Skip to main content

‘సీఏ ఫౌండేషన్’-2020 ఫలితాల్లో టాపర్లగా నిలిచాం ఇలా...

చార్టర్డ్ అకౌంటెన్సీ.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ పేరుతో మూడు దశలుగా నిర్వహించే కోర్సు. ఇందులో తొలిదశ ఫౌండేషన్ నుంచే చక్కటి ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించడం చాలా అవసరం.
ఎందుకంటే.. ఫౌండేషన్ కోర్సులో మెరుగ్గా రాణిస్తే మిగతా రెండు దశల్లో సబ్జెక్ట్‌లను ఆకళింపు చేసుకోవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తేలికవుతుంది. ఈనేపథ్యంలో.. సీఏ ఫౌండేషన్‌లో రాణించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై.. తాజా సీఏ ఫౌండేషన్ ఫలితాల టాపర్లు ఏం చెబుతున్నారో చూద్దాం...

లక్ష్యంపై స్పష్టతతో విజయం :
మాది కర్నూలు జిల్లా, కోసిగి గ్రామం. లక్ష్యంపై స్పష్టత ఉంటే ఫౌండేషన్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సులభమే. వాస్తవానికి ఇంజనీరింగ్ లక్ష్యంగా ఎంపీసీలో చేరా. ఆ తర్వాత సీఏ కోర్సు ఎంపీసీ విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలుసుకొని మాస్టర్‌మైండ్స్‌లో చేరా. కోర్సులో చేరిన రోజు నుంచే ఫౌండేషన్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాలన్న లక్ష్యంతో రోజుకు 12 గంటలు కష్టపడ్డా. ఫలితంగా ఆలిండియా స్థాయిలో 28వ ర్యాంకు వచ్చింది. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఏరోజుకారోజు చదువుతూ.. కాన్సెప్ట్స్ అవగాహన చేసుకుంటూ సాధన చేస్తే ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదు. రివిజన్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్‌కు హాజరవడం కూడా నా విజయంలో కీలకంగా నిలిచింది. కోర్సులో చేరేవారు సిలబస్‌పై అవగాహన, కాన్సెప్ట్‌లపై పట్టు సాధించి, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగిస్తే.. ఫౌండేషన్‌లో విజయం సాధించటం తేలికే.
- బి.ఈరేశ్, సీఏ ఫౌండేషన్ ఆలిండియా 28వ ర్యాంకర్

ఇంజనీరింగ్ లక్ష్యం నుంచి సీఏ దిశగా..
మాది శ్రీకాకుళం జిల్లా పలాస. నాన్న బాలకృష్ణ ఆటోడ్రైవర్. తొలుత ఇంజనీరింగ్‌పై ఆసక్తితో ఎంపీసీలో చేరా. ఐఐటీలో ర్యాంకు రాకపోవడం.. అదే సమయంలో సీఏ కోర్సు అవకాశాల గురించి తెలియడంతో సీఏ లక్ష్యంగా ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేసుకున్నా. లక్ష్యం సాధించేందుకు తొలిరోజు నుంచీ కృషి చేశా. ఫౌండేషన్ పరీక్షల్లో రాణించాలంటే.. సిలబస్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి.
- ఆర్.అనూష, సీఏ-ఫౌండేషన్ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు

హార్డ్ వర్క్‌తోనే సక్సెస్..
మాది చిత్తూరు జిల్లాలోని వీకేఆర్ పురం గ్రామం. నాన్న రాజా, కూలీ. నాకు సీఏ పట్ల ఉన్న ఆసక్తితో పదో తరగతిలోనే సీఏ చదవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇంటర్లో ఎంఈసీ చేశా. ఆ తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరా. ఫౌండేషన్ కోర్సులో చేరినప్పటి నుంచి వీకెండ్ ఎగ్జామ్స్, సిలబస్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకునేలా ఎప్పటికప్పుడు చదవడం, రివిజన్ టెస్ట్స్‌కు హాజరు కావడం నా విజయానికి ఉపకరించాయి. సీఏ ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే.. కష్టపడే తత్వం తప్పనిసరి.
- టి.హరికృష్ణ, సీఏ-ఫౌండేషన్ ఆలిండియా 45వ ర్యాంకు

నిర్దిష్ట ప్రణాళికతోనే విజయం...

మాది పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు. నాన్న వెంకట దుర్గా ప్రసాద్ వడ్రంగి వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పటికీ.. నా లక్ష్యం తెలుసుకుని ప్రోత్సహించారు. దాంతో పదో తరగతి నుంచే సీఏ దిశగా అడుగులు వేశా. ఇంటర్లో ఎంఈసీ గ్రూప్‌లో చేరా. ఫౌండేషన్ కోర్సులో అడుగుపెట్టిన రోజు నుంచే నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుని దాని ప్రకారం చదివా. అకౌంట్స్, లా సబ్జెక్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చా. సిలబస్‌పై అవగాహనతో ఆయా సబ్జెక్ట్‌లలో మన సామర్థ్యం తెలుసుకొని.. ప్రిపరేషన్ వ్యూహాన్ని అనుసరిస్తే ఫౌండేషన్ పరీక్షలో మంచి మార్కులు సాధించొచ్చు.
-జి.విశ్వనాథ్, సీఏ-ఫౌండేషన్ ఆలిండియా 49వ ర్యాంకు

కష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం:
నా పేరు మామిడాల త్రివేణి. మాది కృష్ణా జిల్లా, నందిగామ. ఇంజనీరింగ్ లక్ష్యంగా ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీలో చేరా. జేఈఈ-మెయిన్‌లో 93.94 శాతం మార్కులతో మంచి ర్యాంకు సొంతం చేసుకున్నా. కానీ ఆ ర్యాంకుతో సుదూర ప్రాంతాల్లోనే సీటు వస్తుంది. అంత దూరం వెళ్లడం ఇష్టం లేకపోవడంతో సీఏ కోర్సుపై దృష్టిసారించా. ఫౌండేషన్ కోర్సులో చేరా. ఫౌండేషన్ సిలబస్‌లో నాకు కష్టంగా ఉండే ఎకనామిక్స్ సబ్జెక్ట్ ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించా. దీంతో ఫౌండేషన్‌లోని అన్ని సబ్జెక్ట్‌లపై చక్కటి అవగాహన వచ్చింది. నాలానే చాలామంది విద్యార్థులకు క్లిష్టమైన సబ్జెక్ట్‌లుటాయి. ఈ సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తూ.. రివిజన్ టెస్టులకు హాజరైతే ఆశించిన ఫలితం కచ్చితంగా వస్తుంది.
- ఎం.త్రివేణి, సీఏ-ఫౌండేషన్ ఆల్ ఇండియా 50వ ర్యాంకు

ఏ గ్రూప్ వారికైనా అనుకూలమే..
సీఏ కోర్సు, అందులోని తొలిదశ ఫౌండేషన్ కొన్ని గ్రూప్‌ల విద్యార్థులకే అనుకూలం అనేది అపోహ మాత్రమే. ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన విద్యార్థులైనా ఫౌండేషన్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు ఆస్కారం ఉంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. జాతీయ స్థాయిలో టాప్-50లో నిలిచిన పై అయిదుగురిలో ముగ్గరు ఎంపీసీ విద్యార్థులే. విద్యార్థులు తమ లక్ష్యానికి అనుగుణంగా తొలిరోజు నుంచే నిర్దిష్ట ప్రణాళికతో చదవాలి, కాన్సెప్ట్యువల్ అప్రోచ్‌తో వ్యవహరించాలి. అలా చేస్తే ఫౌండేషన్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించొచ్చు.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, మాస్టర్‌మైండ్స్
Published date : 19 Feb 2020 11:59AM

Photo Stories