Students: బాలలు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నరసరావుపేటఈస్ట్: పాఠశాల స్థాయి విద్యార్థులు తమ సృజనాత్మకతతో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ తెలిపారు. ఇందుకు బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ వంటి వేదికలు దోహదపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీలను డిప్యూటీ డీఈఓ కె.వేణుగోపాలరావు ప్రారంభించగా, విజేతలకు బహుమతులను జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ అందించారు. పల్నాడు జిల్లా పరిధిలోని 74 పాఠశాలల నుంచి 164 ప్రాజెక్ట్‌లు పోటీకి హాజరయ్యాయి. విజేతలకు బహుమతులు అందించిన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో పర్యావరణ హితంగా ప్రాజెక్ట్‌లు చేపట్టాలని, ప్రాజెక్ట్‌లు సామాజిక సమస్యలను పరిష్కరించేలా ఉండాలని తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత పెరిగేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికై న విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
చదవండి: National Education Day 2023: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది?
విజేతలు వీరే...
31వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి పోటీలకు హాజరైన 164 ప్రాజెక్ట్‌లలో 7ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరిలో కె.షాహిన్ (జెడ్పీ హైస్కూల్ (జి) మాచర్ల), వై.చంద్రవెంకటలక్ష్మీ (జెడ్పీ హైస్కూల్, బొగ్గరం), కె.శివాని (సాయి కేరళ స్కూల్, కుంకలగుంట), పి.జ్యోత్స్న (మోడరన్ హైస్కూల్, చిలకలూరిపేట), ఎం.హరిణి (జెడ్పీ హైస్కూల్, గణపవరం), కె.భరత్‌కుమార్ (జెడ్పీ హైస్కూల్, ధూళిపాళ్ల), ఏ.రమ్య (జెడ్పీ హైస్కూల్ పాలపాడు) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ ఏ.ఏ.మధుకుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాల అధ్యాపకులు రాజనాల వేణుమాధవ్, అశ్విని, త్రివేణి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు సిహెచ్.వీరప్పయ్య, ఎస్.రాజశేఖర్, రోజారమణి, బి.సీతారామయ్య, టి.శ్రీనివాసరావు వ్యవహరించారు.