Skip to main content

సాధించాలని ఉంటే ఏదైనా సాధ్యమే.. ఐసెట్ ఫస్ట్‌ర్యాంకర్ వెంకటబాలాజీ అంతరంగం

సాధించాలనే సంకల్పం ఉండాలేకానీ.. ఎంతటి అసాధ్యాలైనా.. సుసాద్యాలేనంటు న్నాడు ఐసెట్-2013 స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్ బిట్ర వెంకట బాలాజీ. గంటల తరబడి చదివేదానికన్నా ఏకాగ్రతతో గంటసేపు చదివినా మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నాడు. వేలాదిమందితో పోటీపడి.. మొదటిసారే.. 177 మార్కులు సాధించి ఫస్ట్‌ర్యాంకు తెచ్చుకున్న వెంకట బాలాజీ విజయరహస్యం ఏమిటో.. అతనిమాటల్లోనే..

చిన్నప్పటి నుంచి లెక్కలంటే ఇష్టం ఉండటం వల్ల ర్యాంకు సాధించగలిగాను. మంచి ర్యాంకు వస్తుందనుకున్నా ఫస్ట్ ర్యాంకు రావటం ఆనందంగా ఉంది. మాది విజయవాడ ఇంటర్ వరకూ అక్కడే చదువుకున్నా. నాన్న బాబురావు టైలర్. అమ్మ విజయలక్ష్మి గృహిణి. ఆర్థికంగా స్థితిమంతులంకాకపోయినా అమ్మానాన్నలు నాకు..తమ్ముడికీ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. తమ ఆలోచనలను మా మీద రుద్దకుండా పెంచారు. మంచి చదువులు చెప్పించాలనే వారి సంకల్పమే మమ్మల్ని చదివించింది. పదో తరతగతి 536, ఇంటర్ 934 మార్కుల తెచ్చుకున్నా. 2006 ఎంసెట్‌లో స్టేట్ -14 ర్యాంకు నాది. జె.ఎన్.టి .యు(హైదరాబాద్)లో బీటెక్ 67 శాతం మార్కులతో పూర్తిచేశాను. మాదావూర్‌లోనే ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ప్రత్యేకంగా ప్రిపరేషన్ అంటూ ఏమీలేదుకానీ.. గణితంపై మంచిపట్టు ఉండటంతో ర్యాంకు వచ్చింది. అనలిటికల్ ఎబిలిటీ మెటీరియల్ సిద్ధంచేసుకున్నా. గతంలో వచ్చిన ఐసెట్ ప్రశ్నాపత్రాలన్నింటినీ క్షుణ్నంగా చదివా. జూనియర్ లెక్చరర్‌గా బోధన చక్కగా ఉపకరించింది. సీనియర్ లెక్చరర్లు నా సందేహాలను నివృతి చేసేవారు. రోజుకు 2-3 గంటలు చదివాను. సాధారణ విద్యార్థులైనా .. కష్టపడి చదివితే ర్యాంకు సాధించటం పెద్ద కష్టమేం కాదు.

సివిల్స్ నా లక్ష్యం.. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తయింది. తప్పకుండా సాధించగలననే నమ్మకం ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వచ్చినా.. మరో సారి ప్రయత్నించి విజయం సాధించగలననే ఆత్మవిశ్వాసంతో చదువుతున్నా. నాకు దిశానిర్దేశం చేసి చదువులో రాణించేందుకు కారణమైన మా లెక్చరర్ రాజగోపాల్ నాకు స్ఫూర్తి. మీరూ.. ఓ లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం పరిశ్రమిస్తే ఎవరైనా విజేతలు కావచ్చు.
Published date : 31 May 2013 07:32PM

Photo Stories