Skip to main content

వేద గణిత చిట్కాలు ఉపకరించాయి...

దేశంలోని ఐఐఎంలు, ఇతర టాప్ బీ-స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించిన అమ్మాయి నేహా మంగ్లిక్.
క్యాట్ విజయం కేవలం ఒక్కరోజు ప్రయత్నం వల్ల రాలేదు.. చిన్నతనం నుంచి వేగం, కచ్చితత్వంతో కూడిన గణిత సాధనలు, వేద గణిత చిట్కాలే సహకరించాయంటున్న నేహా సక్సెస్ స్పీక్స్..

మాది చిన్న కుటుంబం. అమ్మ ఢిల్లీలోని ఓ పాఠశాలలో టీచర్. నాన్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తమ్ముడు 11వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్య ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని ఆల్కాన్ పబ్లిక్ స్కూల్లో పూర్తిచేశాను. పదోతరగతిలో 96 శాతం మార్కులతో పాఠశాల టాపర్‌ని. 12వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం బిట్స్-పిలానీ క్యాంపస్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను.

ప్రిపరేషన్:
చిన్నతనం నుంచి లాజికల్, మ్యాథమెటికల్ పజిల్స్ సాధించడం అలవాటు. ఇంగ్లిష్ కవిత్వాలు చదవడమే కాకుండా సమయం దొరికినప్పుడల్లా స్వయంగా రాసేదాన్ని. ఈ అలవాట్లు క్యాట్ ప్రిపరేషన్‌కు పరోక్షంగా సహకరించాయి. క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ గ్రామర్‌పై మంచి పట్టు ఏర్పడింది. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ప్రధానంగా స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ప్రశ్నలను సాధించడంలో తడబడేదాన్ని. కానీ ఆన్‌లైన్‌లో లభించే వేద గణిత చిట్కాల అధ్యయనం వల్ల ప్రాథమిక అంశాలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారాలు చేయడంలో వేగం పెరిగింది. క్యాట్‌కు ఆర్నెల్ల ముందు నుంచి వీలైనన్ని ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాశాను. రోజుకు ఇన్ని గంటలని కాకుండా అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రిపరేషన్‌ను కొనసాగించాను.

కోచింగ్:
క్యాట్‌లో విజయం సాధించాలనుకునేవారు కోచింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందనేది నా అభిప్రాయం. కోచింగ్‌లో ఫ్యాకల్టీ అందించిన వివిధ సమస్యలకు/ప్రశ్నలకు సాధన విధానాలు క్యాట్ విజయానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివర్లో ఆన్‌లైన్ మాక్ పరీక్షలు కూడా రాశాను.

పరీక్ష గదిలో:
పరీక్ష రాసేటప్పుడు.. ప్రశ్నలకు ఎక్కువ సమయం వృథా చేయొద్దని ముందుగానే నిర్ణయించుకున్నాను. పరీక్షలోని అన్ని ప్రశ్నల(100)ను సాధించాను. నిర్దేశిత సమయంలోనే కచ్చితమైన సమాధానాలతో పేపర్‌ను పూర్తి చేశాను.

100 పర్సంటైల్:
పరీక్షలోనూ అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వగలిగాను. దాంతో మంచి పర్సంటైల్ వస్తుందని ముందే ఊహించా. కానీ కచ్చితంగా 100 పర్సంటైల్ వస్తుందని అనుకోలేదు. క్వాంటిటేటివ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 99.84, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌లో 100 పర్సంటైల్ సాధించాను. మొత్తంమీద 100 పర్సంటైల్ రావడం చాలా సంతోషం కలిగించింది. క్యాట్‌తోపాటు సీమ్యాట్, ఐఐఎఫ్‌టీ, ఎన్‌ఎంఏటీ తదితర ఎంబీఏ పరీక్షలను రాశాను. సీమ్యాట్‌లోనూ టాప్ ర్యాంకు సాధించాను. కానీ ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరాలనుకుంటున్నాను.

ఐఐఎం ఇంటర్వ్యూలకు సన్నద్ధం:
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రిపరేషన్‌ను రెండు వారాల కిందటే ప్రారంభించాను. అంతేకాకుండా ఇంజనీరింగ్‌లో చదివిన అంశాలను పునశ్చరణ చేసుకుంటున్నాను. ముఖ్యమైన వార్త లు, కరెంట్ అఫైర్స్‌ను రెగ్యులర్‌గా ప్రిపేరవుతున్నాను.

ఇంజనీరింగ్‌కు అనుకూలం.. అపోహ:
క్యాట్ పరీక్ష సిలబస్, విధానం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అనుకూలమనేది అపోహ మాత్రమే. కేవలం మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన విభాగాల్లోనే వీరు కొంచెం ముందుంటారు. ఇంజనీరింగ్ కోర్సుల ఎంట్రన్స్‌ల్లో మ్యాథ్స్ రాసిన అనుభవం క్యాట్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా క్యాట్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే విభాగాలున్నాయి. అవి.. వెర్బల్ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్. ప్రణాళికాబద్ధమైన ప్రాక్టీస్‌తో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా మంచి స్కోర్ సాధించవచ్చు.

సలహా:
క్యాట్‌కు సన్నద్ధమయ్యే సొంత సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోవాలి. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను, ప్రశ్నల సరళిని, క్లిష్టతను తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌లో ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దు. లక్ష్యంపై గురి తప్పనీయొద్దు. మాక్ పరీక్షలకు ఎక్కువగా హాజరై, తద్వారా ప్రిపరేషన్‌ను మెరుగుపర్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ప్రిపేరవ్వాలి. పట్టుదల బలంగా ఉంటే విజయం తప్పకుండా సొంతమవుతుంది.
Published date : 13 Jan 2015 02:54PM

Photo Stories