Skip to main content

మైక్రోసాఫ్ట్ మెచ్చిన ట్రిపుల్ ఐటీ కుర్రాడు...

మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా పేరొందిన సంస్థ. విశ్వవ్యాప్తంగా విస్తరించిన సంస్థ. అంతటి ప్రఖ్యాత సంస్థ కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా.. పరిశోధనలకూ ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధకులకు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ పేరుతో ఫెలోషిప్‌లు అందిస్తోంది. మన దేశంలో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా ఫెలోషిప్ పేరిట బహూకరించే ఫెలోషిప్స్‌కు ఎంపికైన ఐదుగురిలో ఒక్కరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విద్యార్థి యశస్వి వర్మ. ఇంతటి అద్భుత అవకాశం రావడం తన అదృష్టం అంటున్న యశస్వి మనోభావాలు అతని మాటల్లోనే..

మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థ అందించే ఫెలోషిప్స్‌కు ఎంపికవడం ఎంతో సంతోషం కలిగించింది. ఇది నా భవిష్యత్తు పరిశోధనలకు ప్రోత్సాహకరంగా నిలుస్తుందని భావిస్తున్నాను.

ఒక్క మెయిల్‌తో:
వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ ఫెలోషిప్ గురించి మా ఇన్‌స్టిట్యూట్ (ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్) వర్గాల ద్వారానే తెలిసింది. ఈ ఫెలోషిప్ గురించి డీన్
(ఆర్ అండ్ డీ) కార్యాలయం నుంచి ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులందరికీ ఈ-మెయిల్ సందేశం అందింది. దానికి స్పందించి దరఖాస్తు చేసుకున్నాను.

సులభంగా దరఖాస్తు ప్రక్రియ:
మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ ఫెలోషిప్ దరఖాస్తు ప్రక్రియ ఎంతో సులభం. సంస్థ నిర్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రెజ్యుమెకు, రీసెర్చ్ స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, ముగ్గురు ప్రొఫెసర్ల రికమండేషన్ లెటర్లను జత చేసి పంపడమే. అలా పంపించిన దరఖాస్తులను, పరిశోధన అంశాలు, వాటి ప్రాముఖ్యత, వాటిపై దరఖాస్తుదారులు ఇప్పటివరకు చేసిన పరిశోధనలకు సంబంధించిన వివరాలను.. సంస్థకు చెందిన సీనియర్ పరిశోధకులు పరిశీలించి ఎంపికలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) పీహెచ్‌డీ విద్యార్థులే అర్హులు.

ఫెలోషిప్‌తో ప్రయోజనాలు:
ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి స్టేషనరీ, ఇతర లేబొరేటరీ అవసరాల కోసం నెలకు రూ. 20 వేల స్టైపెండ్ లభిస్తుంది. ఈ సదుపాయం గరిష్టంగా నాలుగేళ్ల వరకు అం దుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎంపికైన ప్రతి విద్యార్థికీ ఒక ల్యాప్‌టాప్ అందజేస్తారు. దీంతోపాటు వివిధ సెమినార్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేందుకు ఈ నాలుగేళ్ల వ్యవధిలో రూ. 2.50 లక్షలు అందిస్తారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ విభాగం నిర్వహించే పలు ఈవెంట్స్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఆసక్తి.. ఆటోమేటిక్ ఇమేజ్ యాన్నొటేషన్:
ప్రస్తుతం నేను ఆటోమేటిక్ ఇమేజ్ యాన్నొటేషన్ (Automatic image annotation)లోని ఒక సమస్యపై పరిశోధన చేస్తున్నాను. ఒక చిత్రంలోని అర్థాలపై అవగాహన చేసుకోవడం, వాటిని పుస్తక సమాచారం ఆధారంగా వర్ణించడం.. ఇదీ పరిశోధన సారాంశం. ఇది ఎంతో ఆసక్తికరమైన సమస్య. కారణం.. కంప్యూటర్ విజన్, ప్యాట్రన్ రికగ్నిషన్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి బహుళ అంశాలను అర్థం చేసుకోవాల్సిన విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలో ఒకే సమయంలో అన్ని అంశాలపై అవగాహన కలుగుతుంది.

సీఎస్ అండ్ ఐటీ.. నిరంతర పురోగతి:
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్ అండ్ ఐటీ) నిరంతరం పురోగతి సాధిస్తున్న విభాగం. మన జీవితంలో దాదాపు ప్రతి విషయంలో సీఎస్ అండ్ ఐటీ ఇమిడి ఉంటోంది. కాబట్టి కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భవిష్యత్తు గురించి బెంగ అనవసరం.

పరిశోధకులకు ప్రోత్సాహకాలు ఎన్నో:
ప్రస్తుతం మన దేశంలో పరిశోధకులకు ఎన్నో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పరిశ్రమల వైపు నుంచి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలైతే.. పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులు విదేశీ సెమినార్లకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తున్నాయి. ఈ రకంగా పరిశోధనలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి. పరిశోధన రంగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు.. ముందుగానే సదరు పరిశోధన ఎంత కాలానికి పూర్తవుతుందో అనే విషయం ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మానసికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కొన్ని రంగాల్లో త్వరగా, మరికొన్ని రంగాల్లో కొంత ఆలస్యంగా పరిశోధనలు పూర్తవుతాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం లభిస్తుంది.

భవిష్యత్తు లక్ష్యం:
పరిశోధనల్లో భాగంగా వాస్తవ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు కృషి చేస్తా.

అకడమిక్ ప్రొఫైల్:
  • జోథ్‌పూర్ (రాజస్థాన్)లోని సెంట్రల్ అకాడమీలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియెట్ తత్సమాన) కోర్సు.
  • 2011లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీటెక్ (ఆనర్స్).
  • ఆ తర్వాత ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ.
Published date : 25 Jul 2013 04:23PM

Photo Stories