Skip to main content

పరిశోధనలతో దేశ ప్రతిష్టను పెంచుతా

జేఈఈ మెయిన్స్ జాతీయస్థాయి నాల్గో ర్యాంకర్ పారునంది కార్తికేయశర్మ
పిల్లల మనసెరిగి ప్రోత్సహిస్తే విజేతలుగా నిలుస్తారనేందుకు జేఈఈ మెయిన్స్ (బీఆర్క్)లో జాతీయస్థాయిలో నాల్గోర్యాంకు, స్టేట్‌లో ఫస్ట్‌ర్యాంకు సాధించిన పారు నంది కార్తికేయశర్మ విజయమే నిదర్శనం. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుతూ.. బోర్ కొట్టినపుడు లైబ్రరీకెళ్లి పజిల్స్ పూర్తిచేయటం ఇతడి హాబీ. ఎక్కడ ఏ పోటీ నిర్వ హించినా బహుమతి కొట్టాల్సిందే. అంతేనా.. రచనా వ్యాసంగం పట్ల అమితమైన ఆసక్తి. ఈ మధ్యనే ఒక నవల కూడా రాశాడట. అందుకేనేమో చదువంటే పొద్దస్తమాను పుస్తకాలకు అతుక్కుపోవటం కాదంటున్నాడీ ర్యాంకర్. పరీక్షలను పోటీగా భావించకుండా రాయమని సూచిస్తున్నాడు. తన విజయ రహస్యాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు.

మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది వరంగల్ జిల్లా. ప్రస్తుతం రంగంపేటలో ఉంటున్నాం. అమ్మ మాధవి, నాన్న లలిత్‌కుమార్ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తమ్ముడు శ్రవణ్‌శర్మ ఇంటర్ బైపీసీ చదువుతున్నాడు. నాల్గో తరగతి వరకూ మా తాత పారునంది లక్ష్మినారాయణశర్మగారి ఊరు నర్మెట్టలో చదువుకున్నా. తర్వాత 8వ తరగతి వ రకూ ఆక్స్‌ఫర్డ్‌లో చదివా. 9, 10వ తరగతి నక్కలగుట్ట విజ్ఞాన్‌హైస్కూల్. ఇంటర్మీడియట్ దిల్‌సుఖ్‌నగర్ నారాయణ కాలేజీలో చదివా.

జేఈఈ-మెయిన్స్‌లో టాప్ ర్యాంకు సాధనపై మీరు ఎలా ఫీలవుతున్నారు?
సీరియస్‌గా ప్రిపరేషన్ చేయకపోవటం వల్ల 50 లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. సరదాగా వెళ్లి పరీక్షరాసినా.. నాల్గోర్యాంకు రావటం చాలా ఆనందంగా ఉంది. శ్రద్ధ పెడితే మంచి ర్యాంకు తెచ్చు కోవటం తేలిక అనిపించింది.

ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచిని ఎంచుకుంటారు? ఎందుకు?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 214 ర్యాంకు వచ్చింది. ఐఐటీలో చేరాలనుంది. ఐఐటీ కంప్యూ టర్‌సైన్సులో చేరాలనుంది. పోటీపరీక్షల ప్రిపరేషన్‌లో భాగంగా బీఆర్క్ రాశా.

మీ అకడమిక్ రికార్డు చెప్పండి?
లెక్కలంటే చాలా చాలా ఇష్టం. మ్యాథ్స్‌లో ఎప్పుడూ వందమార్కులు నావే. చదువుతోపాటుగా వ్యాసరచన, డిబేటింగ్, క్విజ్, గేమ్స్ అన్ని పోటీల్లో చాలా పతకాలు వచ్చాయి. పదోతరగతి 569, ఇంటర్ 982 మార్కులు వచ్చాయి.

జేఈఈతోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
ఎంసెట్ 600 వ ర్యాంకు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్(ఐఎస్‌ఐ, కోల్‌కత్తా) మంచిర్యాంకు వచ్చింది. విట్ 111, బిట్‌శాట్355 ర్యాంకులు వచ్చాయి. ఐఐటీ లక్ష్యంగా చదవటం వల్ల మిగిలిన పోటీపరీక్షలు తేలిగ్గా అనిపించాయి.

ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే జేఈఈ వంటి పోటీపరీక్షలకు ఎలాంటి ప్రిపరేషన్ అనుసరించారు?
ఇంటర్ కోసం ప్రత్యేకంగా చదవలేదు. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే సిలబస్ ఇంటర్‌కు చాలా ఎక్కువ. లాంగ్వేజెస్‌కు రెండు నెలలు సరిపోయాయి. రోజూ 7 గంటలు చదవటం మామూలు.

కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
పరీక్షలో ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతోగాక సబ్జెక్టుపై పట్టు సాధించేలా కాలేజీలో శిక్షణ ఉండేది. మాక్‌టెస్టులు పరీక్షలో ఎంత కష్టమైన ప్రశ్నలిచ్చినా సమాధానం ఇచ్చేంత నమ్మకాన్ని పెంచాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు భాగాలుగా వేసుకుని చదివేవాణ్ని. క్లాసుకు వెళ్లటానికి ముందే నోట్స్ ప్రిపేర్‌చేసుకుని ఆ ప్లాన్ ఫాలో అయ్యేవాణ్ని. సబ్జెక్టుపై మరింత కమాండ్ కోసం క్లాసు రూంలో సబ్జెక్టులపై గ్రూపుడిస్కషన్ చేసేవాళ్లం. మా సందేహాలను ఎప్పటికప్పుడు నివృతి చేసేందుకు లెక్చరర్స్ అందుబాటులో ఉండేవాళ్లు.

మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
ర్యాంకు కోసం కేవలం క్లాస్‌ుబుక్స్ ఒక్కటేకాదు. లైబ్రరీకు వెళ్లి అక్కడ కనిపించిన పజిల్స్ పూర్తిచేసేవాణ్ని. మ్యాథ్స్ ఆర్.డి.శర్మ, ఐ.ఏ.మారన్, ఫిజిక్స్ హెచ్.సి.వర్మ, కెమిస్ట్రి-ఫిజిక్స్ పీటర్స్క్రిన్, ఇన్‌ఆర్గానిక్స్ జె.డి.లీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎల్.జి.వాడే(జూనియర్) వంటి నిపుణులు రాసిన పుస్తకాలు చదివేవాణ్ని. వాటిలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ సబ్జెక్టులో మరింత పట్టు సాధించేందుకు ఉపకరించాయి.

అధ్యాపకులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం?
డెభ్బైఐదేళ్ల వయసులోనూ ఉత్సాహంగా సమాజానికి ఉపయోగపడేలా ఉన్న తాతయ్య పారునంది లక్ష్మినారాయణ, ఇంటర్ చదివేటపుడు పెళ్లయినా తర్వాత డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తిచేసి టీచర్‌గా ఎదిగిన అమ్మ మాధవి, అపజయం ఎదురైనపుడు భయపడొద్దు ఈ సారి విజయం నీదేనంటూ భుజంతట్టే నాన్న లలిత్‌కుమార్ స్ఫూర్తి మరవలేనిది. కాలేజీలో కూడా గ్రాండ్‌టెస్టులో చేసిన తప్పులను సరిదిద్ది.. ర్యాంకు సాధించేందుకు లెక్చరర్స్ ఎంతో సహకరించారు.

మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి?
నూతనతరం రాబోటిక్స్‌లో పరిశోధనలు చేయాలన్నదే నా లక్ష్యం. టెక్నాలజీలో దేశాన్ని ముందుకు నడి పేందుకు శాస్త్రవేత్త కావాలనుంది. అందుకే కంప్యూటర్ సైన్సు పూర్తిచేసి తర్వాత రీసెర్చ్ వైపు వెళతాను. చిన్నప్పటి నుంచి కథలు, పద్యాలు, నవలలు రాసేవాణ్ని. ఈ మధ్యనే ఒక నవల పూర్తిచేశాను. ఇంకా దానికి పేరుపెట్టలేదు. అది కూడా పూర్తిచేయాలనుంది.

జేఈఈ వంటి పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారికి మీరిచ్చే సలహా?
‘కసి, కృషి ఉంటే దిశ, దశ మారి ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి చేరతార'oటూ అమ్మ ఎప్పుడూ చెప్పే మాట నాకు ఆదర్శం. పరీక్షరాసేందుకు వెళ్లే ముందు మనం పోటీపడుతున్నామనే భయాన్ని వీడండి. సబ్జెక్టుపై కమాండ్ ఎంత అవసరమో.. మున్ముందు కెరీర్‌లో ఎదిగేందుకు సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం, వీటిని సమన్వయం చేసుకుంటూ సబ్జెక్టులను ఎలా చదవాలనేది ప్రణాళిక వేసుకుంటూ చదివితే చాలు. వీటన్నింటి కంటే ముందు మీలో పోటీ అనగానే ఏర్పడే భయాన్ని పొగొట్టండి.
Published date : 05 Jul 2013 03:56PM

Photo Stories