Dropout Students: డ్రాపౌట్స్ విద్యార్థులపై దృష్టి పెట్టాలి
సాక్షి.పాడేరు: జిల్లా వ్యాప్తంగా డ్రాపౌట్స్ విద్యార్థులపైన దృష్టి పెట్టాలని, వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యా ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లోను జగనన్న విద్యా కానుక కిట్లను వారంలోగా పంపిణీని పూర్తి చేయాలన్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే హాజరు నమోదు చేస్తున్నారని, విద్యార్థులకు సైతం ఇలాగే హాజరు వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు విధానాలను వీడాలని సూచించారు. విద్యార్థుల హాజరుపై డీఈవో సమీక్షించాలన్నారు. పాఠశాలల్లో బినామీ ఉపాధ్యాయులుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలలను తనిఖీలు చేసి విద్యా ప్రమాణాలపై సమీక్షించాలని ఆదేశించారు. ఐటీఐ పాసైన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.
చదవండి: Degree Admissions: డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం
అంకిత భావంతో చదువులు చెప్పండి : ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్‌గౌర్
జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 13,227 మంది విద్యార్థులకు అంకితభావంతో చదువులు చెప్పాలని ఇంటర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్‌గౌర్ సూచించారు. టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరిని గుర్తించి, వారికి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఖాళీ లెక్చరర్ పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీ విధానంలో భర్తీ చేస్తామన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 1.66 లక్షల మంది విద్యార్థులకు జేవీకే కిట్లు పంపిణీ చేశామని, 21 వేల మంది కొత్తగా పాఠశాలల్లో చేరడంతో మరో 15 వేల కిట్లు అవసరం ఉంటుందన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు అధికంగా స్పందన వినతులు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే, విద్యా శాఖ జేడీ జ్యోతికుమారి, డీఈవో సలీమ్‌బాషా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు పాల్గొన్నారు.