Collector Ravi Pattanshetty: విద్యార్థిగా మారి.. పాఠాలు విని
కోటవురట్ల: జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి కాసేపు విద్యార్థిగా మారి బయాలజీ ఉపాధ్యాయుడి పాఠం విన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించడమే కాకుండా, ఉపాధ్యాయుల బోధనా పటిమను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్య అందాలనే తపనతోనే తరచూ ఆయన స్కూళ్లను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాములవాక జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. తొలుత 3, 4 తరగతుల విద్యార్థులతో మమేకమయ్యారు. వారికి గణిత పాఠ్యాంశాలపై ప్రశ్నలు వేశారు. నోట్ పుస్తకాలు పరిశీలించి పలువురు విద్యార్థులు సరిగా రాయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. 7వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల మధ్య బెంచీపై కూర్చుని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్(ఐఎఫ్‌పీ) ద్వారా బోధన చేయాలని బయాలజీ ఉపాధ్యాయుడిని ఆదేశించారు. ఉపాధ్యాయుడి బోధన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా ఇలా బోధన చేయగలుగుతున్నారా? అని హెచ్‌ఎం నారాయణను ప్రశ్నించారు. డిజిటల్ బోధన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, ఉపాధ్యాయులకు దీనిపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని సూచించారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్ నిర్మాణాన్ని పరిశీలించి, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. జగనన్న గోరుముద్దను రుచి చూసి బాగుందంటూ, రోజూ ఇలానే వండుతున్నారా? అంటూ హెల్పర్లను నవ్వుతూ ప్రశ్నించారు. పిల్లలకు ఇలాంటి రుచికరమైన భోజనమే అందించాలని సూచించారు.
చదవండి: Anganwadi Jobs: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు