Chennai Mathematical Institute Admissions: సీఎంఐ నోటిఫికేషన్ విడుదల.. అందించే కోర్సులు, కావాల్సిన అర్హతలు ఇవే..
ప్రముఖ సంస్థలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరి.. పరిశోధనల దిశగా అడుగులేయాలనుకునే అభ్యర్థుల కోసం చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ) నోటిఫికేషన్ వెలువడింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో.. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతోపాటు ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ప్రస్తుతం 2022 విద్యాసంవత్సరానికి సంబంధించి(సీఎంఐ)ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీఎంఐ ప్రత్యేకత, అందించే కోర్సులు, కావాల్సిన అర్హతలపై ప్రత్యేక సమాచారం...
సీఐఎం
నాణ్యమైన బోధన ప్రమాణాలు, మెరుగైన పరిశోధన వనరులు కలిగిన విద్యా సంస్థ చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్(సీఎంఐ). దేశీంగానే కాకుండా ప్రపంచ స్థాయి నిపుణులు సైతం వచ్చి ఈ సంస్థలో పాఠాలు చెబుతారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో.. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతోపాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్ కోర్సులను చేయాలనుకునే వారికి(ïసీఎంఐ) చక్కని వేదికగా చెప్పొచ్చు. 2006లో యూజీసీ ఈ సంస్థకు యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఇక్కడ కోర్సులను పూర్తిచేసుకున్న వారు దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
కోర్సులు, అర్హతలు
- బీఎస్సీ ఆనర్స్:మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులు, చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసేవారు కూడా దరఖాస్తుకు అర్హులే.
- ఎమ్మెస్సీ: మ్యాథ్స్,కంప్యూటర్ సైన్స్,డేటా సైన్స్
- అర్హత: డిగ్రీలో మ్యాథ్స్ లేదా బీస్టాట్ లేదా బీటెక్ చదువుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివిన వారు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో యూజీ కోర్సులు చదివిన వారు ఎమ్మెస్సీ డేటాసైన్స్ కోర్సుకు అర్హులు. సంబంధిత సబ్జెకుల్లో చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫెలోషిప్
ప్రతిభ కలిగిన అభ్యర్థులు యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందితే ప్రతి నెల రూ.5000 ఫెలోషిప్ అందిస్తారు. ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరిన వారికి రూ.6000, పీహెచ్‌డీ కోర్సులకు ఎంపికైన వారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.31వేలు, తర్వాతి మూడేళ్లు రూ.35వేల చొప్పున ఫెలోషిప్ చెల్లిస్తారు.
చదవండి: EAMCET 2022: టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ...
ఎంపిక ఇలా..
పైన తెలిపిన అన్ని కోర్సులకు అర్హత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ ఒలింపియాడ్‌లో ప్రతిభ చూపినవారు నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే వారికి పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి పరీక్షను నిర్వహించరు. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్ పీహెచ్‌డీ చేయాలనుకున్నవారు ఎన్‌బీహెచ్‌ఎం ఫెలోషిప్‌కు ఎంపికైతే.. పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అలాగే జెస్ట్ ద్వారా కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ అర్హత సాధించిన వారు కూడా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పరీక్ష విధానం
- రెండు బీఎస్సీ కోర్సులకు పరీక్షను ఉమ్మడిగా వంద పాయింట్లకు నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రూపంలో ప్రశ్నలుంటాయి. పార్ట్–ఎ–40, పార్ట్–బి–60పాయింట్లకు ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పార్ట్–ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఇందులో కనీస పాయింట్లు సాధిస్తేనే.. పార్ట్–బి మూల్యంకనం చేస్తారు. రెండు పార్ట్‌లలో సాధించిన పాయింట్ల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- పార్ట్–ఎలో 10 ప్రశ్నలు ఒక్కొ దానికి 4 పాయింట్లు, పార్ట్–బిలో 6 ప్రశ్నలు.. వీటికి 60 పాయింట్లు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ నుంచి అడుగుతారు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోసం
ఈ కోర్సుల కోసం నిర్వహించే పరీక్ష కూడా రెండు భాగాలుగా (పార్ట్–ఎ,బి) ఉంటుంది. పార్ట్–ఎలో కనీస మార్కులు సాధిస్తేనే పార్ట్ బీని మూల్యంకనం చేస్తారు. రెండు విభాగాల్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని.. ప్రవేశాలు కల్పిస్తారు. ప్రశ్నలన్నీ కూడా డిగ్రీ స్థాయి పాఠ్యాంశాల నుంచే ఉంటాయి. ఎమ్మెస్సీ డేటా సైన్స్ ప్రశ్నలు మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ నుంచి అడుగుతారు. గత ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాచారం సీఎంఐ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల సరళి, చదవాల్సిన అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30,2022
- పరీక్ష తేదీ: మే 22, 2022
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
- వెబ్‌సైట్: https://www.cmi.ac.in/
చదవండి: TS ECET: టీఎస్ ఈసెట్–2022 నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక విధానం ఇలా..