Skip to main content

Indian Forest Service Jobs: అటవీ శాఖలో అత్యున్నత కొలువులు.. విజయం సాధించాలంటే!!

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌.. ఐఎఫ్‌ఎస్‌గా సుపరిచితం. ఆల్‌ ఇండియా సర్వీసుల్లో ముఖ్యమైన సర్వీస్‌. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైతే.. డీఎఫ్‌ఓగా కెరీర్‌ ప్రారంభించి.. పీసీసీఎఫ్‌ స్థాయికి చేరుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా.. ఐఎఫ్‌ఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ.. పోస్ట్‌ల భర్తీ చేపడుతున్న యూపీఎస్‌సీ.. తాజాగా ఐఎఫ్‌ఎస్‌–2022 ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలు, విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఐఎఫ్‌ఎస్‌ కెరీర్‌ గ్రాఫ్‌ తదితర అంశాలపై విశ్లేషణ..
upsc ifs notification 2022 relased, preparation‌ tips and guidance here
upsc ifs notification 2022 relased, preparation‌ tips and guidance here
  • ఐఎఫ్‌ఎస్‌–2022 ఎంపిక ప్రక్రియ ప్రారంభం 
  • 151 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్సీ
  • సైన్స్, టెక్‌ గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం
  • ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయంతో కొలువు
  • సివిల్స్‌ ప్రిలిమ్స్‌నే ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌గా నిర్వహణ

అటవీ సంరక్షణ, పర్యావరణ సంరక్షణ వంటి కీలక విధులను ఐఎఫ్‌ఎస్‌ అధికారులు నిర్వర్తిస్తుంటారు. ఈ కొలువు సొంతం చేసుకోవాలంటే.. యూపీఎస్‌సీ నిర్వహించే ఐఎఫ్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఐఎఫ్‌ఎస్‌–2022 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 151 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగానే ఈ ఏడాది ఐఎఫ్‌ఎస్‌ పోస్ట్‌ల సంఖ్య పెరగడం విశేషం. గత ఏడాది 110 పోస్ట్‌లకే నోటిఫికేషన్‌ వెలువడగా.. ఈసారి ఆ సంఖ్య 151కి పెరిగింది.
 

చ‌ద‌వండి: UPSC IFS Exam 2022: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌)లో 151 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
 

అర్హతలు

  • యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో కనీసం ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీ. లేదా అగ్రికల్చర్‌/ఫారెస్ట్రీలో బ్యాచిలర్‌ డిగ్రీ (లేదా) ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయో పరిమితి: 01.08.2022 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు లభిస్తుంది. 
  • అటెంప్ట్‌ల సంఖ్య: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు ఆరుసార్లు, ఓబీసీ అభ్యర్థులు తొమ్మిది సార్లు ఐఎఫ్‌ఎస్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అటెంప్ట్‌ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. గరిష్ట వయో పరిమితి ముగిసేలోపు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరు కావచ్చు.

మూడు దశల ఎంపిక ప్రక్రియ

ఐఎఫ్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. అవి.. 

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌
  • మెయిన్‌ పరీక్ష 
  • పర్సనాలిటీ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ.

ఒకటే ప్రిలిమినరీ ఎగ్జామ్‌

మూడు దశలుగా ఉండే ఐఎఫ్‌ఎస్‌ ఎంపిక ప్రక్రియలో.. తొలి దశ పరీక్ష ప్రిలిమినరీ. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షనే ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌గానూ పేర్కొంటున్నారు. అంటే.. ఐఎఫ్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా ఎంపికైన వారికి తర్వాతి దశలో ఐఎఫ్‌ఎస్‌కు ప్రత్యేకంగా మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: UPSC Civil Services Exam 2022: సివిల్స్‌ లక్ష్యంగా... సరైన ప్రణాళిక!!
 

రెండు పేపర్లలో ప్రిలిమినరీ పరీక్ష

ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అవి.. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–2(సీ–శాట్‌). ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుంది.  ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు రెండో పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13 మందిని ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌కు ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: UPSC ESE Prelims– 2022: తుది దశ సన్నద్ధత ఎలా!..
 

మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. ఆరు పేపర్లు

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ను ఆరు పేపర్లలో పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ ఆరు పేపర్లలో రెండు పేపర్లు ఉమ్మడి పేపర్లుగా.. మిగిలిన నాలుగు పేపర్లు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించినవి. ఆ వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ ఇంగ్లిష్‌ 300 మార్కులు
పేపర్‌–2 జనరల్‌ నాలెడ్జ్‌ 300 మార్కులు
పేపర్‌–3 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌–1 పేపర్‌–1 200 మార్కులు
పేపర్‌–4 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌–1 పేపర్‌–2 200 మార్కులు
పేపర్‌–5 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌–2 పేపర్‌–1 200 మార్కులు
పేపర్‌–6 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌–2 పేపర్‌–2 200 మార్కులు
మొత్తం మెయిన్‌ మార్కులు:     1400 మార్కులు


ఆప్షనల్స్‌ ఎంపిక

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్షలో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్‌సీ నిర్దిష్టంగా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల జాబితాను రూపొందించింది. అవి..అగ్రికల్చర్,అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ.

ఈ కాంబినేషన్లకు అనుమతిలేదు

  • మెయిన్‌లో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకునే క్రమంలో ఒకే తరహాలో ఉన్న రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోకూడదని యూపీఎస్సీ స్పష్టం చేస్తోంది. కొన్ని కాంబినేషన్లకు అనుమతి లేదు. ఇలా అనుమతి లేని ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ కాంబినేషన్‌ సబ్జెక్ట్‌ల వివరాలు.. 
    • అగ్రికల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 
    • అగ్రికల్చర్, యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌ 
    • అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ
    • కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ 
    • మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.
  • ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఒక ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ను మాత్రమే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి. మరో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా యూపీఎస్‌సీ నిర్దేశించిన నాన్‌–ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ల నుంచి ఎంచుకోవాలి.

చివరగా ఇంటర్వ్యూ

అభ్యర్థులు మెయిన్‌లో సాధించిన మార్కులు, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత 1:2(ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున) నిష్పత్తిలో చివరగా పర్సనాలిటీ టెస్ట్‌ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 300 మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో పొందిన మార్కులు, మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కులను కలిపి తుది విజేతలను ప్రకటిస్తారు.

విజయం సాధించాలంటే

ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు ప్రిలిమ్స్‌ సన్నద్ధత నుంచే పకడ్బందీగా వ్యవహరించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించి స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా ఏఏ అంశాలకు ఎంత వెయిటేజీ ఉంది.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. ప్రశ్నలు అడిగే తీరు ఎలా ఉంది.. తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: Latest Current Affairs

కరెంట్‌ అఫైర్స్‌

గత కొన్నేళ్ల ప్రిలిమ్స్‌ పేపర్ల సరళిని పరిగణనలోకి తీసుకుంటే.. కరెంట్‌ అఫైర్స్, అదే విధంగా కోర్‌ సబ్జెక్టులను సమకాలీన అంశాలతో కలిపి ప్రశ్నలు అడుగుతున్న ధోరణి కనిపిస్తోంది. కాబట్టి అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభ్యసనం సాగించాలి.

చ‌ద‌వండి: General Knowledge Categories

జీకే

మెయిన్‌ పరీక్షలో.. పేపర్‌–2గా జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటుంది. అభ్యర్థులు ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1 ప్రిపరేషన్‌నే మెయిన్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా రెండు పేపర్లకు ఒకే సమయంలో సంసిద్ధత లభిస్తుంది.

చ‌ద‌వండి: Online Tests
 

మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లు

ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి తోడ్పడే మరో వ్యూహం.. మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం. వాటి ఫలితాలను విశ్లేషించుకొని.. స్వీయ బలాలు, బలహీనతలను తెలుసుకోవాలి. వాటి ఆధారంగా తాము ఇంకా పదును పెట్టుకోవాల్సిన టాపిక్స్‌పై ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. 

ప్రిలిమ్స్‌ పేపర్‌–2

ఇది అర్హత పరీక్షే. కానీ.. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సొంతం చేసుకుంటేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేస్తారు. ఇందుకోసం బేసిక్‌ మ్యాథమెటిక్స్, న్యూమరసీ, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పై పట్టు సాధించాలి.

మెయిన్స్‌కు ప్రత్యేకంగా

మెయిన్స్‌ కోసం మరింత ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ సాగించాలి. వీలైనంత మేరకు.. ప్రిలిమ్స్‌కు మెయిన్స్‌కు ఒకే సమయంలో ప్రిపరేషన్‌ సాగించేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. జనరల్‌ నాలెడ్జ్‌లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్‌ సబ్జెక్ట్‌లు మొదలు సమకాలీన సమస్యల వరకు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

ఆప్షనల్స్‌లో విజయానికి

మెయిన్‌లో రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లు, ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లకు ఆప్షనల్స్‌కు సన్నద్ధత పొందాల్సి ఉంటుంది. బాగా పట్టున్న సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. ఆప్షనల్స్‌ను ఎంచుకున్నాక ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్‌ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో అభ్యసనం సాగించాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఆయా సబ్జెక్ట్‌లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వాటికి సంబంధించి పోటీ పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలను పరిశీలించాలి. వాటిని సాధన చేయాలి. అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ డొమైన్‌ నుంచి ఎంచుకోవాలి. రెండో ఆప్షనల్‌కు అందుబాటులో ఉన్న సబ్జెక్ట్‌ల సిలబస్‌ను పరిశీలించి.. తాము రాణించగలం అనుకున్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.

రైటింగ్‌కూ ప్రాధాన్యం

మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు రీడింగ్‌కే పరిమితం కాకుండా.. రైటింగ్‌ ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్ష సమయంలో ఒక్కో ప్రశ్నకు లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రాక్టీస్‌ చేయాలి. ఆప్షనల్‌ సబ్జెక్టులు కోర్‌ సబ్జెక్టులు. కాబట్టి వీటిపై పూర్తి పట్టు సాధించడం తప్పనిసరి. బేసిక్స్‌పై పట్టు, గత పేపర్ల సాధన చేయాలి.

నిర్దిష్ట ప్రణాళిక

అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైంప్లాన్‌ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం వెచ్చించాలి. ఆ సమయంలో ఆ సబ్జెక్ట్‌నే చదవాలి. ఆ తర్వాత మరో సబ్జెక్ట్‌వైపు దృష్టి పెట్టాలి. 

ఐఎఫ్‌ఎస్‌–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022
  • ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: జూన్‌ 5, 2022
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌: నవంబర్‌ 20, 2022 నుంచి 
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌
  • మెయిన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: www.upsc.online.nic.in, https://upsconline.nic.in/mainmenu2.php

రీడింగ్‌ ప్లస్‌ రైటింగ్‌

ఐఎఫ్‌ఎస్‌ పరీక్షల్లో విజయానికి ప్రిలిమ్స్‌ నుంచే రీడింగ్‌ ప్లస్‌ రైటింగ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. దీనివల్ల ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్‌కు అందుబాటులో ఉండే పరిమిత సమయంలో మెయిన్స్‌కు సమర్థవంతంగా ప్రిపరేషన్‌ సాగించే వీలుంటుంది. అదే విధంగా ప్రిలిమ్స్‌లోనూ కాన్సెప్ట్‌లు, అప్లికేషన్‌ అప్రోచ్‌లతో సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నల విషయంలో వేగంగా సమాధానాలు ఇచ్చే నేర్పు లభిస్తుంది. 
–బి.శివ శంకర్, ఐఎఫ్‌ఎస్‌–2020 విజేత

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

Published date : 15 Feb 2022 06:15PM

Photo Stories