Skip to main content

మినియాకా.. మట్టిలో మాణిక్యం!!

క్యాట్‌ కొట్టి...ఐఐఎం లో సీటు పట్టాడు
ఒడిశాలోని ఒక మారుమూల ప్రాంతం.. మౌలిక సౌకర్యాలు ఏ మాత్రంలేని ఓ కుగ్రామం.. దేశంలోనే అట్టడుగు గిరిజన తెగ కొంథా. ఈ నేపథ్యాలేవీ ఆ యువకుడి లక్ష్యసాధనకు అడ్డుకాలేదు. ఒకవైపు చదువుకుంటూ.. మరోవైపు తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ.. క్యాట్‌-2012 పరీక్షలో విజయకేతనం ఎగురవేశాడు. ప్రతిష్టాత్మక ఐఐఎంలలో సీటు సంపాదించి ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు .

కుటుంబ నేపథ్యం:
మా ఊరు ఒడిశాలో రాయగడ జిల్లాలోని సెరిగుమ్మ. కనీస సౌకర్యాలకు నోచుకోని కుగ్రామం. అందులో మాది అత్యంత పేద కుటుంబం. దేశంలోనే అభివృద్ధి ఆనవాళ్లు తెలియని అట్టడుగు గిరిజన(కొంథా) తెగ మాది. మా కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నవాడిని. నాన్న, అన్నయ్యలు వ్యవసాయం చేస్తారు.

విద్యాభ్యాసం:
పదో తరగతి ద్వితీయ శ్రేణిలో, ఇంటర్మీడియెట్‌ రాయగడ టౌన్‌ కళాశాలలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. ఆ తర్వాత 2010లో భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సెన్సైస్‌(కేఐఎస్‌ఎస్‌)లో బీకాంలో చేరి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. నా చదువు పేదరికం మధ్య కొనసాగింది. చదువు పూర్తి చేసే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. కానీ చిన్నప్పటి నుంచి చదువంటే ఉన్న ఇష్టంతో పోల్చుకుంటే.. ఈ కష్టాలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి.

కిస్‌ అందించిన చేయూతతో:
డిగ్రీ కోసం కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సెన్సైస్‌(కిస్‌) లో చేరడం నా దశను మార్చింది. ఈ విద్యా సంస్థ కల్పించిన చక్కటి వాతావరణం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, శిక్షణతో క్యాట్‌కు సిద్ధమయ్యాను. క్యాట్‌లో 56.46 పర్సంటైల్‌ సాధించాను. కిస్‌ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. ఈ సంస్థ సుమారు 20వేల మంది గిరిజన బాలబాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా బోధనను అందిస్తోంది. అంతేకాకుండా ఉచిత భోజన, వసతి సదుపాయాలను కూడా కల్పిస్తోంది. నా విజయంలో కిస్‌ పాత్ర గణనీయమైంది.

ఐదు ఐఐఎంల నుంచి ఆహ్వానాలు:
నాకు తమ సంస్థల్లో చేరాల్సిందిగా ఐదు ఐఐఎంల నుంచి ఆరు ఆహ్వానాలు అందాయి. ఐఐఎం రాంచీ (జార్ఖండ్‌) నుంచి 2, ఐఐఎం-రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌), కాశీపూర్‌ (ఉత్తరాఖండ్‌), ఉదయ్‌పూర్‌ (రాజస్థాన్‌), తిరుచిరాపల్లి (తమిళనాడు) నుంచి ఒక్కో ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఐఐఎం- తిరుచిరాపల్లిలో చేరాను.

భవిష్యత్‌ లక్ష్యమిదే:
దేశంలోనే అత్యంత వెనుకబడి ఉన్న గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను అందించి వారికి అండగా నిలబడటమే నా లక్ష్యం!!

-ఎస్వీ రమణమూర్తి,
న్యూస్‌లైన్‌, భువనేశ్వర్‌.
Published date : 20 Jun 2013 06:44PM

Photo Stories