Skip to main content

సీఏ ఫౌండేషన్ ర్యాంకర్ల విజయ రహస్యాలు...

ఇది కష్టమైన కోర్సని భావిస్తూ... ఎంతో మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు జంకుతుంటారు.
కానీ...ఇష్టంతో చదివితే సీఏ ఫౌండేషన్‌లోమంచి ర్యాంకులు సాధించవచ్చని నిరూపించారు మన తెలుగు విద్యార్థులు. జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించిన సీఏ ఫౌండేషన్ ర్యాంకర్ల విజయ రహస్యాలు...

అకౌంట్స్, మ్యాథ్స్‌పై దృష్టి :

మాది శ్రీకాకుళం. నాన్న అప్పారావు అకౌంటెంట్. అమ్మ నాగరత్నం గృహిణి. నా చిన్నప్పటి నుంచే నాన్న చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సుపై అవగాహన కల్పించారు. తర్వాత మాస్టర్‌మైండ్స్‌లో చేర్పించారు. కోర్సులో భాగంగా ప్రతి సబ్జెక్టును పూర్తి ఏకాగ్రతతో చదివాను. అకౌంట్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు అధిక సమయం కేటాయించాను. ప్రతి కాన్సెప్టును అర్థం చేసుకుంటూ అధ్యయనం చేశాను. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన అన్ని రివిజన్ టెస్ట్‌లు రాశా. రోజూ తప్పనిసరిగా తరగతులకు హాజరై, ఉపాధ్యాయులు చెప్పిన ముఖ్యాంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకున్నాను. వీటన్నిటి ఫలితమే ఫౌండేషన్‌లో ఉన్నత విజయం. 400 మార్కులకు 344 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. హార్డ్‌వర్క్ చేసే స్వభావం ఉంటే సీఏలో తప్పనిసరిగా విజయం సొంతమవుతుంది.
- కె.సాయిశ్రీకర్, ఆలిండియా 2వ ర్యాంకు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి :

మాది శ్రీకాకుళం. నాన్న పట్టాభి రామారావు ఇంజనీర్. అమ్మ లక్ష్మి గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంటర్ ఎంపీసీ తర్వాత సీఏ కోర్సులో చేరా. నేను కళాశాలలో అందించిన మెటీరియల్‌ను మాత్రమే చదివాను. అకౌంట్స్‌కు సంబంధించిన లెక్కలను ప్రత్యేకంగా నోట్‌బుక్‌లో ప్రాక్టీస్ చేశా. రోజూ తప్పనిసరిగా తరగతులకు హాజరయ్యాను. కళాశాలలో నిర్వహించిన అన్ని పరీక్షలు రాశాను. ఫలితాలను విశ్లేషించుకొని, ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్దుకున్నాను. సీఏ ఫౌండేషన్‌లో ఆలిండియా 37వ ర్యాంకు సాధించాను. సీఏ కోర్సు పూర్తిచేసి, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనేది నా లక్ష్యం. చాలామంది అనుకుంటున్నట్లు సీఏ పెద్ద కష్టమైన కోర్సు కాదు. ఓ ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదివితే విజయవంతంగా కోర్సును పూర్తిచేయొచ్చు. కోర్సులో భాగంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- నారాయణశెట్టి హర్షిత, ఆలిండియా 37వ ర్యాంకు.

ఆసక్తి ప్రధానం :

మాది కాకినాడ. ఇంటర్ ఎంపీసీ తర్వాత సీఏ కోర్సులో చేరాను. ఫౌండేషన్ సన్నద్ధతలో భాగంగా కాలేజీ నిర్వహించిన అన్ని పరీక్షలు రాశాను. అకౌంట్స్, ఎం.లాకు అధిక సమయం కేటాయించాను. కాలేజీలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, మోటివేషన్ తరగతులకు హాజరవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగింది. వారాంతపు పరీక్షలన్నీ రాశాను. రివిజన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల 95 శాతం సిలబస్‌ను పూర్తిచేయగలిగాను. దీంతో తొలిదశను మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయడంతో పాటు ఆలిండియా 42వ ర్యాంకు సాధించాను. ఇదే విధంగా మిగిలిన దశలను విజయవంతంగా పూర్తిచేసి మంచి సీఏగా రాణించాలనేది నా లక్ష్యం. సీఏ కోర్సులో విజయం సాధించాలంటే తొలుత కోర్సుపై ఆసక్తి ఉండాలి. మంచి శిక్షణ సంస్థను ఎంపిక చేసుకోవడమూ ముఖ్యమే.
- కడియాల సురేంద్ర, ఆలిండియా 42వ ర్యాంకు.

కాన్సెప్టులపై పట్టు సాధించాలి :
కొత్తగా సీఏ కోర్సులో ప్రవేశించాలనుకునే వారు పదో తరగతి పూర్తికాగానే ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్‌కు సిద్ధమవడం మంచిది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులపై మరింత పట్టు సాధించొచ్చు. సన్నద్ధత సమయంలో ప్రత్యేకంగా టైంటేబుల్‌ను రూపొందించుకొని, దాన్ని అనుసరించాలి. ప్రాబ్లమాటిక్ పేపర్లలోని ముఖ్యాంశాలను మెటీరియల్/నోట్స్‌లో హైలెట్ చేయాలి. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం ముఖ్యం. కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా విజయాన్ని అందుకోవచ్చు.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 20 Aug 2019 04:45PM

Photo Stories