Skip to main content

ప్రణాళికతో చదివా..తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించా : శ్రీకృష్ణ ప్రణీత్

‘చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) కోర్సును తొలి ప్రయత్నంలోనే సాధించొచ్చు. అందుకోసం కోర్సులో చేరినప్పటి నుంచి బేసిక్స్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి.
అలాగే అప్లికేషన్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకొని చదవాలి. అలా చేస్తే మొదటి ప్రయత్నంలోనే సులువుగానే సీఏ ఉత్తీర్ణులైయేందుకు అవకాశముంది’ అంటున్నాడు.. ఇటీవల విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విజయవాడ విద్యార్థి గుర్రం నాగ శ్రీకృష్ణ ప్రణీత్. సీఏలో విజయానికి సూచనలు, సలహాలు...

‘సీఏ’ అంటే ఆసక్తి :
మా స్వస్థలం విజయవాడ. నాన్న మధుసూధనరావు ఆటోమొబైల్ షాప్‌లో ఉద్యోగి. అమ్మ మల్లీశ్వరి గృహిణి. పదోతరగతి వరకు విజయవాడలోనే చదువుకున్నాను. పదో తరగతి పూర్తయ్యాక... సీఏ కోర్సులో చేరాలనే ఆసక్తి ఉందని నాన్నకు చెప్పాను. ఆయన ప్రోత్సహించారు. నా ఆసక్తి, నాన్న ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగలిగాను. మంచి ర్యాంకు వస్తుందని ఊహించాను.. కానీ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం ఆనందం కలిగిస్తోంది.

ఇంటర్ - ఎంఈసీతోనే..
ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్ చదివితే సీఏ కోర్సు సబ్జెక్ట్‌లకు అనుకూలంగా ఉంటుందని భావించి.. మాస్టర్‌మైండ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అక్కడే సీఏ సీపీటీ, ఐపీసీసీ దశలు పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ పూర్తవగానే సీఏ-సీపీటీ పరీక్షలకు హాజరై 156 మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. తర్వాత సీఏ-ఐపీసీసీలో 414 మార్కులు సాధించాను. సీఏ కోర్సులో ఎంతో కీలకమైన ఫైనల్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలంటే.. ప్రత్యేక ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రతిరోజు దాదాపు పదిహేను గంటలు చదవడంవల్ల తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాను. సీఏ విద్యార్థులు మొదటి నుంచి నిర్దిష్టంగా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ఎంచుకొని.. దాన్నే పదే పదే చదువుతుండాలి.

షార్ట్ నోట్స్ :
సీఏ పరీక్షల ప్రిపరేషన్‌లో భాగంగా సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యమైన అంశాలతో షార్ట్ నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ సులభం అవుతుంది. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి సందేహం ఉన్న టాపిక్స్‌ను నోట్ చేసుకునేందుకు డౌట్ బుక్స్ విధానాన్ని అనుసరించాలి. ఆ డౌట్ బుక్స్‌లో మీకు సందేహం ఉన్న అంశాలన్నింటినీ రాసుకోవాలి. వాటిని ఫ్యాకల్టీ లేదా పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఆధారంగా నివృత్తి చేసుకోవచ్చు.

ఇష్టం నుంచి కష్టం వైపు..
ప్రతి ఒక్కరికీ సబ్జెక్ట్‌ల పరంగా ఇష్టమైన సబ్జెక్ట్‌లు, కష్టమైన సబ్జెక్ట్‌లు ఉంటాయి. ప్రిపరేషన్ సమయంలో ముందుగా ఇష్టమైన సబ్జెక్ట్‌లను పూర్తిచేయాలి. ఆ తర్వాత కష్టమైన సబ్జెక్ట్‌లను అధ్యయనం చేయాలి. మనకు సులభం అనుకున్న సబ్జెక్ట్‌లలో ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రిపరేషన్ పరంగా.. కనీసం 70 నుంచి 80 శాతం సిలబస్‌ను పూర్తి చేయగలిగినా.. విజయం సాధించే అవకాశం ఉంది.

ప్రాక్టీస్ ప్రధానం :
సీఏ ఫైనల్ పరీక్షల ప్రిపరేషన్‌లో అధ్యయనంతోపాటు ప్రాక్టీస్ కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించాలంటే ప్రాక్టీస్‌తోనే సాధ్యం. మొత్తం ఎనిమిది సబ్జెక్ట్‌లకూ ప్రాధాన్యం ఇస్తూనే..కనీసం నాలుగు సబ్జెక్ట్‌లపై ప్రత్యేక దృష్టిసారించి చదవాలి. ఫలితంగా ఆయా సబ్జెక్ట్‌లలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది. ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు.. ఆ సమయంలో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉంటారు. దీనివల్ల సబ్జెక్ట్‌ల ప్రాక్టీస్‌కు కొంత దూరమవుతారు. కానీ.. పరీక్ష విధానాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో రైటింగ్, ప్రాక్టీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఫలితంగా పరీక్షలో మనం చేస్తున్న పొరపాట్లు తెలుసుకోవచ్చు.

అన్ని పేపర్లకు హాజరు కావాలి :
కొంతమంది విద్యార్థులు పరీక్షల సమయంలో ఒక పేపర్ సరిగా రాయకపోతే.. మిగతా పేపర్‌లకు హాజరు కారు. ఇది సైరైన విధానం కాదు. అన్ని పేపర్లకు హాజరుకావాలి. నేను రెండు పేపర్లు యావరేజ్‌గా రాశాను. 40 మార్కులే వస్తాయనుకున్నాను. కానీ ఆ రెండు పేపర్లలోనే 60కి పైగా మార్కులు వచ్చాయి. అందువల్ల బాగా రాయని పేపర్ గురించి నిరుత్సాహ పడకుండా.. మిగతా పేపర్ల పరీక్షలు రాయడానికి యత్నించాలి. ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చదువుతూ.. పరీక్షలో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమాధానాలు రాస్తే సీఏలో విజయం సాధించొచ్చు.
Published date : 21 Jan 2020 04:17PM

Photo Stories