Inspiration Story: కోచింగ్ లేకుండానే... పోటీ పరీక్షల్లో హ్యాట్రిక్ టాపర్... ఆస్తులు మధర్‌థెరిస్సా ట్రస్ట్‌కే...
కోచింగ్ తీసుకోకుండా ఏకంగా మూడు పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఆ అధికారి పేరు చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్.
మిమిక్రీలోనూ ప్రావీణ్యం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కుమార్‌కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు మిమిక్రీ అంటే పిచ్చి. రేడియో, టీవీల్లో వచ్చే నేరెళ్ల వేణుమాధవ్ వంటి ప్రముఖుల మిమిక్రీ షోలు చూసి స్వతహాగా అనుకరించడం నేర్చుకున్నారు. మిమిక్రీపై ఆసక్తి చూపితే కెరీర్ పాడవుతుందని, చదువు ముఖ్యమని తల్లి భుజంగవేణి కుమారుడికి హితబోధ చేసేది. అమ్మ చెప్పిన మాటలను ఒంట బట్టించుకుని చదువులో రాణిస్తూనే, తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజంపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఇచ్చిన తొలి షోను అంతా మెచ్చుకోవడంతో దూసుకెళ్లారు. జెమినీ, దూరదర్శన్, ఆకాశవాణితో పాటు పలు సంస్థల తరఫున ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డులు, సన్మానాలు పొందారు.
2002లో జాతీయస్థాయిలో నంబర్ 1...
విశాఖలో పాలిటెక్నిక్, విజయవాడలో బీటెక్ (సివిల్) చదివారు. అనంతరం తొలిసారి జేఈ ఉద్యోగానికి ఆర్‌ఆర్‌బీ (సికింద్రాబాద్) పరీక్ష రాసి 2002లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆ ఉద్యోగంలో ఉంటూ 2005లో సెక్షన్ ఇంజినీర్ పోస్టుకి ఆర్‌ఆర్‌బీ (కోల్‌కతా) ఎగ్జామ్ రాసి దేశంలోనే మరోసారి టాపర్‌గా నిలిచారు. ఆ పోస్టులో ఉంటూనే ఏపీపీఎస్సీ 2007లో వెలువరించిన గెజిటెడ్ ఎగ్జామ్‌లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పొందారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ (గ్రూప్–1 కేడర్)గా శ్రీకాకుళం జిల్లాలో నియమితులయ్యారు. తర్వాత తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో విధులు నిర్వహించారు. విధి నిర్వహణతో పాటు తనకిష్టమైన మిమిక్రీలో ప్రదర్శనలిస్తూ జాతీయంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు అవార్డులు అందుకున్నారు.
శిథిలమైన సాదాసీదా భవనంలో నివాసం
విధి నిర్వహణలో కుమార్ సమర్థవంతుడన్న పేరుంది. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో తూర్పు గోదావరిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో స్టేట్ అవార్డు అందుకున్నారు. చిన్నపాటి ప్రభుత్వోద్యోగులే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఈ రోజుల్లో నిరాడంబరత కోరుకునే కుమార్ ఓ శిథిలమైన సాదాసీదా ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సామాజిక సేవలో భాగంగా 30 మంది పేద పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుంటారు.
మధర్‌థెరిస్సా ట్రస్టుకే నా ఆస్తులు
నేను సర్కారు బడిలోనే చదివాను. ఒక్కరోజూ కోచింగ్ తీసుకోలేదు. కేవలం మార్కెట్లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టే స్టేట్ టాపర్ ర్యాంకులు సాధించాను. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాను. నాకొచ్చే జీతంలో ఎలాంటి సేవింగ్స్ చేయడం లేదు. నా తదనంతరం ఆస్తిపాస్తులు మదర్ థెరిసా ట్రస్టుకివ్వాలని నిర్ణయించుకున్నానని కుమార్ చెప్తున్నారు.