిని మోయడం మంచిది కాదు. మానసికంగా బలహీనత, నడుము, వెన్నుపూస, కండరాల నొప్పులు బాధిస్తాయి. తద్వారా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. పుస్తకాల సంచి బరువును తగ్గించే ప్రయత్నాలు కచ్చితంగా చేయాలి. అప్పుడే ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. చక్కటి విద్యాభ్యాసం చేస్తారు.
–డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, సత్తెనపల్లి