AP Polycet 2022: ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం ఇలా..
పదోతరగతి అనంతరం కెరీర్ పరంగా విద్యార్థి వేసే ప్రతి అడుగు ఎంతో కీలకమైంది. అదే భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. ఉజ్వలమైన కెరీర్ లక్ష్యాలకు మార్గంగా నిలుస్తుంది. మరి అటువంటి మార్గాల్లో ఒకటి.. పాలిటెక్నిక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పాలిసెట్ 2022 ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏపీ పాలిసెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం తదితర అంశాలపై ప్రత్యేక సమాచారం...
ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్ దరఖాస్తుకు అర్హులు.
AP Polycet Study Material
పరీక్షా విధానం: పాలిసెట్ పరీక్షను పెన్ అండ్ పేపర్(ఆఫ్‌ౖలñ న్) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్–50, ఫిజిక్స్–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమలులో లేదు.
AP Polycet
డిప్లామా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కాలవ్యవధి: టెక్నికల్ కోర్సులు మూడేళ్లు లేదా మూడున్నరేళ్ల కాలవ్యవధితో అందిస్తారు. సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి. కోర్సులో భాగంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.
ఉన్నత విద్య: డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఉన్నత విద్య మీద ఆసక్తి ఉంటే ఈసెట్ పరీక్ష రాసి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్/బీఈ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఈ విద్యార్హతతో ఎంసెట్, ఐఐటీ–జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలను కూడా రాసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
- దరఖాస్తులకు చివరి తేదీ: 18.05.2022
- ఏపీ పాలీసెట్ 2022 పరీక్ష తేది: 29.05.2022
- వెబ్‌సైట్: https://polycetap.nic.in