Skip to main content

AP Education Schemes: జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం.. అదే నెల నాలుగో వారంలో నిధుల‌ పంపిణీ!

‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల­లు పునఃప్రారంభం కానుండ‌గా అదే నెల‌లో నాలుగో వారంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధుల‌ను జ‌మ చేస్తారు..
School Reopening Preparations for Jagananna Ammaodi Scheme   Jagananna Ammaodi Scheme Announcement  Education Support   Jagananna Ammaodi Scheme Implementation  Distribution of scheme funds to mothers account after the re open of schools

అమరావతి: గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల­లు పునఃప్రారంభం కానున్నాయి.

అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థుల­కు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలు చేసింది.

Development in Education System: సీఎం జగన్‌ పాలనలో విద్యాభివృద్ధి.. పేద విద్యార్థుల చదువు కోసం..!

‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొ­డ్లు–­వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు­ చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువు­తున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 

ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..
ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్‌ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. 

Transfers and Promotions: ఉపాధ్యాయుల ప‌దోన్న‌తులు, బ‌దిలీలు చేప‌ట్టాలి..!

కార్పొరేట్‌ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..
గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్‌ అందజేస్తోంది. కార్పొరేట్‌ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్‌ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్‌ మీడియం బోధన, డిజిటల్‌ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.

EAMCET 2024: ముగిసిన ఎంసెట్ ప‌రీక్ష‌లు.. ఎంత‌మంది హాజ‌ర‌య్యారంటే..!

ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..
ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్‌ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.

వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్‌ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.

Second Semester Exams: ఈనెల 15 నుంచి డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.

బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ 
మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్‌ పాఠశాలల్లో చదు­వుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొ­లిరోజు జూన్‌ 12న జగనన్న విద్యా కానుక కిట్ల­ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పా­ట్లు చేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్‌లో బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్‌–­తెలుగు), నోట్‌బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలి­తో మూడు జతల యూనిఫామ్‌ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యా­ర్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షన­రీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్‌ డిక్షనరీ గ­ల కిట్‌ను మొదటిరోజే అందజేయ­నుంది.

ఇప్ప­టివరకు ఇలా నాలుగు సార్లు అందజేయ­గా, గ­తే­డాది రూ.1,042.53 కోట్ల ఖర్చు­తో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకా­నుకను అందించారు. 2024–25 విద్యా సంవ­త్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధం­చేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదా­పు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్‌ పాయింట్లకు చేరుస్తారు.

Internship Agreement: విద్యార్థుల ఇంట‌ర్న్‌షిప్‌కు ఒప్పందం..!

గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..
జగనన్న అమ్మ ఒడి.. 
సంవత్సరం    లబ్ధిదారులు    నగదు (రూ.కోట్లలో)
2019–20          42,33,098          రూ.6,349.6
2020–21         44,48,865           రూ.6,673.4
2021–22         42,62,419           రూ.6,393.6
2022–23         42,61,965           రూ.6,392.9

జగనన్న విద్యాకానుక ఇలా..
విద్యా సం.    లబ్ధిదారులు    నిధులు (రూ.కోట్లలో)
2020–21      42,34,322         రూ.648.10
2021–22      47,32,064         రూ.789.21
2022–23      45,14,687         రూ.886.69
2023–24      43,10,165         రూ.1,042.53

GATE Ranker: గేట్‌లో ఆల్ ఇండియా ర్యాంకు.. ఎంటెక్‌ బయో ఇంజినీరింగ్‌లో సీటు!

Published date : 13 May 2024 11:35AM

Photo Stories